ఆస్పత్రికి వెళ్లనక్కర్లేదంటూ భూతవైద్యుడి పూజలు..
చిన్నారికి వైద్యం అందక అపస్మారక స్థితికి..
యాదాద్రి భువనగిరి జిల్లా: అనారోగ్యా నికి గురైన చిన్నారికి.. దెయ్యం పట్టింది.. వదిలిస్తా.. అంటూ ఒక భూతవైద్యు డు చేసిన పూజలతో.. ఆమె అపస్మారక స్థితికి వెళ్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మటంలంక గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలివి. గ్రామానికి చెందిన ఒక చిన్నారి అనారోగ్యంగా ఉండడంతో.. ఆమె తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం ఇల్లెందు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
కాగా, వారికి తారసపడిన ఒక భూత వైద్యుడు ఆస్పత్రికి అవసరం లేదని, తాను నయం చేస్తానని నమ్మించాడు. ఓ మేకను బలిచ్చి, భూతాలను కట్టడి చేస్తానని పూజలు చేశాడు. రెండు రోజులు గడుస్తున్నా పాప ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కుటుంబసభ్యులు భూత వైద్యుడిని నిలదీశారు. అతను చేతులెత్తేయడంతో వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
వైద్య ఖర్చులు భరించలేక.. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని, భూత వైద్యుడి మాటలు నమ్మి సకాలంలో చికిత్స అందక అపస్మారక స్థితికి చేరిందని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనపై ఎస్‌ఐ రాజమౌళి స్పందిస్తూ భూత వైద్యం పేరుతో ఎవరైనా వస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment