బస్తీ మే దెయ్యం | Rumors of ghosts in Mudiraj Basti colony | Sakshi
Sakshi News home page

బస్తీ మే దెయ్యం

Published Mon, Jun 6 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

బస్తీ మే దెయ్యం

బస్తీ మే దెయ్యం

చేత''బడి
చీకట్లో ఏడుపులు వినిపిస్తున్నాయి. గుండెల మీద ఎవరో కూర్చున్నట్టుగా ఉంది! చనిపోయిన బాలమ్మ కళ్లను దానం చేశారు కాబట్టి... బాలమ్మ  దెయ్యం ఇంటింటికీ... ‘తడుముకుంటూ’ తిరుగుతోందని బస్తీలో పుకార్లు! ఓర్నాయనో! ఎవరిని ఆవహిస్తుందో ఏమో! బస్తీ గజగజలాడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వివేకంగా ఉండాలి! దేనికి జాగ్రత్త? దేనికి వివేకం. చదవండి.

 
రెండు సంఘటనలు. మూడు మరణాలు.
ఆ బస్తీని అతలాకుతలం చేస్తున్నాయి.
ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీం పట్నంలో ముదిరాజ్ బస్తీ. మూడు శ్మశానాల మధ్య ఉంది ఆ బస్తీ. అక్కడ నివసించేవారంతా శ్రామికులే. రవి బేల్దారి పని చేస్తుంటాడు. అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేచాడు. లేస్తూనే ఇంట్లో వాళ్ల మీద విరుచుకు పడ్డాడు. ‘నేనెన్ని సార్లు మిమ్మల్ని గిచ్చి లేపినా ఒక్కరూ లేవరేం?’ అని అరిచాడు.

‘నువ్వెప్పుడు గిచ్చావయ్యా’ అంటే వినడు. ‘నా గుండెల మీద బ్రహ్మరాక్షసి కూర్చుంది. ఎంతకీ లేవలేదు. మిమ్మల్ని లేపుతుంటే ఒక్కరూ లేవలేదు’ అని రవి ఆరోపణ. అంతే... ఇంట్లో వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెట్టడం మొదలైంది. ‘ఊరి వాళ్లంతా నెత్తీనోరూ కొట్టుకుని చెప్పినా వినకపోతిరి’ అని సణుగుతూ రవి తల్లి పక్కింటి వైపు తొంగి చూసింది. ఆ పెంకుటింటికి ఎప్పటిలాగే తాళం పెట్టి ఉంది. రవికి కూడా గుబులు మొదలైంది. రవి కళ్ల ముందు గతం మెదిలింది.
 
అది సంతోష ఆత్మేనా?!
ఆ పెంకుటిల్లు సంతోషది. ఆమె భర్తకు నల్గొండ జిల్లా చిట్యాలలో ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం. వారి కాపురమూ అక్కడే. సంతోష గర్భవతైంది. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ భార్యాభర్తల మధ్య కీచులాటలు ఎక్కువయ్యాయి. సంతోష ప్రాణాలు తీసుకుంది! చిట్యాలలో వారున్నది అద్దె ఇల్లు. ఆ ఇంటి నుంచి దహన సంస్కారాలు చేయడానికి ఇంటి యజమానులు ఒప్పుకోరు. సొంతూరికి వచ్చి సొంత వాళ్ల మధ్యన ఆ కర్మకాండలు నిర్వహించడమే మార్గం. అయితే ఇందుకు ఊరు ఒప్పుకోలేదు. రెండు ప్రాణాలు పోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. సహాయ నిరాకరణ చేసింది. దాయాదులైన రవి కుటుంబం ఒక్కటే ఆదుకుంది. పాడె మోయడం దగ్గర నుంచి అంతిమ సంస్కారం వరకు ఆ కుటుంబం వారే దగ్గరుండి పూర్తి చేశారు.
 
అయితే రోజులు గడిచినా ఊరివాళ్లకు సంతోష మరణం మీద శంకలు తగ్గలేదు. సంతోష ఆత్మ అక్కడే, ఆ ఇంట్లోనే ఉంటుందని, పాడె మోసిన వారిని పీడిస్తుందని భయపెట్టసాగారు. జరిగినదంతా గుర్తొచ్చి రవికి ఒళ్లంతా చెమటలు పట్టాయి. సందేహం లేదు. సంతోష ఆత్మ తన గుండెల మీద కూర్చుని ప్రాణాలు తీయబోయింది అనే నిర్ధారణకు వచ్చేశాడు. ఈ సంగతి ఊరంతా పొక్కింది. అంతలోనే మరో సంఘటన.
 
రెండో ఆత్మ... బాలమ్మ!
అదే బస్తీలో ఉండే పోచమ్మ ఓ రోజు పొద్దున్నే కూతుర్ని పిలిచి అర్ధరాత్రి నట్టింట్లో ఏడుపు వినిపించిందని చెప్పింది. అది బాలమ్మ ఏడుపేనేమో అనుకున్నారు తల్లీకూతుళ్లు. అప్పటినుంచి ఆ ఇంట్లో అందరూ అస్థిమితంగానే నిద్రపోతున్నారు. ఊళ్లో దాదాపుగా అందరికీ ఏదో ఒక సమయంలో ఏడుపు వినిపిస్తోంది. ఇదంతా ఏదో అరిష్టానికి సంకేతం అని ఊరంతా నమ్మింది. గుబులుగా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు పోచమ్మ ఇంట్లో సందడి. కల్లు తాగి, తిళ్లు వండుకుని తిన్నారంతా. కొంతసేపటికి పోచమ్మ విచిత్రంగా ప్రవర్తిస్తోంది.

టీవీ సీరియళ్లలో, సినిమాల్లో దెయ్యం పాత్రలో కనిపించే హావభావాలన్నీ ఆమె ముఖంలో పలుకుతున్నాయి. వాంతి వస్తోందని కొంతసేపు హడావుడి చేసింది. గర్భిణి సంతోష దెయ్యమై పట్టిందేమోనని వెన్నులో నుంచి చలి మొదలైంది పోచమ్మ కూతురికి. ‘అన్నం అరగలేదేమో, జీర్ణమవడానికి ఏ నిమ్మకాయ రసమో ఇవ్వు’ అనేసి నిద్రకు ఉపక్రమించాడు పోచమ్మ అల్లుడు. మరికొంత సేపటికి పోచమ్మ ఆకలంటూ కేకలు పెట్టింది. ‘కార్జం (కాలేయం), మాంసం పెట్టండి’ అంటోంది. పొంతనలేని మాటలతో ఇంట్లో వాళ్లు భీతిల్లిపోతున్నారు.

‘నువ్వెవరు’ అనగానే ‘మీకు తెల్వదా, నన్ను మర్చిపోయిన్రా... మీ పక్కింటి బాలమ్మను కదా’ అంటోంది పోచమ్మ. ఆ పక్కింట్లోనే బాలమ్మ కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలు నిద్రపోతున్నారు. ‘మీ ఇంటికి పోక, మా ఇంటికెందుకొచ్చావ్’ అన్నది పోచమ్మ కూతురు. ‘నా కొడుకు పూజ చేయించి నన్ను ఇంట్లోకి రానివ్వకుండా కట్టడి చేసిండు’ అని చెప్పింది  బాలమ్మ ఉరఫ్ పోచమ్మ. అలా మాట్లాడుకుంటూ ఇంటి బయటికొచ్చింది. కళ్లు కనిపించనట్లు తడుముకుంటూ శ్మశానం వైపు వెళ్లి పోయింది.
 
చూపు లేని దెయ్యం!
బాలమ్మ చనిపోయిన తర్వాత ఆమె కళ్లను దానం చేశాడు కొడుకు. దాంతో బాలమ్మ దెయ్యమైన తర్వాత చూపు కోల్పోయిందని, దారి కనిపించక తడుముకుంటూ తిరుగుతోందనేది బస్తీలో వదంతులు లేచాయి. బాలమ్మ దెయ్యమై తిరుగుతోందని, అర్ధరాత్రి వినిపించే ఏడుపు కూడా బాలమ్మదేనని పుకారు పుట్టింది. దాంతో బస్తీలో చాలా మంది భయంతో విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కొందరి ప్రవర్తన బాలమ్మను స్ఫురింప చేస్తుంటే, కొందరి ప్రవర్తన సంతోషను గుర్తు చేస్తోంది. కాలనీలో మహిళలందరి చీర కొంగులకు, చుడీదార్ చున్నీలకు మంత్రించిన నిమ్మకాయల మూటలు కనిపిస్తున్నాయి. ఊరంతటికీ కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత కాస్తంత సమాధానపడినట్లు కనిపిస్తున్నారు. కానీ వారిలో భయం పూర్తిగా పోలేదు.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
అసలేం జరిగింది?
గత డిసెంబర్‌లో వృద్ధురాలు బాలమ్మ తుదిశ్వాస విడిచింది. అది జరిగి రెండు నెలలు గడవక ముందే ఫిబ్రవరిలో తొమ్మిది నెలల నిండు గర్భిణి సంతోష ఆత్మహత్య చేసుకుంది. గర్భిణి కాబట్టి అది ఒక మరణం కాదు, రెండు మరణాల పెట్టు. అందుకే ఊరికి అరిష్టం పట్టిందని బస్తీవాసులు నమ్మారు.
 
ఏడిచిందెవరు?
కుక్కలు... మనిషి చెవులు వినలేని చాలా తక్కువ పౌనఃపున్యం ఉన్న శబ్దాన్ని కూడా గ్రహి స్తాయి. దానికి ప్రతిస్పందనగా తిరిగి అదే లయతో అరుస్తాయి. ఆ అరుపు మనిషి ఏడుపును తలపిస్తుంది. అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉండడంతో చాలా దూరం వినిపిస్తుంది.
 
కల్లు, దెయ్యం కలిశాయి
జెవివి సూచన మేరకు పోచమ్మను మరో కూతురు తనింటికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెకు ఎటువంటి భ్రాంతులూ కలగడం లేదు. ఈ విచిత్ర ప్రవర్తనకు కారణం దెయ్యం భయం, దానికి తోడు కల్తీ కల్లు. ఆ కల్లు చిన్న మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. విచిత్రమైన భ్రాంతులకు లోను చేస్తుంది. రవి పరిస్థితి కూడా అలాంటిదే. ఊరంతా సంతోష దెయ్యమై పట్టుకుంటుందని భయపెట్టడం, కల్తీ కల్లు తాగడం కలిసి ఆరోగ్యం పాడైంది. గుండెలు పట్టేసినట్లు అనిపించడంతో దెయ్యం గుండెల మీద కూర్చున్నదని భయపడ్డాడు. దానికితోడు టీవీ సీరియళ్లు, సినిమాల ప్రభావంతో ఆయాపాత్రల హావభావాలను ఆటోమేటిక్‌గా అనుకరించడం అలవాటైపోయింది.
- టి. రమేశ్, జనరల్ సెక్రటరీ,ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement