ఊరూవాడా అంబేద్కర్ వర్ధంతి సభలు...దాదాపు ప్రతిసభలోనూ నేతలంతా అంబేద్కర్ మార్గాన్ని అనుసరిస్తారమని, అంటరానితనాన్ని చూపుమాపుతామంటూ గొప్పలు చెప్పారు. ఇక ప్రజాప్రతినిధులు, మంత్రులైతే ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి పంపిణీచేస్తున్నాం.. వారు ఆర్థికంగా ఎదిగి తలెత్తుకుని జీవించేలా చేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చేశారు.
కానీ సీఎం కేసీఆర్ సొంతగడ్డ సిద్దిపేటలో దళితులు మాత్రం బంగారు బతుకులు దేవుడికెరక ..చచ్చాక ఆరడగుల నేలనివ్వండి చాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు కేటాయించిన శ్మశాన వాటికను కాపాడాలని కోరుతూ వారంతా శుక్రవారం సిద్దిపేట ఆర్డీఓ, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలను అందజేశారు.
- సిద్దిపేట అర్బన్
బతికినన్నాళ్లూ అంటరాని వారంటూ అవమానాలు ఎదుర్కొంటున్న దళితులు...చచ్చాక కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. దళితులకు కేటాయించిన శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాల్సిన సిద్దిపేట రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతాన్ని చెత్త డంపింగ్ యార్డుగా మార్చేశారు. దీన్ని అవకాశంగా తీసుకున్న అక్రమార్కులు ఆ స్థలాన్ని కబ్జాచేస్త్తున్నారు. దీంతో దళితులంతా తమ శాశ్వత నిద్రకు ఆరడుగుల స్థలం ఇవ్వండి సార్లూ అంటూ గగ్గోలు పెడుతున్నారు.
సిద్దిపేట పట్టణంలోని ముర్షద్‌గడ్డలో సుమారు 50 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయి. వారికి నాసర్‌పురా శివారులో గల కప్పలకుంట సర్వే నంబర్ 2194లో 3.17 ఎకరాల భూమిని 1960లో అప్పటి ప్రభుత్వం శ్మశానం కోసం కేటాయించింది. అప్పటి నుంచి దళితుల మృతదేహాలను అక్కడ ఖననం చేస్తున్నారు. అయితే శ్మశాన వాటిక దళితులదే కదా అనుకున్నారో ఏమో కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు దాని గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో శ్మశాన వాటిక స్థలంలో మున్సిపల్ సిబ్బంది చెత్తను వేయడం ప్రారంభించారు. మరోవైపు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం, సిద్దిపేట ప్రాంతంలో రోజురోజుకు రియల్ వ్యాపారం జోరందుకోవడంతో అక్రమార్కుల కన్ను దళితుల శ్మశాన వాటికపై పడింది.
అందులోని కొంత స్థలాన్ని కబ్జా చేసిన అక్రమార్కులు..మున్సిపల్ అధికారుల అండతో ఆ స్థలాన్ని కొట్టేయాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ప్రస్తుతానికి దళితుల శ్మశాన వాటికను డంపింగ్‌యార్డుగా మార్చేశారు.
అంతేకాకుండా జేసీబీని ఉపయోగించి శ్మశాన వాటిక ఉన్న స్థలంలోని మట్టిని యథేచ్ఛగా తరలించేశారు. దీంతో శ్మశాన వాటికలె పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో దళితులంతా మృతదేహాలను ఖననం చేసేందుకు పడరానిపాట్లు పడుతున్నారు.
విన్నపాలు వినిపించుకోని అధికారులు
శ్మశాన వాటిక ఉనికికే ప్రమాదం ఏర్పడడంతో దళితులంతా ఆందోళనలు చేశారు. దీంతో స్పందించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు శ్మశాన వాటిక రక్షణకు 2009లో బీఆర్‌జీఎఫ్ స్కీంలో రూ.3 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో శ్మశాన వాటికకు కాంపౌండ్ వాల్, బోరు తదితర వసతులను కల్పించాల్సి ఉంది. అయితే నేటి వరకు ఆ పనులు జరగలేదు. మరోవైపు శ్మశాన వాటిక డంపింగ్‌యార్డుగా మారుతుండడంతో...దళితులంతా శ్మశానవాటికకు రక్షణ కల్పించాలని పలుమార్లు గ్రీవెన్ సెల్‌లో పలుమార్లు అధికారులకు విన్నవించారు. అయినప్పటికీ దళితుల ఆవేదనను ఏ అధికారీ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం వారంతా తమ శ్మశాన వాటికకు రక్షణ కల్పించాలని మరోసారి సిద్దిపేట ఆర్డీఓ, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలను అందజేశారు.
సమాధులూ కబ్జా
Published Sun, Dec 7 2014 12:01 AM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM
Advertisement
Advertisement