
ఇప్పుడు హాయిగా ఉన్నాం
మిషెల్‌తో విడాకుల వార్తలను వదంతులుగా కొట్టేసిన ఒబామా
వాషింగ్టన్: రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షునిగా పదవిలో కొనసాగిన కాలంలో పని ఒత్తిడి కారణంగా భార్యతో సఖ్యత చెడిందని బరాక్ ఒబామా ఒప్పుకున్నారు. నాటి మనస్పర్ధలను తొలగించుకుంటూ నేడు ఆనందంగా జీవిస్తున్నామన్నారు. భార్య మిషెల్‌తో జీవనప్రయాణంపై ఒబామా మీడియాతో మాట్లాడారు. హాలీవుడ్ నటి జెన్నీఫర్ అనీస్టన్‌తో వివాహేతర సంబంధం వంటి వార్తలను వదంతులుగా కొట్టిపారేశారు.
భార్య మిషెల్ నుంచి విడాకులు తీసుకోబోతున్నారనేవి కూడా పూర్తిగా వదంతులేని స్పష్టంచేశారు. జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లోనూ, ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భార్య మిషెల్‌తో రాకుండా ఒంటరిగా ఒబామా కనిపించిన నేపథ్యంలో మీడియా ఆయన విడాకుల అంశాన్ని మరోసారి ప్రస్తావించింది. దీంతో తాజాగా హామిల్టన్ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో కాలేజీ అధ్యక్షుడు స్టీవెన్ టెప్పర్ అడిగిన ప్రశ్నలకు ఒబామా సమాధానాలిచ్చారు.
‘‘2020 నవంబర్‌లో నా ఆత్మకథ ఏ ప్రామిస్ట్ ల్యాండ్ మొదటి భాగాన్ని మార్కెట్లోకి తెచ్చాం. ఇప్పుడు రెండో భాగం పూర్తిచేసే పనిలో ఉన్నా. రోజూ పేజీల కొద్దీ రాస్తున్నా’’ అని అన్నారు. రాయడం ఇష్టపడతారా అన్న ప్రశ్నకు ‘‘అస్సలు ఇష్టంలేదు. కానీ రాయడం పూర్తయ్యాక మాత్రం రాశానన్న ఆనందంలో మునిగితేలుతా’’అని సరదాగా అన్నారు.
‘‘అధ్యక్షునిగా కొనసాగిన కాలంలో విధి నిర్వహణలో పడిపోయా. దాంతో సతీమణితో మనస్పర్ధలొచ్చాయి. ఇప్పుడు పరిస్థితి అంతా కుదుటపడింది. నాటి విబేధాల లోయలోంచి బయటపడ్డా’’అని చెప్పారు. 1980వ దశకంలో ఒక న్యాయసేవల సంస్థలో కొన్నాళ్లు కలిసి పనిచేసిన కాలంలో మిషెల్‌తో ఒబామాకు పరిచయం ఏర్పడింది. అది తర్వాత ప్రేమగా మారి 1992లో పెళ్లికి దారితీసింది. ఒబామా అధ్యక్షుడయ్యాక కొంతకాలం వాళ్ల మధ్య బేధాభిప్రాయాలు పొడచూపాయి. తమ వైవాహిక బంధంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయని మూడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో మిషెల్ చెప్పారు.
అప్పట్నుంచి వీళ్ల వివాహబంధంపై మీడియాలో ఎన్నో కథలు షికార్లు చేశాయి. అమెరికాలో ప్రఖ్యాత జ్యోతిష్యురాలు అమీ ట్రిప్ సైతం ఇదే విషయం అంచనావేశారు. ఒబామా దంపతులకు జూలై, ఆగస్ట్ నెలలు అత్యంత విషమకాలమని ఆమె అంచనా వేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారని అమీ ట్రిప్ చెప్పిన జోక్యం నిజం కావడం తెల్సిందే. పెళ్లి పెటాకులు అవుతుందన్న పుకార్లు పెరగడంతో ఒబామా జంట ఫిబ్రవరి 14న జంటగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టింది. వేలంటైన్స్‌డే గ్రీటింగ్స్ చెప్పి విమర్శించే వాళ్ల నోరు మూయించారు.