సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక అంశాలను సాకుగా చూపి.. సంప్రదాయం ప్రకారం జరగాల్సిన గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 7వ తేదీ నుంచి మొదలవుతున్న సమావేశాలు కొత్త సెషన్ కాదని, అంతకుముందు సెషన్‌కు కొనసాగింపేనని పేర్కొందని వివరించారు. ఈ అంశంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు.
ఐదు నెలల తర్వాత సభ సమావేశమవుతోందని.. సాధారణంగా అయితే ఇంత సుదీర్ఘ విరామం తర్వాత సభను కొత్త సెషన్‌తో ప్రారంభిస్తారని తమిళిసై తెలిపారు. అయినా మునుపటి సెషన్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని.. సాంకేతిక కారణాలను చూపి గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసిందని విమర్శించారు. ‘‘వాస్తవానికి గవర్నర్ ప్రసంగాన్ని గవర్నర్ కార్యాలయం తయారు చేయదు. అది ప్రభుత్వం రాసి ఇచ్చే ప్రకటనే. గతేడాది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విజయాలతోపాటు తదుపరి ఏడాదికి సంబంధించిన విధాన సూచికల ప్రగతి నివేదికే (ప్రోగ్రెస్ రిపోర్టు) గవర్నర్ ప్రసంగం.
ప్రసంగంలో పేర్కొన్న అంశాలపై, ప్రభుత్వ పాలనపై సభలో అర్థవంతమైన చర్చ జరగడానికి గవర్నర్ ప్రసంగం అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేసి ప్రజాస్వామ్య సూత్రాలను పటిష్టం చేయడానికి సభ్యులకు కీలక సాధనంగా ఉపయోగపడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారు..’’అని తమిళిసై స్పష్టం చేశారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రజాస్వామ్య ఆదర్శాలను పెంపొందించడం వరకే గవర్నర్ పాత్ర పరిమితమని పేర్కొన్నారు.
అధికారం ఉన్నా జాప్యం చేయలేదు
బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరిందని.. ఆ సమయంలో గవర్నర్ ప్రసంగంతోనే సభ ప్రారంభమవుతుందని తెలిపిందని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. దీనిపై వివరణ కోరగా.. అనుకోకుండా జరిగిన తప్పిదం వల్ల అలా వచ్చిందంటూ ప్రభుత్వం నోట్ పంపడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ‘‘రాజ్యాంగ సంప్రదాయాలను గౌరవిస్తూ, రాజకీయాలకు అతీతంగా, సహకార సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ.. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిఫార్సు చేశాను. ఈ విషయంలో కావాల్సినంత సమయం తీసుకునే స్వేచ్ఛ నాకు ఉన్నా.. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలు ఉన్నా.. నా తొలి ప్రాధాన్యత రాష్ట్ర ప్రజల సంక్షేమమే కాబట్టి.. ఏ మాత్రం ఆలస్యం చేయలేదు..’’అని తమిళిసై స్పష్టం చేశారు. ఏదేమైనా తెలంగాణ ప్రజలకు శుభం జరగాలని ఆకాంక్షించారు.
ప్రసంగం రద్దుకు సాంకేతిక సాకు!
Published Sat, Mar 5 2022 8:36 PM | Last Updated on Sun, Mar 6 2022 3:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment