Prashant Kishor Team Report On Changes In TRS And Telangana Govt - Sakshi
Sakshi News home page

Prashant Kishor Team Report: ముళ్లు ‘పీకే’స్తే గుబాళింపే!

Published Sat, Mar 26 2022 2:19 AM | Last Updated on Sat, Mar 26 2022 2:37 PM

Prashant Kishor Team Report On Changes In TRS And Telangana Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదని ఇటీవలే గట్టిగా చెప్పిన ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. మరోవైపు పార్టీలో, ప్రభుత్వంలో కీలక మార్పుచేర్పులు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తేవడంతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు.

ఇందుకోసం వివిధ అంశాలపై తనకున్న సమాచారం, అంచనాలతోపాటు.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) బృందం చేసిన సర్వే నివేదికలపై దృష్టిపెట్టినట్టు తెలిసింది. సర్వేల ద్వారా ప్రజలనాడి పట్టుకునే కళ ఉన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) తనతో కలిసి పనిచేస్తున్నాడని కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పార్టీ పనితీరుపై వివిధ రూపాల్లో, వేర్వేరు ప్రశ్నావళితో పీకే బృందం సర్వేలు చేసింది.

ఆ వివరాలను క్రోడీకరించి.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఏం చేయాలి? ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? ఏ తరహా కార్యాచరణ అవసరమన్న దానిపై సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేసింది. విశ్వసనీయ వర్గాల వివరాల ప్రకారం.. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల నుంచి పొందిన విశ్వాసాన్ని మరింత పెంచుకోవడం లక్ష్యంగా పీకే తన నివేదికలో సూచనలు చేసినట్టు తెలిసింది. 

ప్రతికూలత పోగొట్టుకోవాలి.. 
నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్‌తోనే తెలంగాణ ఉద్యమం సాగిందని.. కానీ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీలో జరిగిన తాత్సారం ప్రభుత్వంపై కొంత ప్రతికూల ప్రభావం చూపిందని పీకే నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాలని నివేదిక సూచించింది. జిల్లాలు, జోన్ల విభజనతో కొందరు ఉద్యోగుల్లో ఏర్పడిన అసంతృప్తిని తొలగించేందుకు ప్రమోషన్లు, ఇతర సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.

అయితే.. ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యవహార శైలితో ఉద్యోగుల సమస్యలు సకాలంలో పరిష్కారం కావడం లేదని.. కొన్ని కీలక విభాగాల్లో ఏళ్ల తరబడి తిష్టవేసిన అధికారుల పనితీరు పాలనపై ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నట్టు తెలిసింది. ఐఏఎస్‌ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో కొనసాగాల్సిన విభాగాల్లో కిందిస్థాయి అధికారులు ఏళ్ల తరబడి ఇన్‌చార్జులుగా కొనసాగుతుండటంతో.. క్రియాశీలకంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని పేర్కొన్నట్టు సమాచారం. 

వీటిపై బాగా దృష్టిపెట్టాలి.. 
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నవారు, ఉద్యమంలో భాగస్వాములైన వివిధ రంగాలకు చెందిన కొందరిలో అసంతృప్తి ఉందని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చినా తమకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదనే ఆవేదన నెలకొందని పీకే నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఉద్యమ సమయంలో, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వివిధ స్థాయిల్లో వేర్వేరు పార్టీల నుంచి చేరిన కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయ లోపం ప్రతిబంధకంగా మారిందనీ వివరించినట్టు సమాచారం.

ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు జరగడం చాలా చోట్ల సానుకూల ఫలితాలు ఇచ్చినా కొన్నిచోట్ల చేటు చేస్తున్న విషయాన్ని ఉదాహరణలతో ప్రస్తావించినట్టు తెలిసింది. వివాదాల్లో తలదూర్చడం, అధికారుల విధుల్లో మితిమీరిన జోక్యం, పార్టీ యంత్రాంగంపై ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల కుటుంబ సభ్యుల పెత్తనం వంటి అంశాలకు చెక్‌ పెట్టడానికి సంబంధించి పీకే నిర్దిష్ట సూచనలు చేసినట్టు సమాచారం. కొందరు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో లోతుగా దృష్టి సారించడం లేదని, అంతర్గత సమీక్షల్లో సంబంధిత అంశాలపై వారికి అవగాహన లేకపోవడాన్ని అధికారులు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని ప్రస్తావించినట్టు తెలిసింది.

సరిదిద్దండి లేదా సాగనంపండి! 
ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా జనంతో మమేకమైన కొందరు కీలక నేతలు.. అధికారంలోకి వచ్చాక వివిధ కారణాలతో అందుబాటులో లేకపోవడంతో నష్టం జరుగుతోందని పీకే నివేదిక పేర్కొంది. అలాంటి వారు క్షేత్రస్థాయికి వెళ్లేలా కార్యక్రమాలు ఇవ్వాలని కొందరు నేతల పేర్లతో జాబితా అందజేసినట్టు తెలిసింది. ఇక అటు పార్టీ యంత్రాంగంతో సఖ్యత లేని, ఇటు సరైన పనితీరు చూపని ఎమ్మెల్యేలను సరిదిద్దడమో లేదా సాగనంపడమో చేయాలని పేర్కొన్నట్టు సమాచారం. 

నిరంతరం జనంలో ఉండేలా.. 
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సంబంధిత వర్గాలకు చెందినవారు సంతృప్తిగా ఉన్నారని.. ఈ క్రమంలో వివిధ పథకాల విజయగాథల (సక్సెస్‌ స్టోరీస్‌)ను జనంలోకి బలంగా తీసుకెళ్లాలని పీకే నివేదిక సూచించింది. సోషల్‌ మీడియా వేదికగా సాగుతున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా పలు సూచనలు చేసింది. కొత్త ఓటర్లు, యువతను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా వేదికగా బీజేపీ శ్రేణులు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకునేందుకు యువత, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది.

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టాలని పేర్కొంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చేసిన సర్వేల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సానుకూలత వ్యక్తమైనా.. మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా కార్యక్రమాలు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ కార్యాచరణ ఏ రీతిలో ఉండాలనే దానిపై పలు ప్రతిపాదనలు చేసింది. పీకే నివేదికలో పేర్కొన్న అంశాలకు సీఎం కేసీఆర్‌ తన రాజకీయ అనుభవాన్ని జోడించి రాబోయే రోజుల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

నివేదికలోని కీలకాంశాలు 
వచ్చే ఎన్నికలలోపు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి 
► ఉద్యమం, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు 
► ఏళ్ల తరబడి ఒకేచోట తిష్టవేసిన అధికారులకు స్థాన చలనం 
► తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు నో టికెట్‌ 
► మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం జనంలో ఉండేలా కార్యక్రమాలు 
► కొత్త, పాత నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచాలి 
► బీజేపీ దూకుడును తట్టుకునేలా సోషల్‌ మీడియాపై ఫోకస్‌ 
► యువత, విద్యార్థులకు అవగాహన సదస్సులు 
► అభివృద్ధి, సంక్షేమ పథకాల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement