సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం.. భిన్నభాషలు, సంస్కృతులు, ఆచారాలు, మతాలకు నెలవు. మతసామరస్యం, అలయ్, బలయ్, ఆత్మీయతలకు ఆలంబన. అన్ని మతాల సారం ఒక్కటేనని చాటిచెప్పే తాత్విక పునాదులపై వెలసింది. ఆ సత్యాన్ని సమున్నతంగా ఆవిష్కరించేవిధంగా ప్రభుత్వం ‘ముక్తిఘాట్’ను నిర్మించింది. దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో మూడు మతాల సంప్రదాయాలకు అనుగుణంగా ఒకేచోట శ్మశానవాటికలు ఏర్పాటు చేసింది.
ఎవరి మత సంప్రదాయాల మేరకు వారు అంతిమ సంస్కారాలను నిర్వహించేవిధంగా ముక్తిఘాట్‌లో హెచ్‌ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ‘అంతిమంగా మనమంతా ఒక్కటే’అనే గొప్ప సందేశాన్ని ఇచ్చేవిధంగా నాగోల్ బండ్లగూడ సమీపంలోని ఫతుల్లాగూడలో రూ.16.25 కోట్ల వ్యయంతో ఇది రూపుదిద్దుకుంది. అత్యాధునిక, మౌలిక సదుపాయాలను ముక్తిఘాట్‌లో ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో అంతిమ సంస్కారాలను వీక్షించే సదుపాయం కూడా ఉంది. మంగళవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ముక్తిఘాట్‌ను ప్రారంభించారు.
ముక్తిఘాట్‌కు అడుగులు ఇలా..
►ఫతుల్లాగూడలోని సుమారు ఆరున్నర ఎకరాల డంపింగ్ యార్డ్ స్థలాన్ని హెచ్‌ఎండీఏ ముక్తిఘాట్ కోసం సేకరించింది. ఈ స్థలంలో మతసామరస్యాన్ని ప్రతిబింబించేవిధంగా ఒకేచోట హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లకు 2.5 +2+2 చొప్పున మూడు శ్మశానాలను ఏర్పాటు చేసింది.
►ముక్తిఘాట్‌లో కార్యాలయం, ప్రార్థనామందిరాలు, శీతలీకరణగది, మరుగుదొడ్లు, వాచ్‌మన్ గది, అంతిమయాత్రల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏరియా తదితర సదుపాయాలను కల్పించింది.
►సుమారు 50 కేఎల్‌డీ (కిలోలీటర్ పర్ డే) సామర్థ్యం కలిగిన మురుగుశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరమైన ల్యాండ్‌స్కేప్‌లను అభివృద్ధి చేసింది.
హిందూ శ్మశానవాటికలో...
►పర్యావరణహితమైన పద్ధతిలో దహనసంస్కారాలు నిర్వహించేవిధంగా 140 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌ప్లాంట్లతో దహనసంస్కారాలు నిర్వహించే దహనవాటికలను ఏర్పాటు చేసింది.
►హిందూ సంప్రదాయం ప్రకారం10వ రోజు చేసే దశదిన కర్మకాండకు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి.
ముస్లిం,క్రైస్తవ శ్మశాన వాటికల్లో..
►శ్మశానాల్లో మూడు భాగాలు ఏర్పాటు చేశారు. ఒక్కో దాంట్లో సుమారు 550 మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు అవకాశం ఉంటుంది.
ఆన్‌లైన్ వీక్షణ సదుపాయం
అనివార్య కారణాల వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన బంధుమిత్రులు తమ ఆత్మీయుల భౌతికదేహాలను చివరిసారి చూసుకొనేందుకు ఆన్‌లైన్ వీక్షణ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ జరిగే అంత్యక్రియలను ఎక్కడి నుంచైనా చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment