
భారత్–యూకే మధ్య ఫలించిన చర్చలు
డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్‌కు ఒకే
ఇదొక చరిత్రాత్మక మైలురాయి: మోదీ
ఇండియా మార్కెట్‌లో తగ్గనున్న యూకే ఉత్పత్తుల ధరలు
యూకేలో ఇండియా ఉత్పత్తులపై సున్నా టారిఫ్‌లు
న్యూఢిల్లీ/లండన్: భారత్–యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)తోపాటు డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఒప్పందం కుదిరాయి. ఇరుదేశాల మధ్య మూడేళ్లుగా జరుగుతున్న చర్చలు ఫలించాయి. ఒప్పందంపై భారత్, యూకే మంగళవారం అంగీకారానికి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై సుంకాల మోత మోగిస్తున్న తరుణంలో ఈ ఒప్పందాలు కుదరడం వల్ల భారత్, యూకే దేశాలకు ఎనలేని లబ్ధి చేకూరుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బలపడనున్న బంధం
యూకేతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చరిత్రాత్మకమైన మైలురాయిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్–యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబ డులు, ఆర్థిక ప్రగతి, ఉద్యోగాల కల్పన, నవీన ఆవిష్కరణలు వంటి అంశాల్లో రెండు దేశాలకు ఎంతో మేలు జరుగుతుందని హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ తాజాగా యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎఫ్‌టీఏపై చర్చించారు. ఎఫ్‌టీఏతోపాటు డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కుదరడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. ప్రపంచంలో రెండు అతిపెద్ద, ఓపెన్–మార్కెట్ ఆర్థిక వ్యవస్థలైన భారత్, యూకే మధ్య ఎఫ్‌టీఏ కుదరడంతో వ్యాపారాలకు నూతన అవకాశాలు అందుబాటులోకి రావడంతోపాటు రెండు దేశాల మధ్య ఆర్థిక బంధంతోపాటు ప్రజల మధ్య సంబంధాలు మరింత బలం పుంజుకుంటాయని మోదీ, స్టార్మర్ ఉద్ఘాటించారు.
ఏమిటీ ఒప్పందం?
⇒ భారత్–యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చాలాఏళ్లుగా చర్చల్లో నలుగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టడం, విదేశీ ఉత్పత్తులపై సుంకాల బాంబు పేల్చడంతో భారత్–యూకే మధ్య చర్చల్లో ఒక్కసారిగా వేగం పెరిగింది. 2022 జనవరిలో మొదలైన ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. అదే సమయంలో ప్రతిపాదిత ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.
⇒ స్వేచ్ఛా వాణిప్య ఒప్పందంతో విస్కీ, అడ్వాన్స్‌డ్ తయారీ భాగాలు, వైద్య పరికరాలు, అడ్వాన్స్‌డ్ మెషినరీ, ఆహార ఉత్పత్తులపై టారిఫ్‌లు భారీగా తగ్గుతాయి.
⇒అంతర్జాతీయ మార్కెట్ల కోసం రెండు దేశాలు ఉమ్మడిగా వస్తువులు, సేవలను అభివృద్ధి చేయడానికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి.
⇒యూకే ఉత్పత్తులను ఇండియా అనుమతించనుంది. అలాగే ఇండియా తమ ఉత్పత్తులను యూకేలో విక్రయించుకోవచ్చు.
⇒ భారత్‌లో బ్రిటిష్ స్కాచ్ విస్కీ, బ్రిటిష్ కార్ల ధరలు తగ్గిపోతాయి. అలాగే బ్రిటన్‌లో ఇండియా వస్త్రాలు, తోలు ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి.
⇒ ఒప్పందం ప్రకారం... యూకే విస్కీ, జిన్‌పై సుంకాన్ని 150 నుంచి 75 శాతానికి భారత్ తగ్గిస్తుంది. పదేళ్లలో 40 శాతానికి తగ్గించనుంది.
⇒ బ్రిటిష్ ఆటోమొబైల్స్‌పై ఇండియాలో టారిఫ్ ప్రస్తుతం 100 శాతం ఉండగా, ఇది 10 శాతానికి తగ్గిపోనుంది. ప్రతిఫలంగా భారత్ నుంచి వచ్చే పలు ఉత్పత్తులపై టారిఫ్‌లను యూకే ప్రభుత్వం భారీగా తగ్గిస్తుంది.
⇒ యూకే మార్కెట్లలో 99 శాతం భారతీయ ఉత్పత్తులపై టారిఫ్‌లు సున్నాకు పడిపోతాయి. పాదరక్షలు, బంగారు అభరణాలు, రత్నాలు, రసాయనాలు, ప్లాస్టిక్, రబ్బర్, కలప, కాగితం, గాజు, సెరామిక్, బేస్ మెటల్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ మెషినరీ, ఫర్నీచర్, క్రీడా సామగ్రి, శుద్ధి చేసిన ఆహారం, పాడి ఉత్పత్తులపై సుంకాలు ఉండవు. అంతేకాకుండా భారతీయులకు యూకేలో మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
⇒ ఎఫ్‌టీఏతో ఇండియా–యునైటెడ్ కింగ్‌డమ్ నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెండు రెట్లు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. 2040 నాటికి బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ ప్రతిఏటా అదనంగా 4.8 బిలియన్ పౌండ్ల మేర లాభపడుతుందని చెబుతున్నారు.
⇒భారత్, యూకే మద్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 41 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఎఫ్‌టీఏతో ఇది 56 బిలియన్ పౌండ్లకు చేరుకోనుంది.
⇒ డబుల్ కంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్(సామాజిక భద్రత ఒప్పందం) ప్రకారం.. భారత్ ఉద్యోగాలు యూకేలో లేదా యూకే ఉద్యోగులు భారత్‌లో పనిచేస్తే నేషనల్ ఇన్సూరెన్స్ లేదా సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
⇒ ఎఫ్‌టీఏకు ఇరుదేశాల పార్లమెంట్ ఆమోదం లభించి, సంతకాలు జరగాల్సి ఉంది. ఏడాది లోగా అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.