ఇదో ఉద్యమం.. దేశానికే వెలుతురునిస్తుంది: సీఎం కేసీఆర్‌ | Dalit Bandhu To Be Role Model For Country: Telangana CM KCR | Sakshi
Sakshi News home page

ఇదో ఉద్యమం.. దేశానికే వెలుతురునిస్తుంది: సీఎం కేసీఆర్‌

Published Tue, Jul 27 2021 1:55 AM | Last Updated on Wed, Jul 28 2021 7:13 PM

Dalit Bandhu To Be Role Model For Country: Telangana CM KCR - Sakshi

సోమవారం ప్రగతిభవన్‌లో ‘దళిత బంధు’పై సదస్సులో  మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

మూడు దశల్లో పథకం.. 
దళితుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మూడు దశలను పాటించాలి. మొదట దళితుల అసైన్డ్, గ్రామ కంఠం తదితర భూసమస్యలను పరిష్కరించాలి. తర్వాత దళితవాడల్లో మౌలిక వసతులను సంపూర్ణ స్థాయిలో మెరుగుపర్చాలి. అనంతరం ‘దళిత బంధు’పథకాన్ని అమలు చేయాలి. 

దళిత బంధు లబ్ధిదారులకు బీమా 
‘దళిత బంధు’ లబ్ధిదారులకు ‘దళిత బీమా’ను వర్తింపచేసే దిశగా సర్కారు ఆలోచన చేస్తోంది. రైతుబీమా మాదిరి వ్యవస్థను ఏర్పాటు చేసి దళిత బీమాను అమలుచేద్దాం. మంత్రి, దళిత ప్రజాప్రతినిధులు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేసి, ఆమోదయోగ్య కార్యాచరణ రూపొందించాలి. కొంచెం ఆలస్యమైనా సరే దళిత బీమాను అమలు చేసుకుందాం. 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘దళితబంధు ఒక కార్యక్రమం కాదు.. ఇదొక ఉద్యమం.. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి విజయాన్ని సాధించి పెట్టింది. ఇప్పుడు దళితబంధు కార్యక్రమం దళితుల అభి వృద్ధితో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి దారులు వేస్తుంది. అవకాశం, సహకారం లేక బాధపడు తున్న వర్గాలకు మార్గం చూపుతుంది. ఇక్కడి దళితుల విజయం ఇతర కులాలు, వర్గాలకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశానికి వెలుతురు ప్రసరింప చేస్తుంది’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ‘దళిత బంధు’ పథకంపై హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన 427 మందితో ప్రగతిభవన్‌లో సోమవారం నిర్వహించిన అవగా హన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనిషిపై తోటి మనిషి వివక్ష చూపించే దుస్థితి మీద సెంటర్‌ ఫర్‌ సబాల్టర్న్‌ స్టడీ ద్వారా తాను కూడా అధ్యయనం చేశానని కేసీఆర్‌ వివరించారు. కక్షలు, కార్పణ్యాలు ద్వేషాలు పోయి పరస్పర విశ్వాసం పెంచుకుని ఒకరికొకరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. దళిత మహిళ మరియమ్మ మరణానికి కారకులైన పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. 


 

ప్రభుత్వమే అండ 
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్కో వర్గాన్ని, ఒక్కో రంగాన్ని బాగు చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వమే స్వయంగా అండగా ఉన్నప్పుడు స్వీయ అభివృద్ధి కోసం దళిత సమాజం పట్టుదలతో పనిచేయాలి. తమలో ఇమిడి ఉన్న పులిలాంటి శక్తిని గుర్తించి ముందుకు సాగాలి. దళారులకు, ప్రతీప శక్తులకు దూరంగా ఉండాలి. దళితవాడల్లో ఇప్పటికే నమోదై ఉన్న పరస్పర కేసులను వాపస్‌ తీసుకుని పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలి. అప్పుడే మన విజయానికి బాటలు పడతాయి. 

వ్యాపారవర్గంగా అభివృద్ధి చెందాలి 
ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో దళిత సమాజం తమకు ఇష్టమైన పరిశ్రమ, ఉపాధి, వ్యాపారాన్ని ఎంచుకుని వ్యాపారవర్గంగా అభివృద్ధి చెందాలి. గ్రామంలోని ఇతర వర్గాలు దళితుల వద్దకు అప్పుకోసం వచ్చేలా ఆర్థిక సాధికారత సాధించాలి. అంబేద్కర్‌ ఆశయాలను అమలు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో విద్యావంతులైన దళితులు కదిలి రావాలి. హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమవుతున్న దళితబంధును విజయవంతం చేసేందుకు పట్టుదలగా పనిచేయాలి. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించాలి. దళితులు విజయం సాధించి వెలుగు దివ్వెలు, కరదీపికలుగా మారాలి. 

ఏది కోరుకుంటే అదే.. 
వివిధ రకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి లబ్ధిదారుల ఇష్టాన్ని బట్టి ఆర్థిక సాయం అందిస్తాం. దానితోపాటు లబ్ధిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ఏర్పాటు చేస్తాం. కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్ధిదారుల కమిటీ దానిని నిర్వహిస్తుంది. ఆ నిధిలో ఏటా కనీస మొత్తాన్ని జమ చేస్తూ దళితులు మరింత పటిష్టంగా నిలదొక్కుకునేందుకు వినియోగిస్తాం. 

ప్రతీ లబ్ధిదారుడికి గుర్తింపు కార్డు 
దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందేవారికి గుర్తింపు కార్డు ఇస్తాం. ప్రత్యేకమైన బార్‌కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్‌ చిప్‌ను ఆ ఐడీ కార్డులో చేర్చి పథకం అమలుతీరు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తాం. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. లబ్ధిదారుడు తను ఎంచుకున్న పనిద్వారా ఆర్థికంగా ఎదగాలే తప్ప జారి పడనివ్వం. 


సోమవారం ప్రగతిభవన్‌లో హుజూరాబాద్‌ నుంచి వచ్చిన ప్రతినిధులతో కలసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్‌

 
హుజూరాబాద్‌లో దళితుల సమస్యలన్నీ తీర్చాలి 
హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని దళిత వాడల స్థితిగతులను తెలియజేసేలా ప్రొఫైల్‌ తయారు చేయాలి. హుజూరాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం లేకుండా వంద శాతం పూర్తికావాలి. ఖాళీ స్థలాలున్న వారు ఇండ్ల నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా దళితులకు దీనిని అమలు చేస్తాం. నియోజకవర్గంలోని దళితవాడల్లో రేషన్‌కార్డులు, పింఛన్లు సహా అన్ని రకాల సమస్యలను గుర్తించి అధికారులు నివేదిక తయారు చేయాలి. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సాయం చేస్తుంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో వారం పదిరోజుల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి, అసైన్డ్‌ సహా దళితుల అన్నిరకాల భూసమస్యలను పరిష్కరించాలి..’’అని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కాగా సదస్సులో ప్రసంగం తర్వాత దళిత బంధు పథకంలో మార్పులు, చేర్పులపై హుజూరాబాద్‌ నుంచి వచ్చిన దళితుల నుంచి సీఎం అభిప్రాయాలు సేకరించారు. 

సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు 
ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఉదయం 11.30కు సమావేశం ప్రారంభంకాగా దళితబంధు పథకం ప్రత్యేకతలను సీఎం కేసీఆర్‌ వివరించారు. మధ్యాహ్నం సదస్సుకు హాజరైన మహిళలు, యువకులు, ఇతర ప్రతినిధులతో కలిసి సీఎం భోజనం చేశారు. నాటుకోడి, చేపలు, మాంసాహారం, ఇతర ప్రత్యేక వంటకాలు వడ్డించారు. ఈ సందర్భంగా ‘గొర్రెల మందల పెరిగిన పులి’, ‘పైరవీకారుల మీద రామాయణం’అంటూ సీఎం హాస్యోక్తులు పండించినట్టు దళిత ప్రతినిధులు వెల్లడించారు. 17 వేల పొదుపు సంఘాలను తయారుచేసిన బంగ్లాదేశ్‌ ప్రొఫెసర్‌ హాష్మి గురించి కేసీఆర్‌ వివరించారని తెలిపారు. సదస్సులో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, అభ్యర్థులు వంటి అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. 

సదస్సులో పాల్గొన్నది వీరే.. 
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన దళితబంధు అవగాహన సదస్సులో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గోరటి వెంకన్న, ప్రభాకర్, రాజేశ్వర్‌రావు.. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, రసమయి బాలకిషన్, గా>్యదరి కిషోర్, చంటి క్రాంతి కిరణ్, సండ్ర వెంకటవీరయ్య, దుర్గం చిన్నయ్య, హన్మంత్‌ షిండే, సుంకె రవిశంకర్, కె.మానిక్‌రావు, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, జి.సాయన్న, వీఎం అబ్రహం, చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఇక సీపీఎం, సీపీఐ నేతలు వెంకట్, బాలనర్సింహ, ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌కుమార్, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రాహుల్‌ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్, పలు ఇతర శాఖల ఉన్నతాధికారులు, హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 
 
ఎవరేమన్నారంటే.. 
నేను ట్రాక్టర్‌ డ్రైవర్‌ను. పథకంలో అర్హత పొందితే ట్రాక్టర్‌ను కొనుక్కుంటా: సమ్మయ్య, కిష్టంపల్లి, వీణవంక మండలం 
నేను కారు డ్రైవర్‌ను. టాక్సీ కారు కొనుక్కుని స్వయంగా కిరాయికి నడుపుకొంటా: దాసర్ల చిరంజీవి, లస్మక్కపల్లి, వీణవంక మండలం 

తెలంగాణలో విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా ‘దళిత బంధు’లాంటి పథకాన్ని అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: వెంకట్, సీపీఎం 
రాజకీయాలకు అతీతంగా అమలు చేస్తున్న దళితబంధు దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పుకు బాటలు వేస్తుంది. దేశవ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు కోసం పోరాడుతాం: బాల నర్సింహ, సీపీఐ 

దళితబంధు పథకం ద్వారా తెలంగాణ దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరుగుతారు. అరవై లక్షల మంది తెలంగాణ దళితులæ జీవితాల్లో వెలుగులు నింపే గురుతర బాధ్యత హుజూరాబాద్‌ పైలట్‌ ప్రాజెక్టు విజయం మీద ఆధారపడి ఉంది: రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే 
పథకం పటిష్ట అమలు కోసం నోడల్‌ ఏజెన్సీని నియమించాలి. దళిత ప్రజాప్రతినిధులు పైలట్‌ నియోజకవర్గంలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తే నేర్చుకుంటం: గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్‌ 
బ్యాంకుల ప్రమేయం లేకుండా, గ్యారెంటీ లేకుండా నేరుగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే: కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి 
చిన్నలోన్‌ కోసం తండ్లాడిన దళితులకు ఉపాధి కోసం రూ.10 లక్షలు పూర్తి ఉచితంగా ఇవ్వడం మానవీయ నిర్ణయం. ఇది దేశంలోనే విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుంది. ఉద్యమ స్పూర్తితో జరుగుతున్న తెలంగాణ అభివృద్ధిలో మాలాంటి వాళ్లను ప్రజాప్రతినిధులను చేసి భాగస్వామ్యం చేస్తున్నందుకు ధన్యవాదాలు 
-గోరటి వెంకన్న, ఎమ్మెల్సీ 
 
16 బస్సులు.. 427 మంది 
హుజూరాబాద్‌: ప్రగతిభవన్‌లో జరిగిన ‘దళితబంధు’పథకం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి 412 మంది దళిత ప్రతినిధులు, 15 మంది రిసోర్స్‌పర్సన్‌లు కలిపి మొత్తం 427 మంది 16 ప్రత్యేక ఏసీ బస్సుల్లో వచ్చారు. మొదట ఆయా మండలాల నుంచి బస్సుల్లో హుజూరాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్దకు వచ్చారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్, మరికొందరు బాణసంచా డప్పు చప్పుళ్ల మధ్య అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. తర్వాత బస్సులను కలెక్టర్‌ కర్ణన్‌ జెండా ఊపి ప్రారంభించారు. అవగాహన సదస్సులో పాల్గొనేందుకు నియోజవర్గంలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డు నుంచి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల చొప్పున ఎంపిక చేసి పంపినట్టు కలెక్టర్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement