కడుపు నిండిపోయింది... తెలంగాణ బిడ్డ పీవీ విగ్రహాన్ని చూస్తుంటే కడుపు నిండిపోయింది. నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్‌గా నామకరణం చేయడం సంతోషం. భవిష్యత్తులో అనేక పథకాలకు పీవీ పేరు పెట్టుకుందాం. – సీఎం కేసీఆర్
పీవీ ఓ విద్యానిధి...
పీవీ తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ ఏ పాత్ర పోషించినా సంస్కరణలకు పెద్దపీట వేశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా గురుకుల, నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేశారు. పీవీ ప్రారంభించిన గురుకుల పాఠశాలలో చదివిన డీజీపీ మహేందర్‌రెడ్డి తరహాలో ఎంతో మంది పీవీని ప్రతినిత్యం స్మరించుకుంటారు. పీవీ విద్యానిధి, సాహిత్య పెన్నిధి. కవి పండితుడు, బహుభాషా కోవిదుడు, సమున్నత సాహితీ స్ఫూర్తి.
ఆయన వల్లే పెట్టుబడులు...
దేశం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నర్సింహారావు అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. విదేశీ మారక నిల్వలు తరిగి బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితులను సవాలుగా తీసుకుని చేపట్టిన సంస్కరణలతో ఇప్పుడు దేశానికి పెట్టుబడులు వస్తున్నాయి. – సీఎం కేసీఆర్
ఒక గొప్ప ఆభరణం...
నెక్లెస్ రోడ్‌కు పీవీ విగ్రహం ఒక గొప్ప ఆభరణం. ఈ భూమి పుత్రుడికి దక్కిన గౌరవం. పీవీ కాంగ్రెస్‌కు చెందిన వాడైనా తన ఆత్మకథను ఆవిష్కరించే అవకాశం మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఇచ్చారు. మానవ హక్కులపై ఐక్య రాజ్య సమితిలో ప్రసంగించే అవకాశం కూడా వాజ్‌పేయికి కల్పించారు. – గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: ‘మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు ఒక కీర్తి శిఖరం.. ఒక దీప స్తంభం.. పరిపూర్ణ సంస్కరణశీలి. ఆయనను ఎంత స్మరించుకున్నా, ఎంత గౌరవించుకున్నా, ఎంత సన్మానించుకున్నా తక్కువే’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో కలసి సీఎం సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ (పీవీ మార్గ్) లోని జ్ఞానభూమిలో నిర్వహించిన పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నా ఏడాది కాలం గా రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు నేతృత్వంలోని కమిటీ ఘనంగా కార్యక్రమాలు నిర్వహించిందని ముఖ్యమంత్రి చెప్పారు.
భూ సంస్కరణలకు మార్గదర్శకం
‘పీవీ చేపట్టిన భూ సంస్కరణలను ఇతర రాష్ట్రాలు మార్గదర్శకంగా తీసుకున్నాయి. తనకున్న 800 ఎకరాల భూమిని ప్రజలకు ధారాదత్తం చేసి నిబద్ధ తను చాటుకుంటూ భూ సంస్కరణలు అమలు చేశారు. పీవీ స్మరణ, స్ఫూర్తిని భావితరాలకు చాటే లా కాకతీయ విశ్వవిద్యాలయంలో పీవీ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నం. వర్సిటీ వీసీ తాటికొండ రమేశ్ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తుంది. పీవీ అనేక పుస్తకాలు రాయడంతో పాటు రచనలను అధ్యయనం చేశారు. ఆయన ఆర్థిక సంస్కరణలతో నే దేశానికి పెట్టుబడులు వస్తున్నాయి. మాజీ ప్రధా ని మన్మోహన్‌సింగ్ కూడా పీవీని తండ్రిగా, గురువుగా స్మరించుకునేవారు’అని కేసీఆర్ అన్నారు.
సోమవారం పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్. చిత్రంలో కె.కేశవరావు, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులు
పుట్టిన, పెరిగిన ఊరులో విగ్రహాలు..
‘పీవీ పుట్టిన, పెరిగిన ఊరు, ఇతర చోట్ల విగ్రహావిష్కరణలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీవీ సమాధి ఉన్న జ్ఞానభూమిలోనూ న్యాయపరమైన చిక్కులు లేకుండా స్మారకం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన కుటుంబాన్ని గౌరవించుకునేందుకు ఆయన కుమార్తె సురభి వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. పీవీ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన ఆదర్శాలు, సంస్కరణశీల భావజాలాన్ని ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ సమాజ అభ్యున్నతికి దోహద పడటమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి’అని సీఎం అన్నారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు పీవీ: కేటీఆర్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జ యంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని పీవీ అభివృద్ధి పథంలో నిలిపారని పేర్కొన్నారు. ఆయన గొప్ప దార్శనికుడు, బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ అని కొనియాడారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్ ట్వీట్ చేశారు.
అరుదైన వ్యక్తిత్వం..: గవర్నర్
‘మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మహానేత, బహుముఖ ప్రజ్ఞాశాలి. పేద ప్రజల పెన్నిది. సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కర్త’అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ‘ఆయనను నేను ఎంతో గౌరవిస్తా. పీవీపై రూపొందించిన పుస్తకాలు వచ్చే తరాలకు విలువైన సమాచారాన్ని అందిస్తాయి. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వం పీవీది. పీవీ రాజకీయాలకంటే దేశాన్ని ఎక్కువగా ప్రేమించారు అని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పిన మాటలు అక్షర సత్యం. ప్రధాని మోదీ చెప్పినట్లు పీవీ దేశ ఆత్మను, విలువలను ప్రేమించారు. దక్షిణ భారతదేశం నుంచి ఆయన మొదటి ప్రధాని కావడం గర్వకారణం. పీవీ విజయాలను చూసి తెలంగాణ తల్లి ఎంతో సంతోషిస్తోంది’అని గవర్నర్ తమిళిసై అన్నారు.
పీవీ విగ్రహం, పుస్తకాల ఆవిష్కరణ..
ఈ సందర్భంగా నెక్లెస్‌రోడ్‌ను ‘పీవీ మార్గ్’గా నామకరణం చేస్తూ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, పీవీ జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీవీపై రూపొందించిన తొమ్మిది పుస్తకాలను గవర్నర్ తమిళిసైతో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవీ చిత్రపటానికి గవర్నర్, సీఎం నివాళి అర్పించగా.. కీర్తనలు, సర్వ మత ప్రార్థనలు జరిగాయి. ఏడాది కాలంగా జరిగిన పీవీ శత జయంతి వేడుకల కార్యక్రమాలను ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే.కేశవరావు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment