
నూతన సంవత్సరం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు
బార్ అండ్ రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లు రాత్రి ఒంటిగంట వరకు పొడిగింపు
రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 31న రాష్ట్రంలో మద్యం విక్రయ వేళలను పొడిగించారు. 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు జరుపుకొనేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హోటళ్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మవచ్చు. అదే విధంగా అన్ని వైన్‌షాపులను ఆ రోజు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే మద్యం అమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల జిల్లాల అధికారులతో జరిగిన సమావేశంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సిబ్బందికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment