
ముందు తనపై పెట్రోల్ పోసుకుని..ఆపై పెద్దాయనకూ నిప్పంటించిన వివాహిత
ఇరువురికీ తీవ్రగాయాలు.. వివాహిత పరిస్థితి విషమం
బాపట్ల టౌన్ : అతడికి 64 ఏళ్లు. ఆమెకు 54. ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలున్నాయి. పెళ్లీడుకొచ్చిన సంతానం ఉన్నారు. ఆర్థికంగా స్థిరపడినవారే. పిల్లలు ఉన్నత విద్యావంతులు. అయినా వారి వల్లమాలిన వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ పెద్దాయన తన మాట వినలేదనే ఆవేశంలో ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ ఘటన బాపట్లలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు...రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తులాబందుల లక్ష్మీనారాయణ బాపట్ల రైల్వేస్టేషన్ ఎదుట ఐఆర్‌సీటీసీ సెంటర్ నిర్వహిస్తున్నారు.
పట్టణానికి చెందిన నల్లమోతు మాధవితో కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇదిలాఉండగా లక్ష్మీనారాయణ భార్య అరుణాదేవి కళ్ళకు ఆపరేషన్ చేయించే నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మాధవి లక్ష్మీనారాయణను వెళ్ళటానికి వీల్లేదంటూ అడ్డగించింది. కుటుంబ సభ్యులతో కలిసి అరుణాదేవిని పంపించాలంటూ హెచ్చరించింది. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో శుక్రవారం ఉదయం తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ముందు తనపై పోసుకొని ఆ తర్వాత లక్ష్మీనారాయణపై పోసి నిప్పంటించింది.
రైల్వే స్టేషన్ ఎదురుగా ఐఆర్‌సీటీసీ బుకింగ్ కౌంటర్ నుంచి పొగలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అప్పటికే మాధవి 80 శాతం, లక్ష్మీనారాయణ 60 శాతం కాలిపోయారు. వెంటనే స్థానికులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాపట్ల సీనియర్ సివిల్‌జడ్జి పరామర్శించి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఇరువురినీ గుంటూరు తరలించారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
— Kumaruuu💙 (@CalmnessSoull) April 11, 2025