
స్థానికుల భయాందోళనలు
బాపట్ల: మార్టూరులో ఆదివారం ఉదయం క్షుద్ర పూజల ఆనవాళ్లు స్థానికంగా కలకలం రేకెత్తించాయి. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నేతాజీ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం ఈ క్షుద్ర పూజల ఆనవాళ్లను గమనించిన స్థానికులు విలేకరులకు సమాచారం అందించారు.
అక్కడ పరిశీలించిన విలేకరులకు ప్రత్యేకంగా కుంకుమ చల్లి దానిపై మహిళకు చెందిన జాకెట్టును పెట్టి ముగ్గు వేసి అందులో నిమ్మకాయలు, సమీపంలో మల్లెపూలు ఉంచి పూజలు చేసినట్లు కనిపించింది. దీని పక్కనే చిన్న సైజు నల్లకోడి పిల్లను కాల్చి దహనం చేసినట్లుగా చిన్నచిన్న ఎముకలతోపాటు కోడి ఈకలు కనిపించటం గమనార్హం. క్షుద్ర పూజలు చేసినట్లు కనిపిస్తున్న ఆనవాళ్లను చూసి స్థానికులు భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు.
గత సంవత్సరం ఇదే ప్రాంతంలో నలుగురు కుటుంబ సభ్యులు కలిగిన ఓ కుటుంబానికి చెందిన ఫొటోను కుంకుమలో ఉంచి క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు ఆ సంఘటనను ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు. నేతాజీ కాలనీకి సమీపంలో జరుగుతున్న ఈ క్షుద్ర పూజల ప్రయత్నాలను అధికారులు అడ్డుకొనే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.