Dalit Empowerment Scheme Telangana: CM KCR Held All Party Meeting On Dalit Empowerment Scheme - Sakshi
Sakshi News home page

వారికి ఒక్కో కుటుంబానికి 10 లక్షలు.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి

Published Mon, Jun 28 2021 1:39 AM | Last Updated on Mon, Jun 28 2021 11:09 AM

CM KCR Held All party Meeting On Dalit Empowerment Scheme - Sakshi

దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం మిషన్‌ మోడ్‌లో పనిచేయాలని నిశ్చయించుకుంది. మీరందరూ కలిసిరావాలి. నాకు భగవంతుడిచ్చిన సర్వ శక్తుల్నీ ఉపయోగించి ఈ పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలన్నదే నా దృఢ సంకల్పం. 

పైరవీలకు ఆస్కారం లేని, పారదర్శక విధానం అమలు చేద్దాం. నిధుల బాధ్యత నాది. రాజకీయాలకు అతీతంగా సమష్టి కార్యాచరణ మనందరి బాధ్యత. 

దళిత సాధికారత విషయంలో సీఎంవోలో ప్రత్యేక అధికారిని నియమిస్తాం. ఎస్సీ రైతుల వద్ద ఉన్న 13,58,000 ఎకరాల్లో అసైన్డ్‌ భూములు ఎన్ని? ఇందులో ఉన్నదెంత ? పోయిందెంత? లెక్కలు తీయాలి. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ప్రైవేటు రంగంలో దళితులకు రిజర్వేషన్ల అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. 

సాక్షి, హైదరాబాద్‌: ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకం కింద ఎంపిక చేసే అర్హులైన ఒక్కో దళిత కుటుంబం (ఒక యూనిట్‌) బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని జమ చేయాలి. మొదటి దశలో ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాలు చొప్పున రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల పరిధిలో ఎంపిక చేసిన 11,900 కడుపేద దళిత కుటుంబాలకు రైతుబంధు తరహాలో నేరుగా ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయాలి. రూ.1,200 కోట్లతో సీఎం దళిత సాధికారత పథకం అమలుకు శ్రీకారం చుట్టాలి..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష భేటీ సమిష్టి నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. తమ అభివృద్ధిని తామే నిర్వచించుకుని, తమ స్కీమ్‌ను తామే నిర్ణయించుకునే స్వేచ్ఛను ఈ పథకం కింద ఎంపికైన కుటుంబాలకు కల్పించాలని సమావేశం నిర్ణయించింది. ఆర్థిక సాధికారత, స్వావలంబన కోసం దళితుల స్వీయ నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు దాదాపు 10 గంటలపాటు జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అఖిలపక్ష నేతలతో పాటు దళిత ప్రజాప్రతినిధులు, మేధావులు, అధికారులు చర్చలో పాల్గొన్నారు.  

దళితుల అభ్యున్నతి కోసం.. 
‘దళితుల అభ్యున్నతి కోసం సీఎం దళిత సాధికారత పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. ఈ బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.1,200 కోట్లు కేటాయించాం. వచ్చే మూడు నాలుగేళ్లలో రూ.35–40 వేల కోట్లను ఖర్చు చేయాలని యోచిస్తున్నాం. ఎస్సీ సబ్‌ప్లాన్‌ కేటాయింపులకు ఈ నిధులు అదనం. బ్యాంక్‌ గ్యారెంటీ జంజాటం లేకుండానే ఈ పథకం ద్వారా దళితులకు సహకారం అందిస్తాం.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సమావేశంలో కీలక ప్రకటన చేశారు. దళితుల్లో అర్హులైన పేద కుటుంబాల గణన జరపాలని అధికారులను ఆదేశించారు. రైతు బంధు, ఆసరా పెన్షన్ల తరహాలో అత్యంత పారదర్శకంగా, మధ్య దళారులకు ఆస్కారం లేకుండా నేరుగా అర్హులైన దళితులకు ఆర్థిక సహాయం అందించేందుకు సలహాలు అందించాలని అఖిలపక్ష నేతలను కోరారు.   

దళితుల పట్ల వివక్ష దేశానికే కళంకం 
‘దళితులు సామాజిక, ఆర్థిక వివక్షకు గురవడం భారత సమాజానికే కళంకం. ఇది మనసున్న ప్రతి ఒక్కరినీ కలచి వేసే విషయం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నది. విద్య, వ్యవసాయం సహా పలు రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధిస్తున్నది. అయినా ఇంకా దారిద్య్రరేఖకు దిగువన, బాటమ్‌ లైన్లో విస్మరించబడిన దళిత కుటుంబాలను గుర్తించి వారిని అభివృద్ధి పథాన నడిపించడమే ప్రధాన ధ్యేయంగా రూ.1200 కోట్లతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. అట్టడుగున ఉన్న వారితో సహాయాన్ని ప్రారంభించి, వారి అభ్యున్నతిని సాంకేతికతతో నిరంతరం పర్యవేక్షిస్తాం. వ్యవసాయం, సాగునీటి రంగాలను పట్టుబట్టి గాడిలో పెట్టినట్టు, దళితుల సాధికారతకు కూడా అంతే పట్టుదలతో పని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది..’ అని సీఎం తెలిపారు. 

ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలి 
‘సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ విధానాన్ని అనుసరిస్తూ దళితుల అభివృద్ధికి ఎస్సీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. చిత్తశుద్ధి గల అధికారులను నియమించుకోవాలి. దళిత యువత ఆలోచనా దృక్పథంలో గుణాత్మక మార్పు తీసుకురావాలి. ఆత్మనూన్యత నుంచి బయటపడి ఆత్మస్థైర్యంతో ఉన్నత స్థాయి ఓరియంటేషన్‌ అలవర్చుకునే దిశగా చర్యలు చేపట్టాలి. దళిత సమాజాన్ని సాధికారత దిశగా అవకాశాలను అందుకునే పద్ధతిలో చైతన్యం చేయాలి. గోరేటి వెంకన్న వంటి కవులను, ఇతర కళాకారుల సేవలను వినియోగించుకోవాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు.

దళిత యువతకు కోటాపై పరిశీలన 
‘వ్యాపారం, స్వయం ఉపాధి రంగాల్లో ప్రభుత్వం మంజూరు చేసే లైసెన్స్‌లు, పెట్టుబడి సహాయం విషయాల్లో అర్హులైన దళిత యువతకు రిజర్వేషన్లు అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తాం. దళిత విద్యార్థుల విదేశీ విద్య స్కాలర్‌షిప్పులకు సంబంధించిన గరిష్ట వార్షిక ఆదాయ పరిమితిని సడలించేందుకు పరిశీలన జరుపుతాం.’ అని హామీ ఇచ్చారు.  

దళితుల అధీనంలోని భూముల గణన 
‘రాష్ట్రంలో 7,79,902 మంది ఎస్సీ రైతుల వద్ద 13,58,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. స్థిరత్వం సాధించిన ఎస్సీ కుటుంబాలకు ఇతరత్రా చేయూతనిస్తూనే, స్థిరత్వం సాధించని, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలను మొట్ట మొదటగా ఆదుకునే కార్యాచరణ చేపట్టాలి. ఎస్సీల భూముల్లో నీళ్ళు లేని, నీళ్ళు ఉండి ఇతర వసతులు లేని భూములు కలిగి ఉన్న కుటుంబాలను గుర్తించాలి. తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలి. లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర అవగాహనకు రావాలి. రాష్ట్రమంతా అవసరమైతే పది పదిహేను రోజులు భూముల లెక్కల మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను వేర్వేరుగా సిద్ధం చేసుకోవాలి..’ అని సీఎం అధికారులను ఆదేశించారు. 

సఫాయి కార్మికులకు పీఆర్సీ తరహాలో..
‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదం నాది. సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎవరూ డిమాండ్‌ చేయకున్నా ప్రతిసారీ సఫాయి కార్మికుల జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం (పీఆర్సీ తరహాలో) అమలుకు చర్యలు తీసుకుంటాం..’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.  

దళిత బిడ్డలు నైపుణ్యం పెంచుకోవాలి 
‘సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది.. చంటి పిల్లను పెంచి పోషించే పాత్ర. నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతయి. అందుకు పాలకులే బాధ్యులు అవుతారు. ‘మేము కూడా పురోగమించ గలం’ అనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో సూచనలు చేయండి. పైరవీలకు ఆస్కారం లేని, పారదర్శక విధానాన్ని అమలు పరుద్దాం. భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగింది. మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలి. అద్దాల అంగడి మాయా లోకపు పోటీ ప్రపంచంలో, ఉపాధి అవకాశాలను అంది పుచ్చుకోవడానికి దళిత బిడ్డలు తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలి. అందుకు ప్రభుత్వం సహకారం అందిస్తది. గోరేటి వెంకన్న రాసిన ‘గల్లీ చిన్నది’ పాటను మనసు పెట్టి వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడివిడిగా గుర్తించి పరిష్కారాలు వెతకాలి. దళితుల సామాజిక, ఆర్థిక సమస్యలను గుర్తించి సమిష్టి కృషితో సమాధానాలు సాధించాలి’ అని ముఖ్యమంత్రి కోరారు. ఇప్పుడు అమలులో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే సీఎం దళిత సాధికారత పథకాన్ని కూడా వర్తింప జేయనున్నట్టు తెలిపారు. 

ప్రతి లబ్ధిదారునికీ కార్డు 
ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. 
రాష్ట్రంలోని దళితుల సమస్యలను ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలుగా విడదీసి గుర్తించాలి. వాటికి పరిష్కార మార్గాలను చూడాలి. గ్రామీణ, పట్టణ స్థాయిల్లో ప్రవేశపెట్టాల్సిన పథకాల వివరాలతో గైడ్‌లైన్స్‌ తయారు చేసి లబ్ధిదారులకు అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయదగిన డెయిరీ వంటి స్వయం ఉపాధి అవకాశాల విషయంలో గైడెన్స్‌ ఇచ్చే మెకానిజం ఏర్పాటు చేయాలన్నారు.  
లబ్ధిదారులకు అందిన ఆర్థిక సాయంతో ప్రారంభించిన పథకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. దీని కోసం మండల స్థాయిలో ఒక అధికారి ఉండాలి.  
ఆధునిక సాంకేతిక విధానాలను అవలంబించి ప్రతి లబ్ధిదారునికి ఓ కార్డును అందజేయాలి. బార్‌ కోడ్‌ను కేటాయించి వారి పూర్తి వివరాలు కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి.  
ఎస్సీ కుటుంబాల ప్రొఫైల్‌ తయారు చేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను సీఎం ఆదేశించారు.  
సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీతో దళిత విద్యార్థుల కోసం హైక్వాలిటీ స్టడీ సర్కిళ్లను ఎన్నిచోట్ల పెట్టగలమో పరిశీలించాలి. ఈ సెంటర్ల ద్వారా సివిల్‌ సర్వీసెస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణనందించాలి.  
దళిత రైతుబంధు లబ్ధిదారుల వివరాలు సేకరించాలి. పెండింగులో ఉన్న దళిత ఉద్యో గుల ప్రమోషన్లను 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేయాలి. 
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటున్న దళిత రైతులకు రైతుబంధుతో పాటు అర్హత కలిగిన వారికి సీఎం దళిత సాధికారత పథకం కూడా వర్తింపు. 
భూమి ఉన్న దళిత రైతులకే కాకుండా, భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకు కూడా బీమా సౌకర్యం.  
దళిత సాధికారత పథకం విషయంలో దళిత శాసన సభా సంఘం బాధ్యత తీసుకోవాలి. దళిత ప్రజాప్రతినిధులు నిరంతరం చర్చలు చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకోవాలి. 
సామాజిక బాధల నుంచి దళితులకు విముక్తి కలిగించాలి. 
జూలై 1 నుంచి పదిరోజుల పాటు జరగనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రెండు రోజులు దళిత వాడల సందర్శన, వారి సమస్యల మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద వివరాల సేకరణ జరపాలి.  జూలై 1 లోపు మొదటి ఎస్సీ శాసనసభా సంఘం సమావేశం జరిపి ఒక జిల్లాను ఎంచుకొని ప్రభుత్వం నుండి రైతుబంధు పొందుతున్న 7,79,902 (13,38,361 ఎకరాలకు గాను) మంది దళిత రైతుల గురించి విచారించి, వాళ్ళకు ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించాలి. 
దళిత సాధికరత అమలు కోసం రిటైర్డు దళిత ఉద్యోగులు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలి. 
ఇలావుండగా దళితుల మీద పోలీసుల దాడులు జరిగితే, బాధ్యులైన పోలీసులను ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేయాలని అఖిల పక్షం చేసిన నిర్ణయానికి సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు.  
దళితులకు వందశాతం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేలాయింపు అనే అంశం మీద ఒక వ్యూహం రూపొందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement