Telangana: నా సర్కారు అగ్రగామి | Governor Tamilisai Speech at Telangana Assembly Budget Session | Sakshi
Sakshi News home page

Telangana: నా సర్కారు అగ్రగామి

Published Sat, Feb 4 2023 3:56 AM | Last Updated on Sat, Feb 4 2023 11:19 AM

Governor Tamilisai Speech at Telangana Assembly Budget Session - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలుగా నా ప్రభుత్వం ప్రగతిపథంలో వేగంగా పయనిస్తోంది. ఎనిమిదిన్నరేళ్ల వయసున్న తెలంగాణ సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావ­త్‌ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే రీతిలో అద్భుత ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తోంది. అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా.. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా రూపుదాల్చిం­ది’’ అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఆమె ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభు­త్వం అందజేసిన ప్రసంగ పాఠం మేరకు వివరాలను వెల్లడించారు. 2014–15లో తెలంగాణ ఆవిర్భావం నాటి పరిస్థితులతో పోల్చితే ఇప్పుడు వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు. గవర్నర్‌ ప్రసంగం ఆమె మాటల్లోనే..

‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి గతం కన్నా రెట్టింపైంది. రాష్ట్ర ఆదాయం 2014–15లో రూ.62వేల కోట్లు ఉండగా.. 2021–22 నాటికి రూ.లక్షా 84వేల కోట్లకు పెరిగింది. నాడు తలసరి ఆదాయం రూ.1,24,104 ఉండగా.. 2022–23 నాటికి రూ.3,17,115కి పెరిగింది. గతంలో దండుగ అంటూ అందరూ ఈసడించిన వ్యవసాయాన్ని నా ప్రభుత్వం పండుగలా మార్చింది. 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్‌ కాకతీయ పథకాలతోపాటు యుద్ధ ప్రాతిపదికన భారీ, మధ్యతరహా, చిన్న ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తితో కొత్త ఆయకట్టు అభివృద్ధి చెంది రైతుల్లో భరోసా పెరిగింది. సాగునీటి సౌకర్యం 20లక్షల ఎకరాల నుంచి 73.33లక్షల ఎకరాలకు పెరిగింది. రైతుబంధు కింద 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లను పంట పెట్టుబడి సాయంగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతులకు రూ.5లక్షల జీవిత బీమాను కూడా అందిస్తోంది. 
 
తీరిన కరెంట్, తాగునీటి కష్టాలు
 
రాష్ట్రంలో కరెంట్, తాగునీటి కష్టాలు తీరాయి. ప్రభుత్వ కృషితో తెలంగాణ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి నేడు 18,453 మెగావాట్లకు పెరిగింది. తలసరి విద్యుత్‌ వినియోగం 1,356 యూనిట్ల నుంచి 2021–22 నాటికి 2,126 యూనిట్లకు చేరింది. మిషన్‌ భగీరథతో రాష్ట్రంలోని 100శాతం గృహాలకు రక్షిత తాగునీరు సరఫరా జరుగుతోంది. 
 
మానవీయ ప్రభుత్వం 
నా ప్రభుత్వం మానవీయ ప్రభుత్వం. పేదలు, అసహాయులకు ఆసరా అందించే ప్రభుత్వం. ఇచి్చన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించింది. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కారి్మకులు, బోధకాలు బాధితులు, డయాలసిస్‌ రోగులు తదితర అసహాయులైన పేదలకు జీవన భద్రత కోసం ఆసరా పెన్షన్లను అందిస్తోంది.  
 
దళితబంధు.. ఎస్టీల కోటా పెంపు
 
దళితజాతి స్వావలంబన కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దేశ చరిత్రలోనే తొలిసారిగా దళిత కుటుంబాల ఉపాధి కల్పన కోసం రూ.10లక్షల చొప్పున ఉచిత గ్రాంట్‌ అందజేస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎస్టీల జనాభా 10శాతానికి పెరిగింది. వారికి ఇచి్చన మాట ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లను 10శాతానికి పెంచింది. 
 
బీసీలు, మైనారిటీలు, బ్రాహ్మణుల సంక్షేమం.. 
ప్రభుత్వం గొల్లకుర్మలకు రూ.11 వేల కోట్లతో 7.3లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసింది. ఉచితంగా చేపలను జలాశయాల్లో పెంచి వాటిని పట్టుకునే హక్కును స్థానిక మత్స్యకారులకే కల్పించింది. బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను అప్పగించడం ద్వారా చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులకు చేతినిండా కలి్పస్తోంది. నేతన్నలకు రూ.5లక్షల జీవిత బీమా, చేనేత మిత్ర కింద నూలు, రసాయనాల కొనుగోళ్లపై 50శాతం సబ్సిడీ అందిస్తోంది. గౌడ సోదరులకు వైన్‌షాపుల్లో 15శాతం రిజర్వేషన్లు, రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తోంది. రజకులు, నాయీ బ్రాహ్మణుల లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. బీసీ రెసిడెన్షియల్‌ విద్యాలయాలను 19 నుంచి 310కి పెంచింది. 203 మైనారిటీల గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేసి వాటిని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ద్వారా ఉపాధి కల్పన, విదేశీ విద్యకు ఆర్థిక సాయం వంటి పథకాలను అమలు చేస్తోంది. జర్నలిస్టులు, న్యాయవాదుల కోసం చెరో రూ.100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. 

మహిళలకు భరోసా, భద్రత 
రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా 100శాతం అంగన్‌వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారాన్ని అందించడాన్ని నీతి ఆయోగ్‌ కూడా ప్రశంసించింది. ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లకు దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తోంది. ఆశ వర్కర్ల పారితోషికాన్ని రూ.2 వేల నుంచి రూ.9,750కు పెంచింది. సివిల్‌ పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది. పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం కల్యాణలక్షి్మ/ షాదీ ముబారక్‌ పథకాల కింద రూ.లక్షా 116 ఆర్థిక సాయంగా అందిస్తోంది. ఈ పథకాలతో ఇప్పటివరకు 12,00,469 మందికి లబ్ధి కలిగింది. 

ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు 
ప్రభుత్వ ఉద్యోగులతోపాటు సమాంతరంగా హోంగార్డులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతో మైత్రీ భావంతో వ్యవహరిస్తోంది. దేశంలోనే అత్యధిక వేతనాలను తెలంగాణ ఉద్యోగులకు అందిస్తోంది. 

భారీగా ఉద్యోగాల భర్తీ 
ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందనే భయంతో ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇంత కష్టకాలంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతర కొనసాగిస్తోంది. 2014 జూన్‌ నుంచి 2022 ఫిబ్రవరి వరకు ప్రత్యక్ష నియామకాల ద్వారా 1,41,735 ఉద్యోగాలను భర్తీ చేయగా.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మరో 80,039 ఉద్యోగాలకు ఒకేసారి భర్తీ ప్రక్రియ చేపడుతోంది. మొత్తంగా 2,21,774 ఉద్యోగ నియామకాలు జరపడం తెలంగాణ చరిత్రలో అపురూపమైన ఘట్టం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణ ప్రక్రియ కొనసాగుతోంది. 

విద్యా రంగంలో వికాసం 
పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధనతో పాటు తగిన ఆహారం, వసతి ఏర్పాటు చేయాలనే ఉదాత్తమైన లక్ష్యంతో ప్రభుత్వం వెయ్యికి పైగా గురుకులాలను స్థాపించింది. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ స్థాయి మౌలిక సదుపాయాల కోసం మనఊరు–మనబడి/మన బస్తీ–మన బడి ప్రణాళికలను అమలు చేస్తోంది. రూ.7,259 కోట్లతో 26,065 పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తోంది. 

ప్రజారోగ్యంలో దేశంలో మూడో స్థానం 
దేశంలో అత్యున్నత వైద్యసేవలు అందించే రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో మౌలిక సదుపాయాలు కలి్పంచింది. హైదరాబాద్‌ నగరం నలువైపులా 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోంది. నిమ్స్‌లో 2వేల పడకలను అదనంగా ఏర్పాటు చేస్తోంది. వరంగల్‌లో రూ.1,100 కోట్లతో 2వేల పడకల సామర్థ్యంతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల రేటు 30శాతం నుంచి 61 శాతానికి పెరిగింది. మాతృ మరణాలు ప్రతి లక్ష ప్రసవాలకు 92 నుంచి 43కు తగ్గాయి. శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు 39 నుంచి 21కి తగ్గింది. 

పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అభివృద్ధి 
టీఎస్‌–ఐపాస్‌ విధానం కింద పారిశ్రామిక, ఐటీ రంగాల్లో రూ.3 లక్షల 31వేల కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించింది. ఐటీ ఉద్యోగ నియామకాల్లో 140 శాతం వృద్ధి నమోదు చేసింది. 

125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం నిర్మిస్తున్నాం 
తెలంగాణ ప్రజల కొంగు బంగారమైన యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయాన్ని ప్రభుత్వం వైభవంగా పునరి్నరి్మంచింది. నూతనంగా నిర్మించిన సచివాలయ భవనానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టింది. అంబేడ్కర్‌ మహాశయుడి ఔన్నత్యం ప్రతిఫలించేలా దేశంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించబోతోంది..’’ అని గవర్నర్‌ తమిళిసై తన ప్రసంగంలో పేర్కొన్నారు.  

తెలంగాణను అగాధం నుంచి ఆదర్శవంత పరిస్థితికి చేర్చే ప్రయత్నంలో నా ప్రభుత్వం అనేక సవాళ్లు, అవరోధాలను దీటుగా ఎదుర్కొంది. అస్పష్టతలను ఛేదించింది. ప్రజల ఆశీస్సులు, ముఖ్యమంత్రి పాలనా దక్షత, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావంతోనే అపూర్వ విజయాలను సాధించింది. రాష్ట్ర అభివృద్ధి మోడల్‌ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే స్ఫూర్తి, నిబద్ధతతో నా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement