బాపట్ల జిల్లా పెదపాలెంలో రోడ్డు పక్కనే ఉన్న సమాధులు , శ్మశానవాటిక కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన భూమి
బాపట్ల జిల్లా భట్టిప్రోలు నుంచి సాక్షి ప్రతినిధి బి.ఫణికుమార్:
రాష్ట్రంలోని దళితవాడలను తరతరాలుగా ఓ సమస్య వేధిస్తోంది. ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు ప్రశాంతంగా నిర్వహించలేకపోవడమే ఆ సమస్య. వారికి శ్మశాన వాటికలు లేకపోవడమే దానికి కారణం. అలాంటి సమస్య ఉన్న గ్రామాల్లో బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు పంచాయతీ శివారున పెదపాలెం దళితవాడ ఒకటి. 150 ఇళ్లు ఉన్న ఆ ఊళ్లో ఎవరైనా చనిపోతే వారికి అంత్యక్రియలు ఎక్కడ చేయాలనేది పెద్ద సమస్య.ఆ గ్రామం ఏర్పడి వందల ఏళ్లయినా అక్కడ మాత్రం శ్మశానం లేదు. రోడ్డు పక్కన, చెట్ల చాటున, పొదల మధ్య, కంచెల్లో, బురదలో ఎక్కడో ఒక చోట ఆరు అడుగుల నేల వెతుక్కుని అక్కడ అంత్యక్రియలు చేసేవారు.
శ్మశానం కోసం భూమి ఇవ్వాలని ఆ ఊరి వాళ్లు అనేక సంవత్సరాలుగా పాలకులను అడుగుతూనే ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ ఊరికి మాత్రం శ్మశానం ఏర్పడలేదు. దళితుల కష్టాలకు చరమగీతం పాడుతూ, వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు వారికి కొండంత భరోసా ఇస్తున్నాయి.ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎక్కడా శ్మశాన వాటికలు లేని దళిత వాడలు ఉండకూడదనే సీఎం నిర్ణయం ఆ గ్రామ ప్రజల కష్టాలు తీర్చింది. గ్రామానికి ఆనుకుని సర్వే నంబర్ 273/2, 3లో శ్మశానం కోసం ఇటీవలే ప్రభుత్వం ఎకరం భూమి కేటాయించింది. ఇన్నాళ్లకు గ్రామానికి బాధ తప్పిందని, జగన్ వల్లే తమ కష్టాలు తీరాయని ఆ గ్రామానికి చెందిన యాజలి లూకయ్య సంతోషంగా చెప్పాడు.
సీఎం లక్ష్యంతో నెరవేరిన కల
ఎన్నితరాలు మారినా ఇంకా రాష్ట్రంలోని అనేక దళితవాడల్లో శ్మశానాలు లేవు. ఇప్పటి వరకు వారికి ఆ ఆరడుగుల వేదన తీరలేదు. అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు అనేక దళిత వాడలు చెట్లూ, పుట్టలు, రోడ్ల పక్కన ఖాళీ స్థలాలపై ఆధారపడే దుర్భర పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఈ సమస్య తన దృష్టికి వచ్చిన మరుక్షణం నుంచే వైఎస్ జగన్ రాష్ట్రంలో శ్మశాన వాటిక లేని దళితవాడ ఉండకూడదని నిర్ణయించారు. సమాజంలో వెనుకబడిన వారికోసం ఆ గ్రామాల్లోనే శ్మశాన వాటికల సదుపాయం కల్పించడానికి చకచకా ఏర్పాట్లు చేశారు.
ఈ నేపథ్యంలో శ్మశాన వాటికలు లేని దళితవాడలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో 1,854 గ్రామాల్లో శ్మశానాలు లేవని, వాటి కోసం 1,230 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. ఆ గ్రామాల జనాభాను బట్టి అర ఎకరం నుంచి ఎకరం భూమిని శ్మశాన వాటికల కోసం ఇచ్చే అధికారాన్ని కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చింది.దీంతో ఇప్పటికే 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఈ నెల 17న ఏలూరు జిల్లా నూజివీడులో జరిగే సభలో సీఎం వైఎస్ జగన్ ఆ శ్మశాన వాటికల కోసం భూమి కేటాయింపు పత్రాలను ఆ గ్రామాల వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
భూ సమీకరణ చేసైనా..
దళితవాడలను అనేక సంవత్సరాలుగా శ్మశాన వాటికల సమస్య పీడిస్తున్న గత పాలకులు వాటిపై దృష్టి పెట్టలేదు. తమ గ్రామానికి శ్మశాన వాటికల కోసం భూమి ఇవ్వాలని దళిత వాడల ప్రజలు ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు అడిగినా ఎవరూ స్పందించలేదు. చూద్దాం, చేద్దామనే వారే తప్ప వారి బాధను అర్థం చేసుకున్న వారే లేరు.
మొట్టమొదటిసారి ఈ సమస్య మళ్లీ వినపడకుండా చేయాలనే సంకల్పంతో సీఎం జగన్ ఒకేసారి శ్మశాన వాటికలు లేని దళిత వాడలన్నింటికీ భూమి కేటాయించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ప్రభుత్వ భూమి లేని చోట భూ సమీకరణ చేసైనా శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆరు అడుగుల కోసం వెతికేవాళ్లం
మా ఊళ్లో ఎవరైనా చనిపోతే మా పరిస్థితి దారుణంగా తయారయ్యేది. చివరి కార్యక్రమాల కోసం గ్రామం చుట్టు పక్కల ఆరు అడుగుల భూమి కోసం వెతికేవాళ్లం. నలుగురూ నాలుగు దిక్కులకు వెళ్లి రోడ్డు పక్కన ఎక్కడైనా అనువైన స్థలం ఉందేమో చూసేవాళ్లం. ఎవరైనా అడ్డు చెబితే మళ్లీ వేరే స్థలం వెతికేవాళ్లం. పొదల్లోనో, చెట్ల చాటునో ఎక్కడో ఒక చోట భూమిని వెతికి అలాంటి దారుణమైన స్థితిలోనే ఇప్పటివరకు అంత్యక్రియలు చేస్తున్నాం.
మా గ్రామానికి శ్మశానం కోసం భూమి ఇవ్వాలని ఎంతమందిని అడిగామో లెక్కే లేదు. ఓట్ల కోసం మా ఊరు వచ్చినప్పుడు ఆ పని చేస్తామని చెప్పేవారు. ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకునే వారు కాదు. పెద్దల చుట్టూ తిరిగి అలిసిపోయాం. జగన్ వచ్చి మా కష్టాలు తీర్చారు. మమ్మల్ని తలెత్తుకునేలా చేశాడు. మా గ్రామానికి శ్మశానం కోసం ఎకరం భూమి ఇచ్చారు.
– యాజుల రఘుబాబు, పెదపాలెం దళితవాడ, భట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా.
జగనన్న మాకు గౌరవాన్ని కల్పించారు
మా తాతల కాలం నుంచి శ్మశానం కోసం భూమి ఇవ్వాలని అడుగుతూనే ఉన్నాం. ఎన్ని కష్టాలు పడ్డామో చెప్పలేం. ఎవరైనా కాలం చేస్తే ఊరంతా ఆందోళన చెందేది. చనిపోయిన వాళ్లకి అంత్యక్రియలు కూడా గౌరవంగా చేయలేకపోతున్నామే అని బాధపడేవాళ్లం. ఇన్నాళ్లకి ఆ సమస్యని జగనన్న పట్టించుకుని మా ఇబ్బందిని తీర్చారు. ఇకపై మా ఊరికి శ్మశానం లేదనే బాధ లేదు.
అంతకుముందు ఎంతమందిని శ్మశానం కోసం స్థలం ఇవ్వాలని అడిగినా పట్టించుకోలేదు. చేద్దామనే వాళ్లు తప్ప చేసేవాళ్లు కాదు. కాళ్లావేళ్లా పడితే అదెంత పని అనేవాళ్లు. తీరా చూస్తే ఏమీ పని జరిగేది కాదు. మా కష్టం ఇప్పటికి తీరింది.
– పోతర్లంక సుజని, పెదపాలెం దళితవాడ, భట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా.
Comments
Please login to add a commentAdd a comment