Dalit Empowerment
-
ఇదో ఉద్యమం.. దేశానికే వెలుతురునిస్తుంది: సీఎం కేసీఆర్
మూడు దశల్లో పథకం.. ►దళితుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మూడు దశలను పాటించాలి. మొదట దళితుల అసైన్డ్, గ్రామ కంఠం తదితర భూసమస్యలను పరిష్కరించాలి. తర్వాత దళితవాడల్లో మౌలిక వసతులను సంపూర్ణ స్థాయిలో మెరుగుపర్చాలి. అనంతరం ‘దళిత బంధు’పథకాన్ని అమలు చేయాలి. దళిత బంధు లబ్ధిదారులకు బీమా ►‘దళిత బంధు’ లబ్ధిదారులకు ‘దళిత బీమా’ను వర్తింపచేసే దిశగా సర్కారు ఆలోచన చేస్తోంది. రైతుబీమా మాదిరి వ్యవస్థను ఏర్పాటు చేసి దళిత బీమాను అమలుచేద్దాం. మంత్రి, దళిత ప్రజాప్రతినిధులు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేసి, ఆమోదయోగ్య కార్యాచరణ రూపొందించాలి. కొంచెం ఆలస్యమైనా సరే దళిత బీమాను అమలు చేసుకుందాం. సాక్షి, హైదరాబాద్: ‘‘దళితబంధు ఒక కార్యక్రమం కాదు.. ఇదొక ఉద్యమం.. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి విజయాన్ని సాధించి పెట్టింది. ఇప్పుడు దళితబంధు కార్యక్రమం దళితుల అభి వృద్ధితో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి దారులు వేస్తుంది. అవకాశం, సహకారం లేక బాధపడు తున్న వర్గాలకు మార్గం చూపుతుంది. ఇక్కడి దళితుల విజయం ఇతర కులాలు, వర్గాలకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశానికి వెలుతురు ప్రసరింప చేస్తుంది’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ‘దళిత బంధు’ పథకంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 427 మందితో ప్రగతిభవన్‌లో సోమవారం నిర్వహించిన అవగా హన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనిషిపై తోటి మనిషి వివక్ష చూపించే దుస్థితి మీద సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీ ద్వారా తాను కూడా అధ్యయనం చేశానని కేసీఆర్ వివరించారు. కక్షలు, కార్పణ్యాలు ద్వేషాలు పోయి పరస్పర విశ్వాసం పెంచుకుని ఒకరికొకరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. దళిత మహిళ మరియమ్మ మరణానికి కారకులైన పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రభుత్వమే అండ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్కో వర్గాన్ని, ఒక్కో రంగాన్ని బాగు చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వమే స్వయంగా అండగా ఉన్నప్పుడు స్వీయ అభివృద్ధి కోసం దళిత సమాజం పట్టుదలతో పనిచేయాలి. తమలో ఇమిడి ఉన్న పులిలాంటి శక్తిని గుర్తించి ముందుకు సాగాలి. దళారులకు, ప్రతీప శక్తులకు దూరంగా ఉండాలి. దళితవాడల్లో ఇప్పటికే నమోదై ఉన్న పరస్పర కేసులను వాపస్ తీసుకుని పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలి. అప్పుడే మన విజయానికి బాటలు పడతాయి. వ్యాపారవర్గంగా అభివృద్ధి చెందాలి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో దళిత సమాజం తమకు ఇష్టమైన పరిశ్రమ, ఉపాధి, వ్యాపారాన్ని ఎంచుకుని వ్యాపారవర్గంగా అభివృద్ధి చెందాలి. గ్రామంలోని ఇతర వర్గాలు దళితుల వద్దకు అప్పుకోసం వచ్చేలా ఆర్థిక సాధికారత సాధించాలి. అంబేద్కర్ ఆశయాలను అమలు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో విద్యావంతులైన దళితులు కదిలి రావాలి. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమవుతున్న దళితబంధును విజయవంతం చేసేందుకు పట్టుదలగా పనిచేయాలి. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించాలి. దళితులు విజయం సాధించి వెలుగు దివ్వెలు, కరదీపికలుగా మారాలి. ఏది కోరుకుంటే అదే.. వివిధ రకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి లబ్ధిదారుల ఇష్టాన్ని బట్టి ఆర్థిక సాయం అందిస్తాం. దానితోపాటు లబ్ధిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ఏర్పాటు చేస్తాం. కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్ధిదారుల కమిటీ దానిని నిర్వహిస్తుంది. ఆ నిధిలో ఏటా కనీస మొత్తాన్ని జమ చేస్తూ దళితులు మరింత పటిష్టంగా నిలదొక్కుకునేందుకు వినియోగిస్తాం. ప్రతీ లబ్ధిదారుడికి గుర్తింపు కార్డు దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందేవారికి గుర్తింపు కార్డు ఇస్తాం. ప్రత్యేకమైన బార్‌కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్‌ను ఆ ఐడీ కార్డులో చేర్చి పథకం అమలుతీరు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తాం. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. లబ్ధిదారుడు తను ఎంచుకున్న పనిద్వారా ఆర్థికంగా ఎదగాలే తప్ప జారి పడనివ్వం. సోమవారం ప్రగతిభవన్‌లో హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులతో కలసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో దళితుల సమస్యలన్నీ తీర్చాలి హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత వాడల స్థితిగతులను తెలియజేసేలా ప్రొఫైల్ తయారు చేయాలి. హుజూరాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం లేకుండా వంద శాతం పూర్తికావాలి. ఖాళీ స్థలాలున్న వారు ఇండ్ల నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా దళితులకు దీనిని అమలు చేస్తాం. నియోజకవర్గంలోని దళితవాడల్లో రేషన్‌కార్డులు, పింఛన్లు సహా అన్ని రకాల సమస్యలను గుర్తించి అధికారులు నివేదిక తయారు చేయాలి. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సాయం చేస్తుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో వారం పదిరోజుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి, అసైన్డ్ సహా దళితుల అన్నిరకాల భూసమస్యలను పరిష్కరించాలి..’’అని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాగా సదస్సులో ప్రసంగం తర్వాత దళిత బంధు పథకంలో మార్పులు, చేర్పులపై హుజూరాబాద్ నుంచి వచ్చిన దళితుల నుంచి సీఎం అభిప్రాయాలు సేకరించారు. సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఉదయం 11.30కు సమావేశం ప్రారంభంకాగా దళితబంధు పథకం ప్రత్యేకతలను సీఎం కేసీఆర్ వివరించారు. మధ్యాహ్నం సదస్సుకు హాజరైన మహిళలు, యువకులు, ఇతర ప్రతినిధులతో కలిసి సీఎం భోజనం చేశారు. నాటుకోడి, చేపలు, మాంసాహారం, ఇతర ప్రత్యేక వంటకాలు వడ్డించారు. ఈ సందర్భంగా ‘గొర్రెల మందల పెరిగిన పులి’, ‘పైరవీకారుల మీద రామాయణం’అంటూ సీఎం హాస్యోక్తులు పండించినట్టు దళిత ప్రతినిధులు వెల్లడించారు. 17 వేల పొదుపు సంఘాలను తయారుచేసిన బంగ్లాదేశ్ ప్రొఫెసర్ హాష్మి గురించి కేసీఆర్ వివరించారని తెలిపారు. సదస్సులో హుజూరాబాద్ ఉప ఎన్నిక, అభ్యర్థులు వంటి అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. సదస్సులో పాల్గొన్నది వీరే.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన దళితబంధు అవగాహన సదస్సులో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గోరటి వెంకన్న, ప్రభాకర్, రాజేశ్వర్‌రావు.. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, రసమయి బాలకిషన్, గా>్యదరి కిషోర్, చంటి క్రాంతి కిరణ్, సండ్ర వెంకటవీరయ్య, దుర్గం చిన్నయ్య, హన్మంత్ షిండే, సుంకె రవిశంకర్, కె.మానిక్‌రావు, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, జి.సాయన్న, వీఎం అబ్రహం, చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఇక సీపీఎం, సీపీఐ నేతలు వెంకట్, బాలనర్సింహ, ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, పలు ఇతర శాఖల ఉన్నతాధికారులు, హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఎవరేమన్నారంటే.. ►నేను ట్రాక్టర్ డ్రైవర్‌ను. పథకంలో అర్హత పొందితే ట్రాక్టర్‌ను కొనుక్కుంటా: సమ్మయ్య, కిష్టంపల్లి, వీణవంక మండలం ►నేను కారు డ్రైవర్‌ను. టాక్సీ కారు కొనుక్కుని స్వయంగా కిరాయికి నడుపుకొంటా: దాసర్ల చిరంజీవి, లస్మక్కపల్లి, వీణవంక మండలం ►తెలంగాణలో విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా ‘దళిత బంధు’లాంటి పథకాన్ని అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: వెంకట్, సీపీఎం ►రాజకీయాలకు అతీతంగా అమలు చేస్తున్న దళితబంధు దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పుకు బాటలు వేస్తుంది. దేశవ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు కోసం పోరాడుతాం: బాల నర్సింహ, సీపీఐ ►దళితబంధు పథకం ద్వారా తెలంగాణ దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరుగుతారు. అరవై లక్షల మంది తెలంగాణ దళితులæ జీవితాల్లో వెలుగులు నింపే గురుతర బాధ్యత హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టు విజయం మీద ఆధారపడి ఉంది: రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే ►పథకం పటిష్ట అమలు కోసం నోడల్ ఏజెన్సీని నియమించాలి. దళిత ప్రజాప్రతినిధులు పైలట్ నియోజకవర్గంలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తే నేర్చుకుంటం: గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్ ►బ్యాంకుల ప్రమేయం లేకుండా, గ్యారెంటీ లేకుండా నేరుగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే: కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి ►చిన్నలోన్ కోసం తండ్లాడిన దళితులకు ఉపాధి కోసం రూ.10 లక్షలు పూర్తి ఉచితంగా ఇవ్వడం మానవీయ నిర్ణయం. ఇది దేశంలోనే విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుంది. ఉద్యమ స్పూర్తితో జరుగుతున్న తెలంగాణ అభివృద్ధిలో మాలాంటి వాళ్లను ప్రజాప్రతినిధులను చేసి భాగస్వామ్యం చేస్తున్నందుకు ధన్యవాదాలు -గోరటి వెంకన్న, ఎమ్మెల్సీ 16 బస్సులు.. 427 మంది హుజూరాబాద్: ప్రగతిభవన్‌లో జరిగిన ‘దళితబంధు’పథకం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 412 మంది దళిత ప్రతినిధులు, 15 మంది రిసోర్స్పర్సన్లు కలిపి మొత్తం 427 మంది 16 ప్రత్యేక ఏసీ బస్సుల్లో వచ్చారు. మొదట ఆయా మండలాల నుంచి బస్సుల్లో హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మరికొందరు బాణసంచా డప్పు చప్పుళ్ల మధ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తర్వాత బస్సులను కలెక్టర్ కర్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. అవగాహన సదస్సులో పాల్గొనేందుకు నియోజవర్గంలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డు నుంచి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల చొప్పున ఎంపిక చేసి పంపినట్టు కలెక్టర్ తెలిపారు. -
దళితాభివృద్ధిలో దశ పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా పది రకాల పథకాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో విద్య, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ చేపట్టిన సంక్షేమ పథకాలు దళిత సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు పేర్కొంది. దళితుల్లో అన్ని కేటగిరీల్లోని వారికి సంక్షేమ ఫలాలు అందేలా రూపొందించిన ఈ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో, రాష్ట్రేతర మేధావుల నుంచి ప్రశంసలు లభించాయి. దళితుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను ఆదివారం ప్రగతి భవన్లో సీఎం అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్సీ అభివృద్ధి శాఖ వివరించింది. 2014–15 వార్షిక సంవత్సరం నుంచి 2021–22 సంవత్సరం మే నెలాఖరు వరకు పది పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 13,798.67 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఈ పథకాల ద్వారా ఏకంగా 31,74,223 మంది లబ్ధి పొందినట్లు ఆ శాఖ ప్రాథమిక గణాంకాలను వెల్లడించింది. విద్యకు పెద్దపీట... రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అత్యధిక ప్రాధాన్యం విద్యకు దక్కింది. జనాభా సంఖ్యకు తగినట్లుగా సర్కారు గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో 268 పాఠశాలలు, కళాశాలలున్నాయి. వాటిలో 3.10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. గురుకుల విద్యాసంస్థల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2014–15 నుంచి ఇప్పటివరకు రూ. 4558.74 కోట్లు ఖర్చు చేసింది. ఇక ప్రీ–మెట్రిక్, పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాల కింద రూ. 3,216.94 కోట్లు, ఎస్సీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ కోసం రూ. 1,714.96 కోట్లు వెచ్చించింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటులో భాగంగా రూ. 1,943.59 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. 1,422.11 కోట్లు ఖర్చు పెట్టింది. చదవండి: (వారికి ఒక్కో కుటుంబానికి 10 లక్షలు.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి) -
వారికి ఒక్కో కుటుంబానికి 10 లక్షలు.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి
►దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేయాలని నిశ్చయించుకుంది. మీరందరూ కలిసిరావాలి. నాకు భగవంతుడిచ్చిన సర్వ శక్తుల్నీ ఉపయోగించి ఈ పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలన్నదే నా దృఢ సంకల్పం. ►పైరవీలకు ఆస్కారం లేని, పారదర్శక విధానం అమలు చేద్దాం. నిధుల బాధ్యత నాది. రాజకీయాలకు అతీతంగా సమష్టి కార్యాచరణ మనందరి బాధ్యత. ►దళిత సాధికారత విషయంలో సీఎంవోలో ప్రత్యేక అధికారిని నియమిస్తాం. ఎస్సీ రైతుల వద్ద ఉన్న 13,58,000 ఎకరాల్లో అసైన్డ్ భూములు ఎన్ని? ఇందులో ఉన్నదెంత ? పోయిందెంత? లెక్కలు తీయాలి. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ప్రైవేటు రంగంలో దళితులకు రిజర్వేషన్ల అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకం కింద ఎంపిక చేసే అర్హులైన ఒక్కో దళిత కుటుంబం (ఒక యూనిట్) బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని జమ చేయాలి. మొదటి దశలో ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాలు చొప్పున రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల పరిధిలో ఎంపిక చేసిన 11,900 కడుపేద దళిత కుటుంబాలకు రైతుబంధు తరహాలో నేరుగా ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయాలి. రూ.1,200 కోట్లతో సీఎం దళిత సాధికారత పథకం అమలుకు శ్రీకారం చుట్టాలి..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష భేటీ సమిష్టి నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. తమ అభివృద్ధిని తామే నిర్వచించుకుని, తమ స్కీమ్‌ను తామే నిర్ణయించుకునే స్వేచ్ఛను ఈ పథకం కింద ఎంపికైన కుటుంబాలకు కల్పించాలని సమావేశం నిర్ణయించింది. ఆర్థిక సాధికారత, స్వావలంబన కోసం దళితుల స్వీయ నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు దాదాపు 10 గంటలపాటు జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అఖిలపక్ష నేతలతో పాటు దళిత ప్రజాప్రతినిధులు, మేధావులు, అధికారులు చర్చలో పాల్గొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం.. ‘దళితుల అభ్యున్నతి కోసం సీఎం దళిత సాధికారత పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. ఈ బడ్జెట్లో ఈ పథకానికి రూ.1,200 కోట్లు కేటాయించాం. వచ్చే మూడు నాలుగేళ్లలో రూ.35–40 వేల కోట్లను ఖర్చు చేయాలని యోచిస్తున్నాం. ఎస్సీ సబ్‌ప్లాన్ కేటాయింపులకు ఈ నిధులు అదనం. బ్యాంక్ గ్యారెంటీ జంజాటం లేకుండానే ఈ పథకం ద్వారా దళితులకు సహకారం అందిస్తాం.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలో కీలక ప్రకటన చేశారు. దళితుల్లో అర్హులైన పేద కుటుంబాల గణన జరపాలని అధికారులను ఆదేశించారు. రైతు బంధు, ఆసరా పెన్షన్ల తరహాలో అత్యంత పారదర్శకంగా, మధ్య దళారులకు ఆస్కారం లేకుండా నేరుగా అర్హులైన దళితులకు ఆర్థిక సహాయం అందించేందుకు సలహాలు అందించాలని అఖిలపక్ష నేతలను కోరారు. దళితుల పట్ల వివక్ష దేశానికే కళంకం ‘దళితులు సామాజిక, ఆర్థిక వివక్షకు గురవడం భారత సమాజానికే కళంకం. ఇది మనసున్న ప్రతి ఒక్కరినీ కలచి వేసే విషయం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నది. విద్య, వ్యవసాయం సహా పలు రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధిస్తున్నది. అయినా ఇంకా దారిద్య్రరేఖకు దిగువన, బాటమ్ లైన్లో విస్మరించబడిన దళిత కుటుంబాలను గుర్తించి వారిని అభివృద్ధి పథాన నడిపించడమే ప్రధాన ధ్యేయంగా రూ.1200 కోట్లతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. అట్టడుగున ఉన్న వారితో సహాయాన్ని ప్రారంభించి, వారి అభ్యున్నతిని సాంకేతికతతో నిరంతరం పర్యవేక్షిస్తాం. వ్యవసాయం, సాగునీటి రంగాలను పట్టుబట్టి గాడిలో పెట్టినట్టు, దళితుల సాధికారతకు కూడా అంతే పట్టుదలతో పని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది..’ అని సీఎం తెలిపారు. ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలి ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ విధానాన్ని అనుసరిస్తూ దళితుల అభివృద్ధికి ఎస్సీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. చిత్తశుద్ధి గల అధికారులను నియమించుకోవాలి. దళిత యువత ఆలోచనా దృక్పథంలో గుణాత్మక మార్పు తీసుకురావాలి. ఆత్మనూన్యత నుంచి బయటపడి ఆత్మస్థైర్యంతో ఉన్నత స్థాయి ఓరియంటేషన్ అలవర్చుకునే దిశగా చర్యలు చేపట్టాలి. దళిత సమాజాన్ని సాధికారత దిశగా అవకాశాలను అందుకునే పద్ధతిలో చైతన్యం చేయాలి. గోరేటి వెంకన్న వంటి కవులను, ఇతర కళాకారుల సేవలను వినియోగించుకోవాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు. దళిత యువతకు కోటాపై పరిశీలన ‘వ్యాపారం, స్వయం ఉపాధి రంగాల్లో ప్రభుత్వం మంజూరు చేసే లైసెన్స్‌లు, పెట్టుబడి సహాయం విషయాల్లో అర్హులైన దళిత యువతకు రిజర్వేషన్లు అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తాం. దళిత విద్యార్థుల విదేశీ విద్య స్కాలర్షిప్పులకు సంబంధించిన గరిష్ట వార్షిక ఆదాయ పరిమితిని సడలించేందుకు పరిశీలన జరుపుతాం.’ అని హామీ ఇచ్చారు. దళితుల అధీనంలోని భూముల గణన ‘రాష్ట్రంలో 7,79,902 మంది ఎస్సీ రైతుల వద్ద 13,58,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. స్థిరత్వం సాధించిన ఎస్సీ కుటుంబాలకు ఇతరత్రా చేయూతనిస్తూనే, స్థిరత్వం సాధించని, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలను మొట్ట మొదటగా ఆదుకునే కార్యాచరణ చేపట్టాలి. ఎస్సీల భూముల్లో నీళ్ళు లేని, నీళ్ళు ఉండి ఇతర వసతులు లేని భూములు కలిగి ఉన్న కుటుంబాలను గుర్తించాలి. తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలి. లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర అవగాహనకు రావాలి. రాష్ట్రమంతా అవసరమైతే పది పదిహేను రోజులు భూముల లెక్కల మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను వేర్వేరుగా సిద్ధం చేసుకోవాలి..’ అని సీఎం అధికారులను ఆదేశించారు. సఫాయి కార్మికులకు పీఆర్సీ తరహాలో.. ‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదం నాది. సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎవరూ డిమాండ్ చేయకున్నా ప్రతిసారీ సఫాయి కార్మికుల జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం (పీఆర్సీ తరహాలో) అమలుకు చర్యలు తీసుకుంటాం..’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. దళిత బిడ్డలు నైపుణ్యం పెంచుకోవాలి ‘సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది.. చంటి పిల్లను పెంచి పోషించే పాత్ర. నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతయి. అందుకు పాలకులే బాధ్యులు అవుతారు. ‘మేము కూడా పురోగమించ గలం’ అనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో సూచనలు చేయండి. పైరవీలకు ఆస్కారం లేని, పారదర్శక విధానాన్ని అమలు పరుద్దాం. భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగింది. మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలి. అద్దాల అంగడి మాయా లోకపు పోటీ ప్రపంచంలో, ఉపాధి అవకాశాలను అంది పుచ్చుకోవడానికి దళిత బిడ్డలు తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలి. అందుకు ప్రభుత్వం సహకారం అందిస్తది. గోరేటి వెంకన్న రాసిన ‘గల్లీ చిన్నది’ పాటను మనసు పెట్టి వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడివిడిగా గుర్తించి పరిష్కారాలు వెతకాలి. దళితుల సామాజిక, ఆర్థిక సమస్యలను గుర్తించి సమిష్టి కృషితో సమాధానాలు సాధించాలి’ అని ముఖ్యమంత్రి కోరారు. ఇప్పుడు అమలులో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే సీఎం దళిత సాధికారత పథకాన్ని కూడా వర్తింప జేయనున్నట్టు తెలిపారు. ప్రతి లబ్ధిదారునికీ కార్డు ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. ►రాష్ట్రంలోని దళితుల సమస్యలను ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలుగా విడదీసి గుర్తించాలి. వాటికి పరిష్కార మార్గాలను చూడాలి. గ్రామీణ, పట్టణ స్థాయిల్లో ప్రవేశపెట్టాల్సిన పథకాల వివరాలతో గైడ్‌లైన్స్ తయారు చేసి లబ్ధిదారులకు అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయదగిన డెయిరీ వంటి స్వయం ఉపాధి అవకాశాల విషయంలో గైడెన్స్ ఇచ్చే మెకానిజం ఏర్పాటు చేయాలన్నారు. ►లబ్ధిదారులకు అందిన ఆర్థిక సాయంతో ప్రారంభించిన పథకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. దీని కోసం మండల స్థాయిలో ఒక అధికారి ఉండాలి. ►ఆధునిక సాంకేతిక విధానాలను అవలంబించి ప్రతి లబ్ధిదారునికి ఓ కార్డును అందజేయాలి. బార్ కోడ్‌ను కేటాయించి వారి పూర్తి వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. ►ఎస్సీ కుటుంబాల ప్రొఫైల్ తయారు చేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను సీఎం ఆదేశించారు. ►సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీతో దళిత విద్యార్థుల కోసం హైక్వాలిటీ స్టడీ సర్కిళ్లను ఎన్నిచోట్ల పెట్టగలమో పరిశీలించాలి. ఈ సెంటర్ల ద్వారా సివిల్ సర్వీసెస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణనందించాలి. ►దళిత రైతుబంధు లబ్ధిదారుల వివరాలు సేకరించాలి. పెండింగులో ఉన్న దళిత ఉద్యో గుల ప్రమోషన్లను 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేయాలి. ►గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటున్న దళిత రైతులకు రైతుబంధుతో పాటు అర్హత కలిగిన వారికి సీఎం దళిత సాధికారత పథకం కూడా వర్తింపు. ►భూమి ఉన్న దళిత రైతులకే కాకుండా, భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకు కూడా బీమా సౌకర్యం. ►దళిత సాధికారత పథకం విషయంలో దళిత శాసన సభా సంఘం బాధ్యత తీసుకోవాలి. దళిత ప్రజాప్రతినిధులు నిరంతరం చర్చలు చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ►సామాజిక బాధల నుంచి దళితులకు విముక్తి కలిగించాలి. ►జూలై 1 నుంచి పదిరోజుల పాటు జరగనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రెండు రోజులు దళిత వాడల సందర్శన, వారి సమస్యల మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద వివరాల సేకరణ జరపాలి. జూలై 1 లోపు మొదటి ఎస్సీ శాసనసభా సంఘం సమావేశం జరిపి ఒక జిల్లాను ఎంచుకొని ప్రభుత్వం నుండి రైతుబంధు పొందుతున్న 7,79,902 (13,38,361 ఎకరాలకు గాను) మంది దళిత రైతుల గురించి విచారించి, వాళ్ళకు ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించాలి. ►దళిత సాధికరత అమలు కోసం రిటైర్డు దళిత ఉద్యోగులు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలి. ►ఇలావుండగా దళితుల మీద పోలీసుల దాడులు జరిగితే, బాధ్యులైన పోలీసులను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని అఖిల పక్షం చేసిన నిర్ణయానికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ►దళితులకు వందశాతం డబుల్ బెడ్ రూం ఇళ్లు కేలాయింపు అనే అంశం మీద ఒక వ్యూహం రూపొందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. -
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..!
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఆదివారం రోజున జరిగిన అఖిలపక్షభేటి ముగిసింది. సామాజికంగా, ఆర్ధికంగా దళితులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణలో సీఎం దళిత సాధికారత పథకం ద్వారా దళితులకు నిధులు కేటాయించనున్నారు. ఒక్కో యూనిట్‌కి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించనున్నారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున 10వేల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. సుమారు రూ.1200 కోట్లతో సీఎం దళిత సాధికారిత పథకం ప్రారంభంకానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో సమిష్ఠి నిర్ణయాన్ని తీసుకున్నారు. చదవండి: సీఎం దళిత్ ఎంపవర్మెంట్కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం: కేసీఆర్ -
సఫాయన్నా నీకు సలాం అన్న: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: 'సఫాయన్న నీకు సలాం అన్న .. అనే నినాదం నాది. సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎవరూ డిమాండ్ చేయకున్నా ప్రతీసారీ సఫాయి కార్మికుల జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం’ అంటూ ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం (పీఆర్సీ తరహాలో) అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. అఖిల పక్ష భేటీలో ఆయన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలన్నారు. ఈ సందర్భంగా లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పది పదిహేను రోజులు దళితుల భూముల గణన మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికదిగా సిద్ధం చేసుకోవాలన్నారు. 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు సమకూర్చి, దళిత సాధికారత కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమష్టి కార్యాచరణ అందరం కలిసి చేపట్టాలని అఖిల పక్ష నేతలతో కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రాజెక్టులు తదితర ప్రజావసరాల కోసం భూసేకరణలో భాగంగా సేకరించాల్సి వచ్చిన అసైన్డ్ భూములకు కూడా, పట్టాభూములకు చెల్లించిన ఖరీదునే ప్రభుత్వం చెల్లిస్తుందని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత్ ఎంపవర్మెంట్ పథకం కోసం ఈ బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించామని తెలిపారు. ఎటువంటి బ్యాంక్ గారెంటీ జంజాటం లేకుండానే ఈ పథకం ద్వారా దళితులకు సహకారం అందిస్తామన్నారు. అద్దాల అంగడి మాయా లోకపు పోటీ ప్రపంచంలో, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దళిత బిడ్డలు తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలన్నారు. అందుకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. చదవండి: సీఎం దళిత్ ఎంపవర్మెంట్కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం: కేసీఆర్ -
సీఎం కేసీఆర్‌కు దళిత సాధికారతపై చిత్తశుద్ధి ఉందా?
బౌద్ధనగర్ (హైదరాబాద్): దళిత ముఖ్యమంత్రిపై బహిరంగ హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ దళిత సాధికారతపై మాట్లాడటం పచ్చి మోసమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. దళిత సాధికారతపై ఆదివారం అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తుండటంతో ఆయన కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే సమావేశాలు జరపడం, తీర్మానాలు చేయడం కాకుండా వాటిని అమలు చేసే చిత్తశుద్ధి కేసీఆర్‌కు లేదన్నారు. దళిత ముఖ్యమంత్రిపై బహిరంగ హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడు సాధికారత గురించి మాట్లాడటం పచ్చిమోసం, నిలువెత్తు నయ వంచనకు ప్రతీక అని పేర్కొన్నారు. చదవండి : Covid-19: ప్రభుత్వ పనితీరు అభినందనీయం, గవర్నర్ ప్రశంసలు -
బీజేపీ నో... డైలమాలో కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత’ కార్యక్రమంపై ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. దళితుల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాల విధివిధానాల ఖరారుపై జరిపే ఈ ఉన్నత స్థాయి సమావేశానికి హాజరుకావాలని ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. అయితే, ఈ భేటీని బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించగా, కాంగ్రెస్ మాత్రం డైలమాలో ఉంది. వామపక్షాల నుంచి చాడ, తమ్మినేని హాజరవుతున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. ఈ భేటీకి హాజరవుదామా వద్దా అనే విషయంలో కాంగ్రెస్ పార్టీలో కొంత మీమాంస నెలకొంది. సమావేశానికి వెళ్లాలా, గైర్హాజరవ్వాలా అనే విషయంపై ఆదివారం ఉదయం నిర్ణయం తీసుకుంటామని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఏడేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారు: బీజేపీ దళితుల అభివృద్ధిపై చర్చకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. దళితులను మోసం చేసే కార్యక్రమంలో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భేటీని ఏర్పాటు చేసిందని ధ్వజమెత్తింది. దళితుల గురించి మాట్లాడే నైతికత, అర్హత టీఆర్ఎస్ సర్కార్‌కు లేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని ప్రకటించి కేసీఆర్ మోసం చేశారని, ఇలా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దళితులను టీఆర్ఎస్ మోసం చేస్తూనే ఉందన్నారు. గత ఏడేళ్లుగా మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు, దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. దళితులకు సంబంధించి గతంలో చేసిన వాగా>్దనాలు ఏ మేరకు పూర్తిచేశారన్న దానిపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. టీఆర్ఎస్ నుంచి దళితులు దూరమవుతున్నారని గ్రహించి.. మరియమ్మ ఘటన నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారే తప్ప దళితులపై ప్రేమతో కాదన్నారు. బహిష్కరణపై పార్టీ నేతలను సంప్రదించిన సంజయ్ అంతకుముందు రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, దళిత నాయకులతో అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో ఆర్భాటంగా ప్రకటించిన దళితులకు మూడెకరాల సాగుభూమి, దళితులపై కొనసాగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు విచారణ కమిషన్ వేయడం తదితర హామీల అమలు ద్వారా సీఎం కేసీఆర్ ముందుగా తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలనే అభిప్రాయం ఈ సందర్భంగా పార్టీనాయకుల్లో వ్యక్తమైంది. పాత వాగ్దానాలు అమలు చేశాక కొత్త వాటి గురించి మాట్లాడాలని, దళితులకు న్యాయం చేయకుండా అఖిలపక్ష భేటీకి బీజేపీ వెళితే తప్పుడు సంకేతాలు వెళతాయనే బండి సంజయ్ అభిప్రాయంతో ఇతర నాయకులు ఏకీభవించారు. వామపక్షాల నుంచి.. అఖిలపక్ష సమావేశానికి సీపీఐ నుంచి ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు బాలనర్సింహ, సీపీఎం నుంచి ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు బి.వెంకట్, జాన్‌వెస్లీ హాజరుకానున్నారు. నేడు ఉదయం 11:30 గంటలకు భేటీ ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత’ కార్యక్రమంపై ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వీరితో పాటు వివిధ పార్టీల శాసనసభాపక్ష నేతలు, మాజీ సభ్యులు కడియం శ్రీహరి, మందా జగన్నాథం, మోత్కుపల్లి నర్సింహులు, ఆరెపల్లి మోహన్, జి.ప్రసాద్‌కుమార్ హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి సభ్యులందరికీ వ్యక్తిగత ఆహ్వానాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. -
CM Dalit Empowerment Scheme: ఏటా రూ.1000కోట్లు
శరీరంలోని ఒక భాగం పాడైతే మొత్తం శరీరానికి ఎంత బాధ ఉంటుందో, సమాజంలో ఒక భాగం వివక్షకు గురైతే యావత్ సమాజానికీ అంతే బాధగా ఉంటుంది. మనలోనే భాగమై జీవిస్తున్న మనుషులను దళితుల పేరుతో బాధ పెట్టే వ్యవహారం మంచిది కాదు. – కేసీఆర్ ►దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న 8 లక్షల దళిత కుటుంబాలను దశల వారీగా అభివృద్ధిపరచడమే లక్ష్యంగా ఈ పథకం కింద వివిధ కార్యక్రమాలు చేపడతాం. ►సమృద్ధిగా పంటలు పండుతూ తెలంగాణ ధాన్యాగారంగా మారింది. పండిన ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసుకోవడంపై దృష్టిసారించాలి. 250 ఎకరాలకు తక్కువ కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లను ఏర్పాటు చేయాలి. ►పట్టణాల్లో లక్ష జనాభాకు ఒకటి చొప్పున వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేయాలి. 2, 3 ఎకరాలకు తక్కువ కాకుండా స్థలాన్ని ఎంపిక చేసుకుని పార్కింగ్ తదితర సౌకర్యాలను కల్పించాలి. పట్టణ ప్రగతిలో భాగంగా ‘మ్యాప్ యువర్ టౌన్’ ప్రకారం పట్టణ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈ 10 రోజుల్లో పట్టణాల్లో లోపాలను సరిచేసుకోవాలి. ►వ్యవసాయ శాఖ, పోలీసు అధికారుల సమన్వయంతో కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలను వినియోగించి కల్తీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న దళితుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీం (ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకం)’కు ఏటా రూ.1,000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద ఏటా కొంతమంది లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రైతుబంధు, వృద్ధాప్య పింఛన్ల పంపిణీ తరహాలో పారదర్శకంగా ఈ ప్రక్రియ జరగనుందని స్పష్టంచేశారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఎస్సీ సబ్ ప్లాన్‌తో సంబంధం లేకుండా ఈ పథకానికి ప్రత్యేకంగానే నిధులు ఖర్చు చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. దళితుల్లో వెనుకబాటుతనాన్ని, బాధలను తొలగించే క్రమంలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర కీలకం కాబోతున్నదని, పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. జూలై 1 నుంచి 10 రోజుల పాటు మలి దశ పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థ)లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న దళితుల అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించిన నాడే దళిత సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు. దళితుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని, ఆదివారం నిర్వహించనున్న (అఖిలపక్ష) సమావేశంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. శనివారం ప్రగతిభవన్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ‘ప్రగతి’ కార్యక్రమాల్లో చురుగ్గా.. పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, ప్రజలను చైతన్యపరిచి నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ చేరుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల కింద నిర్దేశించిన ఏ పనికూడా వీటి ముగింపు తర్వాత అపరిష్కృతంగా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నా, పనులు 100శాతం ఎందుకు పూర్తి కావడం లేదన్న అంశంపై పునఃసమీక్షించుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల పేరు మీద రిజిస్ట్రేషన్.. లేఅవుట్లలో ప్రజా అవసరాలకు కేటాయించిన భూమిని విధిగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్లమీద రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించడానికి సమగ్ర నివేదిక తయారు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులను నిర్దిష్టంగా గుర్తించాలని అటవీ శాఖ అధికారులను నిర్దేశించారు. పట్టణాలకు క్లీనింగ్ ప్రొఫైల్... పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాలవారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో అన్నిశాఖలకు చెందిన రిటైర్డు ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేసుకొని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. జూలై చివరికల్లా శాఖల నడుమ ఉన్న పరస్పర బకాయిలను ‘బుక్ అడ్జస్ట్ మెంట్’ ద్వారా పరిష్కరించాలని, ఇక నుంచి అన్ని శాఖల నడుమ విధిగా చెల్లించాల్సిన బిల్లులను వెంట వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇళ్లపై నుంచి విద్యుత్ లైన్లను తొలగించాలి గ్రామాల్లో ఇళ్లపై నుంచి హైటెన్షన్ విద్యుత్ లైన్లను తొలగించాలని సీఎం ఆదేశించారు. గ్రామాల్లో వి ద్యుత్ సమస్యలను అధిగమించడానికి పవర్ డేను పాటించాలన్నారు. ప్రజలను చైతన్యపరిచి కరెంటు సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. 250 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు ‘ప్రభుత్వ అండతో తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా పరిణామం చెందింది. రాష్ట్రానికి అదనపు రైస్ మిల్లులు తక్షణ అవసరం. రైస్ మిల్లుల సంఖ్యను పెంచాలి. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. 250 ఎకరాలకు తక్కువ కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లను ఏర్పాటు చేసి, వాటి చుట్టూ బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలి. ఆ పరిధిలో లే అవుట్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆ స్థలాలను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలి నూతనంగా నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాలకు తరలుతున్న జిల్లాల్లోని ప్ర భుత్వ కార్యాలయాల స్థలాలు, ఆస్తులను జిల్లా కలెక్టర్లు స్వాధీనం చేసుకుని వాటిని ప్రజా అవసరాలకు వినియోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు వివిధ జిల్లాల్లో పర్యటనలు చేపట్టిన సందర్భాల్లో సమీక్షల కోసం ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘రాష్ట్ర చాంబర్’ను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జంట హెలిప్యాడ్లను నిర్మించాలని చెప్పారు. జిల్లాకో ఎస్టేట్ ఆఫీసర్.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భూములు, స్థలాలు, ఇతర ఆస్తుల వివరాలను జూలై చివరిలోగా సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ భూములు, ఆస్తుల వివరాలు రికార్డు చేయడానికి, సంరక్షణ, పర్యవేక్షణ కోసం జిల్లాకో ఎస్టేట్ ఆఫీసర్‌ను నియమించాలని, వీరు సం బంధిత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పని చేయా ల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రస్థాయి ఎస్టేట్ ఆఫీసర్‌ను నియమించి సీఎస్ పర్యవేక్షణలో విధులు నిర్వహించేలా చూడాలని కోరారు. -
దళిత సాధికారత ఎంత దూరం?
బైలైన్ గాంధీకి గానీ, కాంగ్రెస్ నేతలకు గానీ మొట్టమొదటి రాష్ట్రపతిగా అంబేడ్కర్ అనే ఆలోచన రాకపోవడం ఆసక్తికరం. వైస్రాయి రాజప్రాసాదంలో ఒక దళితుడు ఉండటానికి మించి కుల వ్యవస్థ మానసిక పునాదులను శిథిలం చేసే చర్య మరేదీ ఉండదు. మహాత్మా గాంధీ 1947 మేలో తీవ్ర వ్యక్తిగత విషాదానికి గురయ్యారు. 1935లో సేవాగ్రామ్ ఆశ్రమాన్ని స్థాపించినప్పటి నుంచి అక్కడ సేవలందించిన ఆయన యువ దళిత శిష్యుడు చక్రయ్య, మెదడులోని కణతి కారణంగా మరణించారు. గాంధీ ఆయనను కుటుంబ సభ్యునిగానే భావించేవారు. అందువలన మహాత్ముని దుఃఖం బహిరంగంగానే వ్యక్తమౌతుండేది. జూన్ 2న గాంధీజీ తన ప్రార్థనా సమావేశాన్ని ఒక విప్లవాత్మక సూచనతో ప్రారంభించారు. మొదటగా ఆయన, భారతదేశపు మకుటంలేని మహారాజుగా జవహర్లాల్ నెహ్రూ పేరును ప్రకటిం చారు. బారిస్టర్ కావ డానికి ముందు నెహ్రూ హారో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నందున ఇంగ్లిష్ వారితో బేరసారాలకు ఆయన అవసరమన్న గాంధీ వాదన ఏమంత పస ఉన్నదేమీ కాదు. అయినా స్వతంత్ర భారత ప్రథమ ప్రధానిగా నెహ్రూ పాత్ర గురించి ఆలోచించాల్సిన పనే లేదనే విషయాన్ని ఆయన ఆ ప్రకటన ద్వారా చెప్పదలుచుకున్నారు. అయితే రెండో పదవి ఇంకా ఖాళీగానే ఉంది. సాంకేతికంగా అది నూతన రాజకీయ వ్యవస్థలో ప్రధాన మంత్రి కంటే కూడా ఉన్నత స్థాయిది. ఆ పదవికి సంబంధించి గాంధీజీ ఇలా అన్నారు: భారత రిపబ్లిక్ ప్రథమ రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సిన సమయం వేగంగా సమీపిస్తోంది. చక్రయ్య బతికి ఉండివుంటే నేనాయన పేరును సూచించి ఉండేవాడిని. ధైర్యవంతురాలు, నిస్వార్థపరురాలు, పరిశుద్ధ హృదయి అయిన (గాంధీ ప్రయోగించిన ఈ పదానికి నేడు కాలదోషం పట్టిపోయి, అక్కడక్కడా దాన్ని మార్చేస్తున్నారు కూడా) దళిత యువతి మన దేశ ప్రథమ రాష్ట్రపతి కావాలని ఆశిస్తున్నాను. ఇదేమీ నిష్ఫల స్వప్నం కాదు...మన భావి రాష్ట్రపతికి ఇంగ్లిష్ రావాల్సిన అవసరమేమీ లేదు. రాజకీయ వ్యవహారాల్లో నిష్ణాతులై, విదేశీ భాషలను కూడా తెలిసిన వారు సహాయకులుగా తోడ్పడతారు. అయితే, ఈ కలలు నిజం కావాలంటే మనం ఒకరిని ఒకరం చంపుకోవడంపై కంటే గ్రామాలపై పూర్తి శ్రద్ధను చూపగలగాలి (కలెక్టెడ్ వర్క్స్, వాల్యూం 95). ఈ ఆలోచన గురించి గాంధీ జూన్ 6న రాజేంద్రప్రసాద్‌తో జరిపిన సంభాషణలో కూడా చర్చను కొనసాగించారు. అయితే ఆయనే ప్రథమ రాష్ట్రపతి అయ్యారనుకోండి. గాంధీ తన ప్రతిపాదనను ఇలా రూపొందించారు: నాయకులంతా మంత్రివర్గంలో చేరి పోతే ప్రజలతో విస్తృత సంబంధాలను కొనసాగించడం చాలా కష్టమౌతుంది.... అందువల్లనే నేను నా ప్రార్థనా సమావేశ ప్రసంగంలో చక్రయ్యలాంటి దళితుడిని లేదా దళిత యువతిని దేశ ప్రథమ రాష్ట్రపతిగాను, జవహర్‌లాల్‌ను ప్రధానిగాను సూచించాను... చక్రయ్య చనిపోయారు కాబట్టి ఒక దళిత మహిళకు ఆ గౌరవం దక్కాలి. కాంగ్రెస్ నేతలకు గాంధీజీ సూచన రుచించలేదు. ఆ చక్రయ్య పేరును కాంగ్రెస్ నేతలలో ఏ ఒక్కరూ తమ గాంధీ స్మృతులలో ఎక్కడా ప్రస్తావించకపోవడం (కనీసం నాకు తెలిసినంతలో) ఆసక్తికరం. బహుశా వారు గాంధీజీ ఆలోచనను ఉన్నత పదవీ బాధ్యతల అవసరాలకు నానాటికీ దూరం అవుతున్న సాధుపుంగవుని విప్లవతత్వంగా కొట్టిపారేసి ఉండవచ్చు. గాంధీ, అలాంటి దళిత సాధికారత గురించి ప్రచారం సాగిస్తూనే వచ్చారు. మనకు దళితుల పాలన కావాలి. దళితుల సేవలు అత్యున్నతమైనవి కాబట్టి వారే అందరిలోకీ అత్యున్నతులు వంటి వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. గాంధీగానీ, లేదా కాంగ్రెస్ నేతలలో ఎవరైనాగానీ అంబేడ్కర్ మొట్టమొదటి రాష్ట్రపతి కావడమనే ఆలోచనను ఎన్నడూ పరిగణనలోకి తీసుకోకపోవడం ఆసక్తికరం. అంబేడ్కర్‌కు అందుకు కావాల్సిన అర్హతలే కాదు, ప్రతిష్ట కూడా ఉంది. స్వాతంత్య్రోద్యమంలో స్వతంత్ర పాత్రను నిర్వహించాలని బాబాసాహెబ్ తీసుకున్న నిర్ణయం నాటి కాంగ్రెస్ నేతలకు కోపం కలిగించి ఉండవచ్చు. బాబాసాహెబ్ వారిలో ఒకరు కారు. ఆయనను ఒక స్థాయికి మించి విశ్వసించడానికి నిరాకరించారు. గాంధీ, అంబేడ్కర్లు ఇద్దరికీ దళిత సాధికారతే అత్యున్నత ప్రాధాన్యాంశం. కాకపోతే గాంధీ స్వాతంత్య్రా నికి ప్రథమ స్థానం ఇస్తే, అంబేడ్కర్ దళిత విముక్తికి ప్రథమ స్థానం ఇవ్వడమే వారి మధ్య ఉన్న విభేదం. 1940ల నాటికి, స్వాతంత్య్రం కనుచూపు మేరలోకి వచ్చేసరికి ఆ విభేదం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. హిందువులకు, ముస్లింలకు కూడా ఆమోదయోగ్యమైన రాజకీయ వ్యవస్థను రూపొందించే ప్రతిపాదనలను జాగ్రత్తగా రూపొందిం చడంపై అంబేడ్కర్ తన మేధోపరమైన శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరించారు. దేశవిభజనకు అర్థం ఏమిటనే విషయం గురించి కూడా ఆయన లోతుగా ఆలోచించారు. 1940 డిసెంబర్ నాటికే ‘పాకిస్తాన్’ అనే పదం శీర్షికలో భాగంగా ఉన్న మొట్టమొదటి పుస్తకాన్ని ప్రచురించారు. థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే ఆయన పుస్తకం ఆశ్చర్యకరమైన రీతిలో భవిష్యత్ పరిణామాలను ముందుగానే తెలిపింది. వాయవ్య సరిహద్దు, అఫ్ఘానిస్తాన్‌ల నుంచి భౌగోళిక- రాజకీయ అజెండా గల ఇస్లామిక్ జీహాద్ ముప్పు పెంపొందడం గురించి అంబేడ్కర్ తప్ప మరెవరూ నాడు ఊహించలేకపోయారు. అదే నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన ముప్పు కావడం విశేషం. సురక్షితమైన సరిహద్దు కంటే సురక్షితమైన సైన్యం మెరుగనే అంబేడ్కర్ సిద్ధాంతం చెప్పుకోదగినది. ఒక్కసారి పాకిస్తాన్ నిజమయ్యాక, ఆయన దృష్టి అంతర్గత సవాళ్లపైకి మళ్లింది. హేయమైన కుల వ్యవస్థ అనే శాపాన్ని చ ట్టరీత్యా నిషేధించగలంగానీ, నిజజీవితం నుంచి నిర్మూలించడం అందుకు భిన్నమైనది. ఉల్లంఘనలకు పరిష్కారాలు లేనిదే హక్కులూ ఉండవు అనే సుప్రసిద్ధ సూత్రీకరణను అంబేడ్కర్ చేశారు. అదే మన రాజ్యాంగానికి క్రియాశీల సూత్రమైంది. రాజ్యాంగాన్ని చూడగలిగేటంత కాలం గాంధీ జీవించలేదు. కానీ ఆయన రాజకీయ సంకేతాత్మకవాదపు శక్తిని గుర్తించగలిగారు. రాజప్రతినిధుల రాజప్రాసాదంలో ఒక దళితుడు ఉండటానికి మించి కులాల అంతస్తుల వ్యవస్థ మానసిక పునాదులను శిథిలం చేసే చర్య మరేదీ ఉండదు. గాంధీ కలను నిజం చేయడానికి మనకు దశాబ్దాలు పట్టింది. ఏమాటకామాటే చెప్పాలి, 1947 నుంచి మనం చాలా దూరమే వచ్చేశాం. అయినా సుప్రసిద్ధ కవి అన్నట్టు, ఇంకా మైళ్ల దూరం వెళ్లాల్సే ఉంది. నాయ కులు కూడా మనుషులే. వారంతా ఏదో ఒక రోజు సుదీర్ఘ నిద్రలోకి పోవాల్సినవారే. కానీ దేశం మాత్రం ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుంది. దళిత విముక్తి, ఆర్థిక సాధికారతలను పూర్తిగా సాధించిన నాడే భారతదేశం ఉన్నతిని సాధించగలుగుతుంది. వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు పార్లమెంట్ సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
'దళితులను మాయావతి ఎదగనీయడం లేదు'
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో దళితులను ఎదగనీయకుండా బహుజన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షురాలు మాయావతి అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దళితులను నాయకులుగా తయారుచేసేందుకు తమ పార్టీ పాటు పడుతోందని అన్నారు. అన్ని రంగాల్లో దళిత నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తోందన్నారు. దేశంలో దళిత అభ్యున్నతి దశలవారీగా జరుగుతోందని వివరించారు. మొదటి దశలో కాంగ్రెస్ పార్టీతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారని, రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. మలిదశలో రిజర్వేషన్ల ఆధారంగా దళితుల అభ్యున్నతికి బీఎస్సీ వ్యవస్థాపకుడు కాన్షీరాం పాటుపడ్డారని చెప్పారు. ప్రస్తుతం మూడో దశ నడుస్తోందన్నారు. ఇలాంటి దశలో మాయావతి లాంటి ఒక్క నాయకురాలే సరిపోరని అన్నారు. దళిత అభ్యున్నతిని ముందుకు తీసుకెళ్లాలంటే లక్షలాది మంది నాయకులు కావాలన్నారు. దళిత నాయకోద్యమాన్ని మాయావతి హస్తగతం చేసుకున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆమె ఎవరినీ ఎదగనీయడం లేదన్నారు.