శ్మశానవాటికలూ కబ్జా..!
‘కాదేది కబ్జాలకు అనర్హం’ అన్నట్లుగా భూ కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. చెరువులు, కుంటలు, కాల్వలు, కత్వలు, ప్రభుత్వ స్థలాలనూ వదలని కబ్జాదారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ‘ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసేస్తాం’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మనిషి మరణిస్తే ఆరు అడుగుల జాగాను కూడా వదిలిపెట్టడం లేదంటే భూ కబ్జాలు ఏ తరహాలో చేస్తున్నారో ఇట్టే తెలుస్తోంది.
- ఇబ్రహీంపట్నం రూరల్
ఇబ్రహీంపట్నం మండలంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ప్రతి ఒక్కరూ భూమినే నమ్ముకొని జీవితాలు గడుపుతున్నారు. ఏంచేసినా తొందరగా అభివృద్ధి సాధించలేమని భూములు కొనడం, అమ్మడంవల్ల అభివృద్ధిని గమనించి రియల్ వ్యాపారులు, భూస్వాములు శ్మశానవాటికలను కూడా వదిలిపెట్టడం లేదు.
ఇచ్చినవీ లాక్కుంటున్నారు...
ఇబ్రహీంపట్నం మండలంలోని కప్పహాడ్, తుర్కగూడ, రాందాసుపల్లి అనుబంధ గ్రామమైన మల్సెట్టిగూడ, ఎంపీ పటేల్‌గూడ, ఆదిబట్ల, కొంగరకలాన్ గ్రామాల్లో ఇప్పటికే శ్మశానవాటికలను కబ్జా చేశారు. అదే గ్రామానికి చెందిన పెద్దరైతులు గతంలో శ్మశానవాటికల కోసం స్థలాలు ఇచ్చి మళ్లీ లాక్కుంటున్నారు. ఇటీవలికాలంలో మండలంలోని కప్పపహాడ్ గ్రామంలో ఎస్సీ, బీసీల శ్మశానవాటిక భూములు ఆక్రమించారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
తుర్కగూడ గ్రామస్తులు, మల్సెట్టిగూడ గ్రామాస్తులు కూడా కబ్జాకు గురైందని కలెక్టర్‌కు ఫిర్యాదు ఇచ్చారు. కప్పపహాడ్ గ్రామంలో నెలరోజుల క్రితం శ్మశానవాటిక వద్దకు తీసుకొచ్చిన మృతదేహాన్ని దహన సంస్కరాలు నిర్వహించకుండా కబ్జాదారులు అడ్డుకున్నారు. దీంతో గ్రామపెద్దలు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగి దహన సంస్కారాలు చేశారు.
కొనసాగుతున్న ఆందోళనలు..
మనిషి మరణిస్తే దహన సంస్కారాలు నిర్వహించుకునే స్థలాల పరిరక్షించుకోవడం కోసం ప్రజలు ఆందోళనబాట పడుతున్నారు. రెండు వారాల క్రితం ఎంపీ పటేల్‌గూడ గ్రామానికి చెందిన దళితులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. చింతపల్లిగూడ, మల్సెట్టిగూడ ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా అప్పటి ఆర్టీఓ యాదగిరిరెడ్డి మల్సిట్టిగూడలో జరిగిన ఆక్రమణలపై స్పందించారు. మిగతా గ్రామాల్లో జరుగుతున్న సమస్యలపై రెవెన్యూ యంత్రాంగం స్పందించలేదు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..
శ్మశానవాటికలను కబ్జా చేస్తు న్న వారిపై చర్యలు తీసుకోవాలి. పాలకుల నిర్లక్ష్యం ఆక్రమణలు జరుగుతున్నాయి. అ ధికారులు స్పందించాలి. కబ్జాదారులపై ఉక్కుపాదం మోపితే ఇలాంటి చర్యలకు పాల్పడరు. కబ్జాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
- మహేందర్, కేవీపీఎస్ నాయకుడు
కఠినంగా వ్యవహరించాలి..
శ్మశానవాటికలు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుని పర్యవేక్షించాలి. ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాలకు పాల్పడుతున్నారు. వాటిని నివారించాలి.
- మొగిలి గణేష్, బీజేపీ మండల అధ్యక్షుడు