
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(barack obama) సతీమణి మిషెల్లీ విడాకుల ప్రచారంపై ఎట్టకేలకు పెదవి విప్పారు. గత కొంతకాలంగా దేశ మాజీ ప్రథమ పౌరురాలి హోదాలో ఆమె పలు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని బహిరంగంగా బరాక్ ఖండించినప్పటికీ.. మిషెల్లీ మాత్రం ఎక్కడా స్పందించకపోవడంతో ఆ అనుమానాలు కొనసాగుతూ వచ్చాయి.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన టైంలో, అంతకు ముందు మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మిషెల్లీ ఒబామా(michelle obama) గైర్హాజరు అయ్యారు. మాజీ అధ్యక్షులు అయినప్పటికీ సతీసమేతంగా(ఫస్ట్ లేడీ కాబట్టి) హాజరు కావడం అక్కడి ఆనవాయితీ. అయితే బరాక్ ఒబామా ఒంటరిగా ఆ కార్యక్రమాలకు హాజరు కావడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారాన్ని ఒబామా గత నాలుగు నెలల కాలంలో విడాకుల రూమర్లను(Divorce Rumours) రెండుసార్లు ఖండించారు. ఇప్పుడు మిషెల్లీ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై స్పందించారు.
నటి సోఫియా బుష్ నిర్వహించే పాడ్‌కాస్ట్‌లో మిషెల్లీ మాట్లాడుతూ.. విడాకుల ప్రచారాన్ని తోసిపుచ్చారు. తన గురించి ఆలోచించే సమయం తనకు ఇప్పటికి దొరికిందని.. అందుకే అధికారిక కార్యక్రమాలకు, రాజకీయపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారామె. ‘‘
గత ఎనిమిదేళ్లలో నా జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. కుమార్తెలు పెద్దవాళ్లు అయ్యారు. నా గురించి ఆలోచించుకోవడానికి ఇప్పటికైనా నాకు సమయం దొరికింది. నాకు ఏది మంచో అదే చేయాలనుకుంటున్నా. అంతేకానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అది చేయడం కాదు’’ అని అన్నారామె.
ఇక్కడ.. ఒక మహిళకు ఉండే స్వేచ్ఛ కోణంలో ఎవరూ ఆలోచించలేకపోయారు. మహిళలుగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవే. ఆమె తన కోసం ఆలోచిస్తోందని, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రజలు గ్రహించలేకపోయారు. కేవలం భర్త నుంచి విడిపోతోందనే చర్చించుకున్నారు అని మిషెల్లీ అన్నారు.
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 3వ తేదీన హమిల్టన్ కాలేజీలో ఓ ఈవెంట్‌కు హాజరైన బరాక్ ఒబామా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షునిగా పదవిలో కొనసాగిన కాలంలో పని ఒత్తిడి కారణంగా భార్యతో సఖ్యత చెడిందని బరాక్ ఒబామా ఒప్పుకున్నారు. నాటి మనస్పర్ధలను తొలగించుకుంటూ నేడు ఆనందంగా జీవిస్తున్నామన్నారు.