వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్, ఆయన భార్య మిచెల్ ఒబామా(60) తమ వివాహ బంధానికి ముగింపు పలకనున్నారా? సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బరాక్ ఒబామా ఒక్కరే హాజరురవుతారంటూ ఈ దంపతుల కార్యాలయం చేసిన ప్రకటనలే ఇందుకు బలం చేకూరుస్తోంది. అధికార కార్యక్రమానికి భర్త బరాక్ ఒబామాతో కలిసి మాజీ ప్రథమ మహిళ మిచెల్ గైర్హాజరవడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి.
ఇటీవల జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ నివాళి కార్యక్రమంలో సైతం మిచెల్ పాల్గొనలేదు. అమెరికా అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు సతీసమేతంగా పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, లారా బుష్ దంపతులు హాజరుకానున్నారు.
కాగా, ఒబామా దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు కొన్ని నెలలుగా వార్తలు వెలువడుతున్నాయి. జిమ్మీ కార్టర్ నివాళి, ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అందుకు ఆజ్యం పోశాయి. సామాజిక మాధ్యమ వేదికల్లోనూ వీరు విడిపోయారంటూ రూమర్లు గుప్పుమంటున్నాయి. 1989లో డేటింగ్ ప్రారంభించిన బరాక్, మిచెల్‌లు 1992లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment