
ఈ ఏడాది ఆఖరు నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే
ప్రధాని మోదీ, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయెన్ నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్–యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య చాలాఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం(ఎఫ్‌టీయూ) త్వరలో పట్టాలకెక్కే దిశగా అడుగు ముందుకు పడింది. చరిత్రాత్మకంగా భావిస్తున్న ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది ఆఖరు నాటికి కుదుర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయెన్ నిర్ణయించారు. ఈ మేరకు ఒక డెడ్‌లైన్ విధించుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తుండడంతో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో భారత్, ఈయూ దేశాలకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుదుర్చుకోవాలని మోదీ, ఉర్సులా ఒక అంగీకారానికి వచ్చారు. వారిద్దరూ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. నిజానికి ఇండియా, ఈయూ మధ్య ఈ ఒప్పందం కోసం గత 17 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇరుపక్షాల మధ్య జరుగుతున్న సంప్రదింపులు ఒక కొలిక్కి రావడం లేదు. 2013లో సంప్రదింపులు నిలిచిపోయాయి. 2022 జూన్‌లో పునఃప్రారంభమయ్యాయి. కానీ, ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు. కొన్ని అంశాలపై ఈయూ గట్టిగా పట్టుబడుతుండగా, ఇండియా సమ్మతించడం లేదు. కార్లు, వైన్, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేయాలని ఈయూ కోరుతుండగా, భారత ప్రభుత్వం తిరస్కరిస్తోంది. మోదీ, ఉర్సులా భేటీ కావడంతో ఇక ప్రతిష్టంభన తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
కలసికట్టుగా పనిచేద్దాం
భారత్, ఈయూ మధ్య సంబంధాలపై మో దీ, ఉర్సులా విస్తృతంగా చర్చించారు. ఇరుపక్షాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ప్రధానంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకొనేలా కలసికట్టుగా పనిచేయాలని తీర్మానించారు. ఇండియాతో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ ఉద్దేశమని ఉర్సులా పేర్కొన్నారు. ఇండియా–ఈయూ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఒక కచి్చతమైన రోడ్‌మ్యాప్ రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు మోదీ వెల్లడించారు.
తదుపరి ఇండియా–ఈయూ శిఖరాగ్ర సదస్సు నాటికి రోడ్‌మ్యాప్ సిద్ధమవుతుందని అన్నారు. ఈ సదస్సు వచ్చే ఏడాది భారత్‌లో జరుగనుంది. మరోవైపు భేటీ తర్వాత మోదీ, ఉర్సులా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. భారత్, ఈయూ మధ్య వ్యాపారం వాణిజ్యం, టెక్నాలజీ, పెట్టుబడులు, నవీన ఆవిష్కరణలు, గ్రీన్ ఎనర్జీ, భద్రత, నైపుణ్యాభివృద్ధి, రవాణా వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయబోతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment