hindu muslim
-
ఎల్బీ నగర్ లో ‘ముక్తిఘాట్’.. ఒకేచోట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశానాలు
-
మూడుపాయల ‘ముక్తిఘాట్’.. ఒకేచోట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశానాలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం.. భిన్నభాషలు, సంస్కృతులు, ఆచారాలు, మతాలకు నెలవు. మతసామరస్యం, అలయ్, బలయ్, ఆత్మీయతలకు ఆలంబన. అన్ని మతాల సారం ఒక్కటేనని చాటిచెప్పే తాత్విక పునాదులపై వెలసింది. ఆ సత్యాన్ని సమున్నతంగా ఆవిష్కరించేవిధంగా ప్రభుత్వం ‘ముక్తిఘాట్’ను నిర్మించింది. దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో మూడు మతాల సంప్రదాయాలకు అనుగుణంగా ఒకేచోట శ్మశానవాటికలు ఏర్పాటు చేసింది. ఎవరి మత సంప్రదాయాల మేరకు వారు అంతిమ సంస్కారాలను నిర్వహించేవిధంగా ముక్తిఘాట్‌లో హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ‘అంతిమంగా మనమంతా ఒక్కటే’అనే గొప్ప సందేశాన్ని ఇచ్చేవిధంగా నాగోల్ బండ్లగూడ సమీపంలోని ఫతుల్లాగూడలో రూ.16.25 కోట్ల వ్యయంతో ఇది రూపుదిద్దుకుంది. అత్యాధునిక, మౌలిక సదుపాయాలను ముక్తిఘాట్‌లో ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో అంతిమ సంస్కారాలను వీక్షించే సదుపాయం కూడా ఉంది. మంగళవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ముక్తిఘాట్‌ను ప్రారంభించారు. ముక్తిఘాట్‌కు అడుగులు ఇలా.. ►ఫతుల్లాగూడలోని సుమారు ఆరున్నర ఎకరాల డంపింగ్ యార్డ్ స్థలాన్ని హెచ్ఎండీఏ ముక్తిఘాట్ కోసం సేకరించింది. ఈ స్థలంలో మతసామరస్యాన్ని ప్రతిబింబించేవిధంగా ఒకేచోట హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లకు 2.5 +2+2 చొప్పున మూడు శ్మశానాలను ఏర్పాటు చేసింది. ►ముక్తిఘాట్‌లో కార్యాలయం, ప్రార్థనామందిరాలు, శీతలీకరణగది, మరుగుదొడ్లు, వాచ్‌మన్ గది, అంతిమయాత్రల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏరియా తదితర సదుపాయాలను కల్పించింది. ►సుమారు 50 కేఎల్డీ (కిలోలీటర్ పర్ డే) సామర్థ్యం కలిగిన మురుగుశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరమైన ల్యాండ్‌స్కేప్‌లను అభివృద్ధి చేసింది. హిందూ శ్మశానవాటికలో... ►పర్యావరణహితమైన పద్ధతిలో దహనసంస్కారాలు నిర్వహించేవిధంగా 140 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ప్లాంట్లతో దహనసంస్కారాలు నిర్వహించే దహనవాటికలను ఏర్పాటు చేసింది. ►హిందూ సంప్రదాయం ప్రకారం10వ రోజు చేసే దశదిన కర్మకాండకు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ముస్లిం,క్రైస్తవ శ్మశాన వాటికల్లో.. ►శ్మశానాల్లో మూడు భాగాలు ఏర్పాటు చేశారు. ఒక్కో దాంట్లో సుమారు 550 మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఆన్లైన్ వీక్షణ సదుపాయం అనివార్య కారణాల వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన బంధుమిత్రులు తమ ఆత్మీయుల భౌతికదేహాలను చివరిసారి చూసుకొనేందుకు ఆన్లైన్ వీక్షణ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ జరిగే అంత్యక్రియలను ఎక్కడి నుంచైనా చూడవచ్చు. -
యూకేలో ఆలయాలపై దాడులు... కేంద్రం ఖండన
లండన్: యూకేలోని లీసెస్టర్ నగరంలోని భారతీయులపై దాడులు, అక్కడి ఆలయం ఆవరణలో విధ్వంసం ఘటనలను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దాడులకు కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూకే యంత్రాంగాన్ని డిమాండ్ చేసింది. బాధితులకు రక్షణ కల్పించాలని కోరింది. గత నెలలో దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం నగరంలోని హిందూ ముస్లిం గ్రూపుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. లీసెస్టర్‌లోని ఆలయం వద్ద ఎగురవేసిన కాషాయ జెండాను కొందరు చించి వేస్తున్నట్లున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
కశ్మీరీ పండిట్ల గాథ...
భూతల స్వర్గమైన కశ్మీర్ లోయలో 32 ఏళ్ల క్రితం జరిగిన ఆ దారుణాలు లక్షలాది మంది గుండెల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. నిత్య భయోత్పాతానికి, సామూహిక హత్యాకాండకు జడిసి కట్టుబట్టలతో లోయను వీడి వచ్చిన నాటినుంచీ వాళ్లు న్యాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. సొంత నేలకు దూరంగా, ఏ సదుపాయాలూ లేని శరణార్థి శిబిరాల్లో ఎవరికీ పట్టని అనాథల్లా నిస్సహాయంగా బతుకీడుస్తున్నారు. వాళ్లే... కశ్మీరీ పండిట్లు. ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు మారుతున్నా తమ గోడు పట్టించుకుంటున్న వారే లేరన్న వారి ఆక్రందన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. కశ్మీర్ ఫైల్స్ సినిమా సృష్టించిన వివాదంతో పండిట్ల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది... కశ్మీరీ పండిట్ల ఊచకోతకు, తదనంతర సామూహిక వలసలకు మూగ సాక్షిగా 1990 సంవత్సరం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఆ అల్లర్ల అనంతరం 1990 జనవరి–మార్చి మధ్య లక్షన్నర మంది కశ్మీరీ పండిట్లలో కనీసం లక్ష మందికి పైగా లోయను వీడినట్టు పలు నివేదికలు తేల్చాయి. మహా అయితే 3,000 కుటుంబాలు అక్కడ మిగిలాయని అంచనా. అవి కూడా 2010 నాటికి 800కు తగ్గాయి. కశ్మీర్ ప్రభుత్వ పునరావాస కమిషన్ (శరణార్థుల) అధికారిక వెబ్సైట్ ప్రకారమే 60 వేల కుటుంబాలు లోయను వీడాయి. వీరిలో చాలామంది 30 ఏళ్లుగా జమ్మూ, పరిసరాల్లోని శరణార్థి శిబిరాల్లో దయనీయ పరిస్థితుల్లో తలదాచుకుంటున్నారు. మరో 23 వేల కుటుంబాలు దేశ నలుమూలల్లోనూ విదేశాల్లోనూ స్థిరపడ్డాయి. లోయలో ఇంతటి కల్లోలానికి కారణమైన హిందూ, ముస్లిం ఘర్షణలు 1980ల నుంచే పెరుగుతూ వచ్చాయి. నిజానికి లోయలో 1950ల నుంచి చూసినా హిందూ పండిట్ల సంఖ్య 4 నుంచి 5 శాతం మించి లేదని గణాంకాలు చెప్తున్నాయి. 94 శాతం దాకా ముస్లిం జనాభాయే. అయినా లోయను సంపూర్ణంగా ఇస్లామీకరించే ప్రయత్నాలు 1980ల్లో ఊపందుకున్నాయి. ఫలితంగా స్థానిక ముస్లింలలో హిందువులపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. వారి నివాసాలపై దాడులతో మొదలై హిందూ నేతలను హతమార్చడం దాకా వెళ్లింది. వేర్పాటువాదమే సిద్ధాంతంగా జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వంటివి పుట్టుకు రావడంతో పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడింది. 1990 జనవరి హింసాకాండకు ఇదంతా ఓ భయానక నేపథ్యంగా అమరింది. ఆ మూడు నెలలూ... 1990 జనవరి తొలి రోజులు కశ్మీరీ పండిట్ల గుండెల్లో ఆరని మంటలు రగిల్చాయి. అప్పటికే తారస్థాయికి చేరిన మత అసహనం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. హిందువులు మతం మారడమో, లోయను వీడటమో, మరణించడమో తేల్చుకోవాలంటూ తీవ్రవాద మూకలు పండిట్ల ఇండ్లపై పడి మారణహోమం సృష్టించారు. కనిపించిన వారినల్లా కాల్చి చంపుతూ నరమేధానికి దిగారు. ఆ క్రమంలో అంతులేని దారుణ అత్యాచారాలకు, చెప్పుకోలేని ఘోరాలకు పాల్పడ్డారు. దాంతో పండిట్ల కుటుంబాలు కట్టుబట్టలతో లోయ ను వీడాయి. ఈ హింసాకాండలో మరణించిన హిందువులు 100 లోపేనని అధికారిక గణాంకాలు చెప్తున్నా వాస్తవ సంఖ్య వేలల్లో ఉంటుందంటారు. పట్టించుకున్న వాళ్లే లేరు... జమ్మూ, పరిసరాల్లోని శిబిరాల్లో తలదాచుకున్న పండిట్లు, కొద్ది నెలల్లో లోయకు తిరిగి వెళ్తామన్న ఆశలు క్రమంగా ఆవిరవడంతో దశాబ్దాలుగా అక్కడే బతుకీడుస్తున్నారు. ప్రభుత్వపరంగా వీరికి పెద్దగా సాయం కూడా అందడం లేదు. 2004లో యూపీఏ ప్రభుత్వం పండిట్ల కోసం టౌన్‌షిప్‌ల్లోని చిన్న ఫ్లాట్లను కొందరు కొనుక్కోగా ఆ స్తోమతలేని చాలామంది ఇప్పటికీ దయనీయంగానే గడుపుతున్నారు. ఆర్థిక కష్టాలతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు కూడా. అయినా నాటి గాయాలు వీరిలో ఎంత తాజాగా ఉన్నాయంటే... ఇప్పటికీ చాలామంది తమ అవస్థలపై పెదవి విప్పేందుకు కూడా ఇష్టపడటం లేదు! 2008లో ప్రధాని పునరావాస ప్యాకేజీ కింద పండిట్లకు కొన్ని ఉద్యోగాలివ్వడంతో సరిపెట్టారు. వారికి ఉద్యోగాలతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.7.5 లక్షల దాకా ఆర్థిక సాయం ఇస్తామని 2021లో కేంద్రం ప్రతిపాదించినా ముందడుగు పడలేదు. దాంతో మోదీ ప్రభుత్వం కూడా తమకోసం చేసిందేమీ లేదంటూ పండిట్లు వాపోతున్నారు. కశ్మీరీ పండిట్ల డిమాండ్లు ► కనీసం రూ.25 వేల పై చిలుకు నెలవారీ పరిహారం ► కేంద్రపాలిత ప్రాంత హోదాతో కూడిన ప్రత్యేక హోమ్‌లాండ్ ► మైనారిటీ హోదా, తదనుగుణమైన హక్కులు, ప్రయోజనాలు ► నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు తేల్చాలి. అన్నివిధాలా న్యాయం చేయాలి ► తమ నివాసాలు, భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించి వెనక్కి ఇప్పించాలి ఒక విజయం, వంద వివాదాలు కశ్మీరీ పండిట్ల ఊచకోత, వలసలపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ.15 కోట్లతో రూపొందిన ఈ సినిమా 20 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల పై చిలుకు కలెక్షన్లు రాబట్టి రికార్డుల మోత మోగించింది. మార్చి 11న కేవలం 600 థియేటర్లలో పెద్దగా హడావుడి లేకుండా విడుదలైనా, చూస్తుండగానే టాక్ ఆఫ్ ద కంట్రీగా మారిపోయింది. ప్రధాని మోదీ మొదలుకుని అమిత్ షా తదితర కేంద్ర మంత్రులు, బీజేపీ ప్రముఖులంతా సినిమాను ప్రశంసలతో ముంచెత్తడమే గాక అందరూ తప్పక చూడాలంటూ పిలుపునిచ్చారు. ఇందుకు విపరీతమైన మౌత్ పబ్లిసిటీ తోడై చూస్తుండగానే 4,000కు పైగా థియేటర్లకు విస్తరించింది. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే ఉచితంగా షోలు వేశాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్ను మినహాయింపులిచ్చాయి. యూఏఈ, సింగపూర్ వంటి దేశాల్లో కూడా నిషేధం తొలగి త్వరలో విడుదలవుతుండటంతో కలెక్షన్లు ఇంకా కొనసాగేలా ఉన్నాయి. అయితే సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పైగా దీన్ని బీజేపీ ప్రమోట్ చేస్తోందన్న అభిప్రాయంతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. సినిమాకు అనుకూలంగా, వ్యతిరేకంగా విమర్శలు, ప్రతి విమర్శలు హోరెత్తుతున్నాయి. సినిమా అవాస్తవాలమయమని ఆప్ వంటి పార్టీలు అంటున్నాయి. మరో వర్గం మాత్రం సినిమాలో నిజాలు చూపించారని, పండిట్ల గుండెకోత ఇప్పటికైనా వెలుగులోకి వచ్చిందని అంటోంది. బెదిరింపుల నేపథ్యంలో అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రత కల్పించాల్సి వచ్చింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఒక్క రేషన్ కార్డులో 68 మంది సభ్యులు
పట్నా: ఒకే కుటుంబంలో ఏకంగా 68 మంది సభ్యులతో కూడిన రేషన్ కార్డు ఉండటం, వారిలో హిందూ, ముస్లింలు కూడా ఉండటం కలకలం రేపింది. బిహార్‌లోని మహువా ఎస్డీఓ సందీప్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. వైశాలి జిల్లాలో ఆహార ధాన్యాల పంపిణీ వివరాలను పరిశీలిస్తుండగా, ఒకే కుటుంబానికి ఏకంగా 38 క్వింటాళ్ల ధాన్యం ఇచ్చినట్లు కనిపించడంతో అధికారులు అవాక్కయ్యారు. స్థానిక రేషన్ డీలర్ సంజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. అధికారులు లబ్దిదారుల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసే పనిలోపడ్డారు. (చదవండి: రేషన్ కోసం ప్రత్యేక యాప్ లాంచ్ చేసిన కేంద్రం) -
‘లవ్ జిహాద్’ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లవ్ జిహాద్ పేరిట జరిగే బలవంతపు మత మార్పిడి వివాహాలను అడ్డుకోవడానికి ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ తెచ్చిన వారానికి, ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి మధ్య జరుగనున్న వివాహ వేడుకను పోలీసులు నిలిపివేశారు. బుధవారం లక్నోలోని పారా ప్రాంతంలో వివాహ వేడుకలు ప్రారంభం కావడానికి ముందు, పోలీసులు అక్కడకి చేరుకుని ఇరు వర్గాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కి రావాలని కోరారు. వివాహానికి ముందు లక్నో జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ఇరువర్గాలు అనుమతి పొందాలని వారికి సూచించారు. ఈ క్రమంలో.. పెళ్లి విషయంలో బలవంతం ఏదీ లేదని, ఇరు కుటుంబాల సమ్మతితోనే వివాహం జరుగుతుందని, మత మార్పిడి ఉద్దేశం లేదని ఇరు వర్గాలు పోలీసులకు తెలియజేశాయి. ఏదేమైనా చట్టపరంగా అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాతనే వివాహం జరిపించనున్నట్లు వారు పేర్కొన్నారు. కొత్త ఆర్డినెన్స్ ఏం చెబుతోంది? ఇక వివాహం పేరుతో బలవంతపు మత మార్పిడికి పాల్పడే వారికి గరిష్ఠంగా పదేళ్ళ జైలు శిక్ష విధించవచ్చునని ఈ ఆర్డినెన్స్(2020) పేర్కొంది. పెళ్లి కోసం మతం మారాలంటూ బలవంతం చేసేవారికి ఒక ఏడాది నుంచి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష, 15,000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. మైనర్లను, ఎస్సీ, ఎస్టీ మహిళలను బలవంతంగా మతం మార్చేవారికి 3 సంవత్సరాల నుంచి పదేళ్ళ వరకు జైలు శిక్ష, 25,000 రూపాయల జరిమానా విధించవచ్చని ఆర్డినెన్స్ తెలిపింది. సామూహిక మతమార్పిడులకు పాల్పడితే 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 50000 రూపాయల జరిమానా విధించవచ్చు. (చదవండి: విడాకులు కోరిన ఐఏఎస్ దంపతులు) జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి: పోలీస్ అధికారి సురేష్ చంద్ర రావత్ ‘‘వేర్వేరు మతాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోనున్నట్లు డసెంబర్ 2న సమాచారం అందింది. మేము అక్కడికి చేరుకుని, ఇరు వర్గాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించాం. ఇరు కుటుంబాలకు కొత్తగా తెచ్చిన బలవంతపు మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ కాపీని అందించి, చట్ట ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్‌తో లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోవాలని సూచించాం. ఒకవేళ వివాహం తరువాత మతం మారే ఉద్దేశం ఉంటే కనీసం రెండు నెలల ముందుగానే జిల్లా మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.’’ అని లక్నో సీనియర్ పోలీస్ అధికారి సురేశ్ చంద్ర రావత్ మీడియాకు తెలిపారు. -
‘3జీ కూడా పనిచేయని దేశం మనది’
భోపాల్ : ప్రపంచమంతా 5జీ నెట్‌వర్క్‌తో దూసుకుపోతుంటే మన ప్రధాని ఇంకా హిందూ, ముస్లిం అంటూ వ్యాఖ్యలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ప్రపంచ దేశాలు 5జీ నెట్‌వర్క్‌తో వేగంగా ముందుకు వెళ్తుంటే మన దేశంలో 3జీ కూడా సరిగ్గా పని చేయడంలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని ఇటీవల నరేంద్ర మోదీ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ దీనిపై స్పందించారు.. హిందూ, ముస్లిం అంటూ ప్రధాని మత వైషమ్యాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్ల కాలంలో దేశంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ప్రధాని వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా స్పందించారు. ముందస్తు ఎన్నికల కోసమే ప్రధాని హిందుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధానికి ఓటమి భయం పట్టుకుందని, త్వరలో జరుగునున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దానికి ముందస్తు సూచనగానే కశ్మీర్లో పీడీపీతో తెగదెంపులు చేసుకున్నారని తెలిపారు. నిరుద్యోగ, ద్రవ్యోల్బణం, పేదరికం వంటి అంశాలను ప్రధాని గాలికొదిలేశారని మాయావతి విమర్శించారు. -
కోట మరణం... కొత్త కోణం!
జైపూర్ : నహర్‌గఢ్ ప్రహారీ గోడకు వేలాడుతున్న వ్యక్తి దేహం నిన్న కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే చేతన్ కుమార్ సైనీ(40) మరణానికి సంబంధించి కీలక ఆధారాలు ఇప్పుడు పోలీసుల కంట పడ్డాయి. ఇది మతపరమైన హత్య అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాం పక్కనే తొలుత అక్కడి కోట గోడ రాత ఆధారంగా అది పద్మావతి చిత్ర యూనిట్ బెదిరింపు రాతలు అని అంతా అనుకున్నారు. కానీ, దర్యాప్తులో అక్కడ ఉన్న మరికొన్ని రాళ్లను నిశితంగా పరిశీలించిన పోలీసులు అవి చిత్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారికే హెచ్చరికలు అని తేల్చారు. ‘‘చేతన్ చంపబడ్డాడు. మేం అల్లా మనుషులం. నిరసనలు చేసే వారి దిష్టిబొమ్మలను కాదు.. వారినే వేలాడదీస్తాం’’.. ఇలాంటి రాతలు ఉన్న రాళ్లు పోలీసుల కంటపడ్డాయి. దీంతో ఇప్పుడు దీని వెనుక మత ఘర్షణలు ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రాళ్లపై కఫీర్, మరికొన్ని రాతల్లో అల్లా పదం కనిపించటంతో అవి మరింత బలపడుతున్నాయి. తమను బెదిరించడానికే ఆ రాతలు రాశారని శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన ఆరోపించిన విషయం తెలిసిందే. పద్మావతి సినిమాతో సైనీ మరణానికి ఎలాంటి సంబంధం లేదని మృతుడి సోదరుడు చెప్పగా.. ఇది మతపరమైన హత్య అని ఇప్పుడే ఓ నిర్ధారణకు రావటం అంత మంచిది కాదని యోచిస్తున్న పోలీసులు మిస్టరీని ఛేదించే పనిలో తలమునకలై ఉన్నారు. -
హిందూ ముస్లింలపై సీఎం యోగి వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందూ ముస్లింలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తనకు 'బొట్టు'కు, 'టోపీ'కి ఏమీ తేడా లేదని చెప్పారు. ఒక టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనిలా చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని, ఆ విషయంలో ఏ ఒక్కరికీ అధిక ప్రాధాన్యం లేద అప్రాధాన్యం ఇవ్వడం ఉండబోదని స్పష్టం చేశారు. యోగి స్థాపించిన హిందూ యువవాహిని సంస్థ అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకుంటోందన్న నివేదికలను ప్రస్తావించగా.. చాలా తీవ్ర స్వరంతో స్పందించారు. మెడలో కాషాయ కండువాలు వేసుకున్నవాళ్లు బాగుపడాలని, లేకపోతే మాత్రం వాళ్లను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బీజేపీని గానీ లేదా వేరే ఏదైనా సంబంధిత సంస్థను గానీ పేరు పాడుచేద్దామని ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లందరినీ గుర్తించి మరీ కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తరప్రదేశ్‌లో జంగల్‌రాజ్ అంతమైపోతుందని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నా.. తన ప్రభుత్వ వందరోజుల పాలన పూర్తయ్యేసరికి అవన్నీ కచ్చితంగా ఆగిపోతాయని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రతి చెల్లి, సోదరి సురక్షితంగా ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతామని యోగి అన్నారు. తాజాగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తరప్రదేశ్ నగరాలు ఏవీ లేకపోవడాన్ని ప్రస్తావించగా, వచ్చే సంవత్సరం సర్వే చేసేసరికి మొత్తం 100 టాప్ నగరాల్లో 50 మనవే ఉంటాయని అన్నారు. కొత్త ముఖ్యమంత్రి రాగానే పాలనా యంత్రాంగాన్ని మార్చాలనుకుంటారని, కానీ తాము మాత్రం అదే అధికారులతో పరిపాలన తీరును మారుస్తున్నామని అన్నారు. గత 12-15 ఏళ్లుగా అధికారుల బదిలీలంటే ఒక పెద్ద పరిశ్రమగా మారిపోయిందని, దాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తామని తెలిపారు.