‘కొందరు సన్నాసులు వెకిలిగా నవ్వారు’ | CM KCR Says His Happy With Development OF Telangana | Sakshi
Sakshi News home page

‘ఆకలి చావుల జిల్లాను ఎలా మార్చామో చూశారు’

Published Mon, Dec 30 2019 6:25 PM | Last Updated on Mon, Dec 30 2019 8:40 PM

CM KCR Says His Happy With Development OF Telangana - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కాంగ్రెస్‌, బీజేపీలకు తెలంగాణ భౌగోళిక, సాంకేతిక అంశాలపై కనీస పరిజ్ఞానం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని కేసులు పెట్టిన పట్టించుకోకుండా పనిచేశామని, దాని ఫలితం అందరూ చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాజెక్టులు, డ్యాంలను చూస్తుంటే తాను కలలు గన్న తెలంగాణ కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.

సోమవారం కరీంగనర్‌ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన సీఎం కేసీఆర్‌ తొలుత మిడ్‌ మానేర్‌ను సందర్శించాక కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఉత్తర తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్స్‌రేతో చూస్తోందన్నారు. ఉద్యమంలో అండగా ఉన్న కరీంనగర్‌ జిల్లా అభివృద్ది సాధించడం సంతోషంగా ఉందన్నారు.  ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. 

సిరిసిల్లలో ఆకలి చావులు ఉండేవి..
‘కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీ తో సంబంధం లేకుండా 50 టీఎంసీలు లోయర్, మిడ్ మానేరులో నింపుకున్నాం. మరో 60 టీఎంసీలు బ్యారేజీల్లో నింపే అవకాశం ఉంది. ఇకపై వర్షాల కోసం రైతు మొగులు వైపు చూడనవసరం లేదు. 2001లోనే గోదావరి తీర తెలంగాణలో కరవు ఉండకూడదని ఆకాంక్షించాం. ఆ కల కాళేశ్వరంతో నెరవేరింది. మిడ్ మానేరు చూస్తే చాలా ఆనందం వేసింది. గోదావరి నదితో పాటు అనేక వాగులున్న కరీంనగర్ జిల్లా ఇంతకాలం కరువుతో అల్లాడింది. అనేక మంది ఈ జిల్లాల నుంచి వలసలు పోయారు. సిరిసిల్లలో ఆకలి చావులుండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ జిల్లా ఎలా మారిందో చూస్తున్నారు. జిల్లాలో 140 కి.మీ గోదావరి 365 రోజులు ఇకపై సజీవంగా ఉంటుంది. భూగర్భ జలాలు పెరిగి బోర్లు బయటకు పోస్తున్నాయి.

రాష్ట్రాన్ని ఎక్స్‌రేతో టీఆర్‌ఎస్‌ చూస్తుంది
కాకతీయ కెనాల్ 200 కి.మీ పారుతుంది. మెట్‌పల్లి దమ్మన్నపేట నుంచి హసన్ పర్తి 200 కిలోమీటర్ల మేర రెండు పంటలు పండిస్తున్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద ఎస్సారెస్పీ ఎల్లప్పుడు నిండుగా ఉంటుంది. మానేరు నది జిల్లాకు మరో వరం. ఇది 181 కి.మీ. మేర పారుతుంది. ఈ నదిని గతంలో ఎవరూ పట్టించుకోలేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి పై ఏ పార్టీకి లేనంత కమిట్ మెంట్ ఉంది. రాష్ట్రాన్ని ఎక్స్‌రే తో టీఆర్ఎస్ చూస్తుంది. 1230 చెక్ డ్యాంలు రాష్ట్రంలో నిర్మించ బోతున్నాం. వీటిలో సింహ భాగం రూ. 1250 కోట్లతో పాత కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాంలు నిర్మించబోతున్నాం. మానేరుపై 29, మూలవాగుపై 10 చెక్ డ్యాంలకు వెంటనే టెండర్లు పిలుస్తాం. పాలుగారే జిల్లాగా కరీంనగర్ మారబోతోంది. మిడ్ మానేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా గొప్ప పాత్ర పోషించబోతోంది.

నేను కలలు గన్న తెలంగాణ కనిపిస్తోంది
ఎల్లంపల్లి, మిడ్ మానేరు, మల్లన్న సాగర్ కీలక ప్రాజెక్టులుగా ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 75-80 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండుతాయి. 40 వేల కోట్లతో రైతులు బోర్లు మోటార్లు పెట్టుకున్నారు. 26, 27 లక్షల పంపుసెట్లు రాష్ట్రంలో ఉన్నాయి. జూన్ లోగా జిల్లాలోని చెక్ డ్యాంలు పూర్తి చేస్తాం. లండన్‌లోని థేమ్స్ నదిలాగా మానేరు సజీవంగా ఉంటుందని నేను గతంలో చెబితే కొందరు సన్నాసులు వెకిలిగా నవ్వారు. వచ్చే జూన్ నాటికి ఈ ప్రాంతం ఎలా మారుతుందోమారుతుంది చూపిస్తాం. నేను కలలు గన్న తెలంగాణ  కనిపిస్తోంది. 46 వాగులు ఉమ్మడి కరీంనగర్  జిల్లాలో ప్రవహిస్తున్నాయి. కొంతమందికి ఇన్ని వాగులున్నాటని కూడా తెలియదు.

ఈ పర్యటన నాకెంతో సంతోషం కలిగించింది
మాకు ఎవరూ దరఖాస్తు చేయకున్నా రాష్ట్రం  మొత్తం బాగుపడాలన్న లక్ష్యంతో స్కీంలు తెచ్చాం. కాంగ్రెస్, బీజేపీలకు భౌగోళిక, సాంకేతిక, విషయ పరిజ్ఞానం లేదు. మిడ్ మానేరు ను నింపే క్రమంలో కూడా కొందరు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు. మిడ్ మానేరులో సీపేజీల గురించి అవగాహన లేకుండా మాట్లాడారు. 15 టీఎంసీలు నింపినప్పుడు కొంచెం ఎక్కువ సీపేజీ వస్తే టెస్టులు చేయించాం. ఆ సీపేజీ వచ్చిన ప్రాంతంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే  కాంట్రాక్టు పనులు గతంలో చేసాడు. కాళేశ్వరంపై ఎన్ని కేసులు వేసినా పట్టించుకోకుండా పనిచేశాం.

46 వాగులపై 210 చెక్ డ్యాంలు కడతాం. అన్ని నియోజక వర్గాల ఎమ్మెల్యేలు ఈ పనులు చేపట్టేలా చూడాలి. ఉద్యమంలో అండగా ఉన్న కరీంనగర్ జిల్లా అభివృద్ధి సాధించడం సంతోషంగా ఉంది. పెద్దపల్లి, రామగుండం టేలెండ్ ప్రాంతాలకు కూడా నీరందుతోంది. కరీంనగర్ నుంచి సూర్యాపేట జిల్లా వరకు నీరు చేరుతోంది. త్వరలోనే ఎమ్మెల్యేలతో చెక్ డ్యాంల పై సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. నేటి పర్యటన నాకెంతో సంతోషం కలిగించింది.’అంటూ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement