సాక్షి, హైదరాబాద్: ‘నా సొంత కూతురు, ఎమ్మెల్సీ కవితకు.. పార్టీ మారాలంటూ బీజేపీ నుంచి ప్రతిపాదనలు రావడం, దేశంలో ఆ పార్టీ చేస్తున్న వికృత రాజకీయాలకు అద్దం పడుతోంది. ఈ తరహా రాజకీయాలపై తెలంగాణ నుంచే పోరాటాన్ని ప్రారంభించి బీజేపీకి చరమగీతం పాడదాం. బీజేపీ రూపంలో దేశానికి పట్టిన చెదను రూపుమాపాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్‌పై ఉంది. ఉన్మాద రాజకీయాలు చేసే ఆ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..’ అని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘ఫోన్లు చేసి ‘పార్టీ మారతారా?’ అని ఎవరైనా అడిగితే చెప్పుతో కొడతామంటూ సమాధానం ఇవ్వాలి.
మూడున్నర కోట్ల రాష్ట్ర నాభాలో 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ మనదనే ధీమాతో ఉండాలి..’ అని సూచించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. బీజేపీ అప్రజాస్వామిక, వికృత చర్యలపై పోరాటం చేయాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రెండు గంటల పాటు సాగిన ఈ కీలక భేటీలో బీజేపీపై సాగించాల్సిన పోరు, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగం సన్నద్ధతపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
ప్రతి ఒక్కరూ కేసీఆర్‌లా కొట్లాడాలి
‘బీజేపీపై ధర్మయుద్ధం చేస్తున్న మనం ఆ పార్టీపై ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను దేశానికి ఇవ్వాలి. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను చీల్చే కుట్రలను బీజేపీ విజయవంతంగా చేసినా, తెలంగాణ మాత్రం ఈ కుట్రలను ప్రపంచం ముందు నిలబెట్టింది. బీజేపీ కుట్రలకు సంబంధించి 5 టెరాబైట్ల (దాదాపు 5లక్షల పేజీలకు సమానం) సమాచారం ఉంది. బీజేపీ నిజ స్వరూపానికి సంబంధించిన ఈ సమాచారాన్ని దేశ వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో న్యాయస్థానాలు, దేశంలోని వివిధ పార్టీల అధ్యక్షులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపించాం. బీజేపీపై పోరులో ప్రతి ఒక్కరూ కేసీఆర్‌లా నిలబడి కొట్లాడాలి..’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
దాడులు, బెదిరింపులకు అవకాశం
‘రాజ్యాంగ వ్యవస్థలను సర్వనాశనం చేసిన బీజేపీ, ఎనిమిదేండ్లలో అనేక మందిపై ఈడీ కేసులు పెట్టి ఇప్పటివరకు ఒక్కటీ నిరూపించలేక పోయింది. మంత్రి గంగుల ఇళ్లల్లో ఈడీ సోదాలు చేసినా ఏమీ దొరకలేదు. బీజేపీ దగ్గర రూ.2 లక్షల కోట్లు ఉన్నట్లు ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడైన సింహయాజీ చెప్తున్నాడు. ఒక రాజకీయ పార్టీకి ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో, దేని కోసం వాడుతున్నారో దేశానికి తెలియచేద్దాం. కొంతమంది ఎమ్మెల్యేలపై ఈడీ దాడులకు, బీజేపీ బెదిరింపులకు అవకాశముంది. అయినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కేంద్ర సంస్థలు దాడులు చేస్తే తిరగబడండి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో త్వరలో మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశముంది’ అని సీఎం చెప్పారు.
95 స్థానాల్లో అవలీలగా గెలుపు
‘రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇస్తాం. 119 సీట్లకు గాను టీఆర్‌ఎస్ పార్టీ 95 స్థానాల్లో అవలీలగా గెలుస్తుంది. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ఇప్పటినుంచే ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి పార్టీ కేడర్‌తో ఎమ్మెల్యేలు సమావేశమై కష్ట సుఖాలు పంచుకోవాలి. వచ్చే 15 రోజుల్లో ఈ ఆత్మీయ సమ్మేళనాలు పూర్తిచేస్తే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఒక అవగాహన వస్తుంది. ఈ సమ్మేళనాలకు సంబంధిత జిల్లా మంత్రులు కూడా హాజరు కావాలి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రోగ్రెస్ కార్డును తయారు చేసుకోవాలి. ప్రతి వందమంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిలను నియమించి, వారి ఫోన్ నంబర్లను పార్టీ కార్యాలయానికి పంపించాలి. ఈ ఇన్‌చార్జిలు.. వంద మంది ఓటర్లలో ఎవరు స్థానికంగా ఉంటున్నారు, ఇతర ప్రాంతాల్లో ఎందరు ఉంటున్నారు, వారి వివరాలు, ఫోన్ నంబర్లు తదితరాలు సేకరించాలి..’ అని సూచించారు.
త్వరలో జిల్లా కలెక్టర్లతో భేటీ, కేబినెట్ సమావేశం
‘వచ్చే పది నెలల పాటు నియోజకవర్గాలపైనే ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి. త్వరలో నేను కూడా జిల్లాల్లో పర్యటిస్తా. పార్టీ జిల్లా కార్యాలయాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. దళితబంధు పథకం కింద నియోజకవర్గానికి 500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ధరణి ద్వారా 98 శాతం సమస్యలు పరిష్కారమైనా, మిగతావాటి పరిష్కారం కోసం నియోజకవర్గాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. సొంత జాగా ఉండి ఇళ్లు లేనివారికి రూ.3 లక్షలు చొప్పున అందిస్తాం. ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యేలు పాలు పంచుకోవాలి. పోడు భూములు, ధరణి సమస్యలు తదితరాలపై త్వరలో జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక భేటీ ఉంటుంది. వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు త్వరలో కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తా..’ అని కేసీఆర్ తెలిపారు.
మునుగోడు తరహా వ్యూహంతో మళ్లీ అధికారంలోకి..
‘రాజకీయాలు ఎంతగా కలుషితం అయ్యాయో మునుగోడు ఉప ఎన్నిక అద్దం పట్టింది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఏవైనా ప్రసాదాలు పంచిందా? గూండాగిరి, దాదాగిరి చేసినా ప్రజలు మనవైపే ఉండటాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతోంది. ఒక గ్రామంలో కావాలని ఘర్షణకు దిగింది. మనకున్న బలంతో పోలిస్తే ఆ పార్టీకి ఉన్న బలం పిడికెడు. ఇకపై ఇలాంటి ఘటనలకు బీజేపీ ఎక్కడైనా పాల్పడితే గట్టిగా సమాధానం చెప్పాలి. మునుగోడు తరహా వ్యూహాన్ని రూపొందించుకుని మూడోసారి కూడా అధికారంలోకి వస్తాం..’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌ది ముగిసిన అధ్యాయం
‘దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌గాంధీ గుజరాత్‌లో ఎన్నికలు ఉన్నా వెళ్లడం లేదు. ఎవరు ఎంతగా పనిచేసినా కాంగ్రెస్ బతకదనే సంకేతాలు రాహుల్‌గాంధీ ఇస్తున్నారు. కాబట్టి దేశంలో కాంగ్రెస్‌ది ముగిసిన అధ్యాయమే..’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆ ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదు.. ఎన్నికలకు సిద్ధమైపోండి: సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment