సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ 2023–24 వార్షిక బడ్జెట్ సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదటిరోజున శాసనసభ హాల్‌లో శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ప్రసంగ పాఠం బుధవారం రాత్రి ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కు చేరింది. దాన్ని పరిశీలించిన గవర్నర్.. కొన్ని అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు కోరడంతో పాటు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం కూడా గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని, ప్రసంగ పాఠంలో పలు మార్పులు చేసి తుదిరూపు ఇచ్చినట్లు తెలిసింది. గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి నమూనాను ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇటీవల కేరళ, తమిళనాడు శాసనసభల్లో ఆయా రాష్ట్రాల గవర్నర్లు చేసిన ప్రసంగాలు వివాదాస్పదం కావడంతో శుక్రవారం తమిళిసై ప్రసంగం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది.
కేంద్రం తీరును ఎండగట్టేలా..
ఎన్నికల ఏడాది కావడంతో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ విధానాలు, పాలన తీరును ఎండగట్టేందుకు విపక్ష కాంగ్రెస్, బీజేపీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా, విపక్షాలను ధీటుగా ఎదు ర్కొనేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతోంది. రాష్టాన్ని ఆర్థికంగా దిగ్బంధిస్తూ కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే డిసెంబర్‌లో సమావేశాలు వీలు కాలేదు. దీంతో ప్రస్తుత సమావేశాలను సది్వనియోగం చేసుకోవాలని, కేంద్రంవైఖరిని ఎండగట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 3 రోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి రిక్తహస్తం చూపడంపై ఇప్పటికే మంత్రి హరీశ్ సహా బీఆర్‌ఎస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జె ట్‌పై చర్చకు సమాధానం, ఇతర పద్దులపై చర్చ సందర్భంగా కేంద్ర విధానాలను కేసీఆర్ ఎండగడతారని బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా..: మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలు ముఖ్యంగా.. డబుల్ బెడ్ రూం ఇళ్లు, 24 గంటల విద్యుత్, రుణమాఫీ వంటి అంశాలను ఎత్తి చూప డం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా విప క్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. గత ఏడాది సెపె్టంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాలు స్వల్ప వ్యవధిలో ముగిసినందున ప్రస్తుత బడ్జెట్ సమావేశాలను ఎక్కువ రోజులు కొనసాగించాలని కాంగ్రెస్, బీజేపీ కోరే అవకాశముంది. గత రెండు అసెంబ్లీ సమావేశాల్లోనూ బీజేపీ సభ్యులపై బహిష్కరణ వేటు పడిన నేపథ్యంలో, ప్రస్తుత సమావేశాల్లో ఆ పార్టీ అనుసరించే వ్యూహంపై ఆసక్తి నెలకొంది.
భారీ సభల నేపథ్యంలోనే..: ఈ నెల 11న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. అమిత్‌షా ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. కాగా 13న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. మరోవైపు ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట నామకరణం చేసిన కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 17న పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొననున్నారు. సభలకు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుంటే.. సమావేశాలు ఈ నెల 14లోగానే ముగిసే అవకాశముందని అంటున్నారు. ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్ చేరికల సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ముందు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ నాందేడ్ వెళతారు.
14 వరకు సమావేశాలు!
శుక్రవారం మధ్యాహ్నం శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ చాంబర్లలో వేర్వేరుగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలు (బీఏసీలు) సమావేశమవుతాయి. ఇందులోనే అసెంబ్లీ ఎప్పటి నుంచి ఎప్పటివరకు కొనసాగుతుంది? ఎజెండా ఏమిటనేది ఖరారవుతుంది. శుక్రవారం గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడే సభ శనివారం ఉదయం 10.30కు తిరిగి ప్రారంభం అవుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చించి ఆమోదించిన తర్వాత ఆదివారం సమావేశానికి విరామంగా ప్రకటిస్తారు. ఈ నెల 6న ఉదయం శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్, మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ నెల 14 వరకు సమావేశాలు కొనసాగే అవకాశమున్నట్లు బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment