Mid Manair Dam
-
3 ప్రాజెక్టులను ఆదుకున్న ‘ఎల్లంపల్లి’
బోయినపల్లి(చొప్పదండి): నిన్నటిదాకా నీరు లేక వెలవెలబోయిన మిడ్‌మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్ ప్రాజెక్టులు ప్రస్తుతం జలకళ సంతరించుకున్నాయి. ఎల్లంపల్లి జలాలు ఎత్తిపోతల ద్వారా వస్తుండడంతో మూడు ప్రాజెక్టుల్లో నీటినిల్వలు పెరిగాయి. బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు) ప్రాజెక్టులోకి శ్రీపాద ఎల్లంపల్లి జలాలు గాయత్రీ పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోతల ద్వారా చేరుతున్నాయి. మిడ్‌మానేరులో 17 టీఎంసీల మేర నీరు చేరిన తర్వాత ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ ప్రాజెక్టు ప్యాకేజీ–10లోకి.. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ప్రాజెక్టు–11లోకి నీరు విడుదల చేస్తున్నారు. ఎత్తిపోతలతో ఎల్లంపల్లి జలాలు నంది పంప్‌హౌస్ నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌కు చేరుకుంటున్నాయి.అక్కడి నుంచి వరదకాల్వ మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లా మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి అన్నపూర్ణతోపాటు సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్‌కు తరలుతున్నాయి. కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరడంతో గత జూలై 27వ తేదీ నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరదకాల్వ ద్వారా మిడ్‌మానేరుకు నీటి విడుదల కొనసాగుతోంది.మిడ్‌మానేరు టు అన్నపూర్ణ.. రంగనాయకసాగర్మిడ్మానేరు నుంచి ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ ప్రాజెక్టులోకి నీరు విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ పూర్తి నీటిమట్టం 3.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.60 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్‌మానేరు అప్రోచ్ కెనాల్ నుంచి అన్నపూర్ణ ప్రాజెక్టుకు ఈనెల 5వ తేదీ నుంచి రోజుకు 6,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ప్యాకేజీ–11లోకి రోజుకు 3,300 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లోగా వెళుతోంది. ఇప్పటికే రెండు రెండు టీఎంసీల నీరు చేరింది. దీంతో ప్రస్తుతం రంగానాయకసాగర్ లో 2.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రంగనాయకసాగర్ నుంచి మల్లన్న సాగర్‌కు రోజుకు 3, 900 క్యూసెక్కుల నీరు మల్లన్నసాగర్ నుంచి కొండ పోచమ్మసాగర్‌లోకి 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదుకున్న ఎల్లంపల్లి జలాలుమిడ్మానేరులో గత జూలై 27వ తేదీకి ముందు 5.90 టీఎంసీల మేర నీటి నిల్వలు మాత్రమే ఉండేవి. ఈక్రమంలో మిడ్‌మానేరుకు ఎల్లంపల్లి జలాలు ఎత్తిపోతల ద్వారా వదలడంతో 20 రోజులుగా వచ్చిన నీటితో ప్రస్తుతం 15.91 టీఎంసీలకు నీటినిల్వ చేరింది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం నిత్యం 3,150 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తోంది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు ఇప్పటి వరకు సుమారు 20 టీఎంసీల నీరు చేరింది. కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాల పరి«దిలో విస్తరించి ఉన్న వరదకాల్వలో నీరు నిండుగా ప్రవహిస్తుండడంతో ఆయా పరిధిలోని రైతులు 2వేల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. -
జ్ఞాపకాల్లో మునిగి తేలారు!
బోయినపల్లి(చొప్పదండి) : ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బరువెక్కిన హృదయాలతో కన్నతల్లిలాంటి ఊరు విడిచి వెళ్లిన గ్రామస్తులు...ఇప్పుడు మళ్లీ ఆ మధుర స్మతులను నెమరువేసుకుంటున్నారు. రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మించారు. నిర్మాణ సమయంలో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులోకి 2019లో పూర్తిస్థాయిలో 25 టీఎంసీల నీరు చేరడంతో నిర్వాసితులు పునరావాస కాలనీలకు తరలివెళ్లారు. 2022లో ప్రాజెక్టులో నీటిమట్టం 8 టీఎంసీలకుచేరగా.. పాత ఊళ్ల ఆనవాళ్లు కనిపించాయి.తిరిగి రెండేళ్ల అనంతరం కొద్ది రోజులుగా మిడ్‌మానేరులో 7.69 టీఎంసీల మేర నీరు మాత్రమే ఉండడంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వాటిని చూసేందుకు నిర్వాసితులు తరలివస్తున్నారు. మునిగితేలిన ముంపు గ్రామాలు బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, శాభా‹Ùపల్లి, రుద్రవరం, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా గ్రామాలు తేలాయి. పాత ఇళ్లు, ఆలయాలు, మొండి గోడలు కనిపిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి మా పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరును చూడడానికి వెళితే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నీట తేలిన ఇళ్లలో కూలిన గోడలు.. దర్వాజాలు కనిపించడంతో గుండెలు బరువెక్కుతున్నాయి. – కొనుకటి హరీశ్, నీలోజిపల్లి పాతూరు చూసేందుకు వచ్చిన.. పాత ఊర్లు తేలడంతోఅందరం కలిసి చూసేందుకు వచ్చాం. సెల్ఫీలు దిగాం.ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లకు.. పిల్లలకు పాత ఊరి ఫొటోలు చూపిస్తాం. – పెంజర్ల మల్లయ్య, కొదురుపాక 60 ఏళ్లయినా చెక్కు చెదరని రోడ్లు, వంతెనలు బాల్కొండ /సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. గత ఏడాది మే నెలలో కనిష్టంగా 21 టీఎంసీల నీటిమట్టం నిల్వ ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే నీటిమట్టం 12.5 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ముంపునకు గురైన గ్రామాల ఆనవాళ్లు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. గాదేపల్లి– బర్దిపూర్ గ్రామాల మీదుగా నందిపేట్ మండల కేంద్రం వరకు గల రోడ్డు బయట పడింది. 60 ఏళ్లుగా నీటిలో ఉన్నా, ఆ రోడ్డుపై నిర్మించిన వంతెనలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రాజెక్టు నడి మధ్యలో ఉన్న రత్నాపూర్ గుట్ట, ఆ గుట్ట వరకు ఉన్న దారి కూడా బయట పడింది. మరో 10 రోజుల్లో గుట్టపైకి వెళ్లి అక్కడ ఉన్న మల్లన్న దేవుడిని దర్శించుకోవచ్చని చెబుతున్నారు. జనవరి నుంచే సంగమేశ్వర దర్శనం సాక్షి, నాగర్‌కర్నూల్ : శ్రీశైలం రిజర్వాయర్‌లో ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో నీరు తగ్గుముఖం పట్టాక సంగమేశ్వర ఆలయం బయటపడుతుంది. అయితే ఈ ఏడాది రిజర్వాయర్‌లో నీరు లేక జనవరి నెలలోనే సంగమేశ్వర ఆలయం బయటపడింది. ఇక్కడి శివలింగం రాయితో కాకుండా వేప వృక్షపు కలప(వేపదారు శివలింగం)తో ఉండటం విశేషం. కృష్ణా, వేణి, తుంగ, భద్ర, మలపహరని, భీమరతి, భవనాశిని నదులు కలిసే చోటు కావడంతో ఈ క్షేత్రాన్ని సప్తనదుల సంగమంగా పేర్కొంటారు. తెలంగాణ నుంచి భక్తులు కొల్లాపూర్ మండలంలోని సోమశిల వద్దనున్న కృష్ణాతీరం నుంచి బోట్ల ద్వారా సంగమేశ్వరానికి చేరుకుంటారు. -
విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి మిడ్‌మానేర్‌లో దూకిన తల్లి
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో విషాదం చోటుచేసకుంది. బోయినపల్లి మండలం శభాష్‌పల్లి వంతెన వద్ద పిల్లలతో సహా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలతో కలిసి బుధవారం మిడ్ మానేరు రిజర్వాయర్‌లోకి దూకి ప్రాణాలు విడిచింది. మృతుల్లో పద్నాలుగు నెలల పసికందు కూడా ఉండటం మనసుని కలిచివేస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను నీటిలోంచి వెలికితీశారు. చనిపోయిన వారిని తల్లి రజిత, అయాన్(7), అశ్రజాబిన్(5), ఉస్మాన్ అహ్మద్(14నెలలు)గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా వేములవాడ అర్భన్ మండలానికి చెందిన రజిత, కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌కు చెందిన మహ్మద్ అలీది ప్రేమ వివాహం. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి పిల్లలు కలిసి బయల్దేరింది. అప్పటి నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు మిడ్ మానేరులో నాలుగురిని విగత జీవులుగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే మహిళ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సారీ కవిత నా వల్ల మాటలు పడ్డావ్.. తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం -
గత జ్ఞాపకాలతో బరువెక్కుతున్న గుండెలు
బోయినపల్లి (చొప్పదండి): కూలిన గోడలు.. శిథిల రోడ్లు.. మోడువారిన చెట్లు.. పాడుబడిన గుడిని చూసి వారి గుండెలు బరువెక్కుతున్నాయి. తాము పుట్టి, పెరిగిన గ్రామాలు జ్ఞాపకాలుగా మిగలడాన్ని చూసి కళ్లు చెమర్చుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మధ్యమానేరులో ముంపునకు గురైన గ్రామాలు ఇప్పుడు తేలడంతో వాటిని చూసిన నిర్వాసితులు ఉద్వేగానికి గురవుతున్నారు. ‘ఇది మా ఇల్లు.. ఇది మా బడి.. అరే అదిగదిగో అంజన్న గుడి’అంటూ పాత జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. మొండి గోడలు, మోడువారిన చెట్లను చూసి చలించిపోతున్నారు. ఈ దృశ్యాలు మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపు నకు గురైన గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మిడ్‌మానేరులో నీటిమట్టం తగ్గడంతో మునిగిన గ్రామాలు తేలాయి. వాటిని చూసేందుకు నిర్వాసితులు నిత్యం వెళ్లి వస్తున్నారు. రోజంతా అక్కడే గడిపి బరువెక్కిన హృదయాలతో తిరిగి వస్తున్నారు. 2019లో మునిగిన గ్రామాలు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టుతో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 11 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులో 2018 నుంచి నీరు చేరడంతో ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కాలనీలకు తరలిపోయారు. 2019లో 25 టీఎంసీల నీరు చేరడంతో బ్యాక్‌వాటర్‌లో ముంపు గ్రామాలు మొత్తం మునిగిపోయాయి. రెండేళ్లుగా ప్రాజెక్టులో నీరు నిండుగా ఉండటంతో ఆ గ్రామాల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. నెల రోజులుగా 8 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పది కి.మీ. తగ్గిన బ్యాక్‌వాటర్ మిడ్‌మానేరు ప్రాజెక్టులో 26 టీఎంసీల నీరు చేరితే తంగళ్లపల్లి బ్రిడ్జి, సిరిసిల్ల బతుకమ్మ ఘాట్, సాయినగర్ వరకు 18 కి.మీ. మేర బ్యాక్‌వాటర్ చేరుతుంది. ఇటీవల ప్రాజెక్టు నుంచి మల్లన్నసాగర్, ఎల్ఎండీలకు నీరు విడుదల చేయడంతో ఇప్పుడు 8.33 టీఎంసీల జలాలున్నాయి. దీంతో బ్యాక్‌వాటర్ పది కిలోమీటర్లలోపే ఉంది. మిడ్‌మానేరు ప్రాజెక్టు స్వరూపం నీటి సామర్థ్యం 27.55 టీఎంసీలు ప్రస్తుత నిల్వ 8.33 టీఎంసీలు బ్యాక్ వాటర్ 18 కి.మీ. ప్రస్తుత బ్యాక్‌వాటర్ 10 కి.మీ. ముంపు గ్రామాలు 11 ప్రాజెక్టులో సేకరించిన భూమి 20వేల ఎకరాలు ముంపునకు గురైన ఇళ్లు సుమారు 8,500 నిర్వాసిత కుటుంబాలు 11,731 గుండెలు బరువెక్కుతున్నాయి ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గ డంతో నీలోజిపల్లి పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరును చూసేందుకు వెళ్తే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. కూలిన గోడలు.. దర్వాజలు కనిపించడంతో గుండెలు బరువెక్కుతున్నాయి. – సింగిరెడ్డి బాలమల్లు, నీలోజిపల్లి, బోయినపల్లి తెలియని అనుభూతి ముంపులో మునిగిన ఊరు మళ్లీ కనిపిస్తుందంటే చూసేందుకు వెళ్తున్నారు. మళ్లీ ఆ ఆనవాళ్లు కనిపిస్తాయో.. లేదోనని చాలామంది పాత ఊళ్లు చూసేందుకు వెళ్తున్నారు. పాత గ్రామాలను చూస్తే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అదోరకమైన సంతోషం.. బాధ రెండూ కలుగుతున్నాయి. – ఆడెపు రాజు, వరదవెల్లి, బోయినపల్లి తేలిన గ్రామాలివీ వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, శాభాష్‌పల్లి, రుద్రవరం, బోయినపల్లి మండలం, కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి -
మిడ్‌మానేరులో ఇద్దరు గల్లంతు.. ఆచూకీ లేదు
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక ఫోర్‌లేన్ వంతెనపై నుంచి మిడ్‌మానేరులో సోమవారం రాత్రి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ వ్యక్తి దూకగా.. సంఘటన స్థలంలో జనం గుమిగూడడంతో పరిశీలిస్తూ వంతెన దాటే ప్రయత్నంలో మరోవ్యక్తి ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడిపోయాడు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన సాయికృష్ణ(26)కు జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన యువతితో ఆర్నెల్ల క్రితం వివాహం జరిగింది. వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సాయికృష్ణ మిడ్‌మానేరు వంతెన వద్ద బైక్ నిలిపి తన సోదరుడికి ఫోన్ చేశాడు. వంతెన వద్ద ఉన్న ‘ఐ మిస్‌యూ అన్న’ అంటూ చెప్పి మిడ్‌మానేరులో దూకాడు. అతడి సోదరుడు, సంబంధీకులు వచ్చి మిడ్‌మానేరు వద్ద చూడగా మోటారు సైకిల్ కనిపించింది. కానీ సాయికృష్ణ కనిపించలేదు. ప్రమాదవశాత్తు పడిపోయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కరీంనగర్ పట్టణానికి చెందిన గడ్డం రాజశేఖర్‌రెడ్డి(30) సాఫ్ట్వేర్ ఇంజినీర్. లాక్‌డౌన్‌తో ఇంటివద్ద నుంచే పనిచేస్తున్నాడు. అతడి మిత్రుడు అజిజ్ కొరియర్లో పనిచేస్తాడు. అజిజ్తో కలిసి కొరియర్ డబ్బు ఇవ్వడానికి సిరిసిల్లకు వెళ్లి సోమవారం రాత్రి వంతెన పరిసరాల్లో నుంచి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో బ్రిడ్జి వద్ద సాయికృష్ణ దూకడంతో అక్కడ జనం గుమిగూడి ఉండడం చూసి ఆగారు. ఇంకోవైపు బ్రిడ్జి వద్ద ఉన్న జనం వద్దకు వెళ్లేందుకు రెండు వంతెనల మధ్యలో నుంచి దారి ఉందనికుని దాటే ప్రయత్నం చేశాడు. దీంతో రెండు బ్రిడ్జిల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం మానేరు నీటిలో రాజశేఖర్‌రెడ్డి పడ్డాడు. కాగా, ఒకరి ప్రమాదం చూసేందుకు వస్తూ.. కళ్లముందే మరొకరు ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు పడడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాగా రాత్రి 11 గంటల వరకు ఇద్దరి ఆచూకీ లభించలేదు. -
తెలంగాణ: వేసవిలోనూ చెరువులకు జలకళ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత ఆరంభమైన నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ఆయకట్టు పంటలకు ఎలాంటి నీటి కొరత లేకుండా చెరువులు, చెక్‌డ్యామ్‌ల్లో నీటి నిల్వలు పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎల్లంపల్లి దిగువ నుంచి కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వరకు ఎన్ని వీలైతే అన్ని చెరువులను వంద శాతం నీటితో నింపాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఇరిగేషన్ శాఖ పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇప్పటికే చెరువుల్లో నీటిని నింపే ప్రక్రియ మొదలవగా, మొత్తంగా 2,074 చెరువులకు నింపేలా ప్రణాళిక రచించింది. ఈ చెరువుల ద్వారా 1.20 లక్షల ఎకరాల మేర నీరందించనుంది. చదవండి: (ఆ ప్రాజెక్టులకు నిధులు ఆగొద్దు: కేసీఆర్) ఎస్సారెస్పీ కింద చెరువులకు జలకళ... ముఖ్యంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వ పుష్కలంగా ఉండటంతో ఆ నీటి ద్వారా లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) వరకు కాల్వల ద్వారా పంటలకు నీరిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎస్సారెస్పీలో నీటి నిల్వలు ఉంచడం మేలనే ఉద్దేశంతో ఎల్ఎండీ దిగువన కాళేశ్వరం ఎత్తిపోతల నీటిని వాడుతున్నారు. ఇక ఎల్ఎండీ దిగువన ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద సుమారు మరో 3.50 లక్షల ఎకరాలకు నీరందించేలా ఇప్పటికే కాల్వల ద్వారా నీటి విడుదల జరగ్గా, దీని కింద 942 చెరువులున్నాయి. ఈ చెరువులకు నీటిని అందించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తూ నీటి విడుదల కొనసాగుతోంది. ఇప్పటికే చాలా చెరువులకు నీరందించేలా తూముల నిర్మాణం పూర్తయిన దృష్ట్యా, వాటి ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఈ చెరువులను నింపడం ద్వారా వాటికింద ఉన్న సుమారు 80 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుండగా, 10 టీఎంసీల మేర నిల్వలు సాధ్యపడనున్నాయి. ఇక ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద మొత్తంగా 3.52 లక్షల ఎకరాలకు నీరందించనుండగా, 866 చెరువుల పరిధిలో కనీసంగా 30 వేల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఈ చెరువులన్నింటినీ ముందుగా నింపేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవలే నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు చేశారు. చదవండి: (ప్రధాని మాటలు ఆచరణలోకి రావాలి: కేటీఆర్) మిడ్‌మానేరు దిగువన... ఇక మిడ్‌మానేరు దిగువన అనంతగిరి రిజర్వాయర్ మొదలు కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌కు పుష్కలంగా నీటి లభ్యత ఉంది. ఈ నీటితో మొత్తంగా 266 చెక్‌డ్యామ్‌లు, చెరువుల్లో నీటిని నింపేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని చెరువులను నీటితో నింపుతున్నారు. ఈ మొత్తం చెరువులు, చెక్‌డ్యామ్‌ల కింద 18 వేలకు పైగా ఎకరాలకు నీరందే అవకాశం ఉండగా, 8.60 టీఎంసీల మేర నీటి నిల్వలకు అవకాశం ఉంది. ఇందులో అనంతగిరి కింద బెజ్జంకి మండల పరిధిలో 16, ఇల్లంతకుంటలో 9, రంగనాయక్‌సాగర్ కింద చిన్నకోడూరు మండలంలో 23, నంగనూర్–49, నారాయణ్‌పేట–22, సిద్దిపేట–4, ఇల్లంతకుంట–3, తంగనపల్లి–10, ముస్తాబాద్–5 చెరువులు, వీటితో పాటు మరో 35 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. మల్లన్నసాగర్లో తవ్విన ఫీడర్ చానల్ ద్వారా తొగుట–6, దుబ్బాక–సిద్దిపేట–25, ముస్తాబాద్–6, కొండపోచమ్మసాగర్ పరిధిలో జగదేవ్‌పూర్ కెనాల్ ద్వారా మర్కూక్–23, జగదేవ్‌పూర్–5, తుర్కపల్లి కెనాల్ ద్వారా మర్కూక్–5, ఎం.తుర్కపల్లి–9, బొమ్మలరామారం–5. గజ్వేల్ కెనాల్ ద్వారా మర్కూక్–3, గజ్వేల్–1 చెరువులను నింపుతున్నారు. -
మిడ్‌మానేరు వద్ద మంచు లక్ష్మి షూటింగ్
సాక్షి, కరీంనగర్: శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు) ప్రాజెక్టు పరిసరాలు షూటింగ్ స్పాట్‌గా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్‌మానేరు ప్రాజెక్టు వెబ్ సిరీస్ పాటల చిత్రీకరణకు వేదికగా మారుతోంది. ప్రాజెక్టు డౌన్ స్ట్రీమ్, వరదకాలువ పరిసరాలతోపాటు, ప్రాజెక్టు బ్యాక్‌వాట ర్ ఏరియాలో ప్రముఖ టీవీ ఛానళ్లు సీరియల్స్ షూటింగ్ నిర్వహించడం విశేషం. పలువురు లోకల్ టాలెంట్ కళాకారులు, యూ ట్యూబ్ ఛానల్స్ వారు పలు జానద గేయాలు చిత్రీకరిస్తున్నారు. వరదకాలువ వద్ద మంచు లక్ష్మి షూటింగ్ గత జనవరి మొదటి వారంలో వెబ్ సిరీస్ ఆన్లైన్ షూటింగ్ నిమిత్తం ప్రముఖ నటుడు మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మితో దేశాయిపల్లి వరదకాలువ వద్ద షూటింగ్ నిర్వహించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ వరదకాలువపై నుంచి ఓ అమ్మాయి నీటిలో దూకే సీన్ చిత్రీకరించారు. ఇందులో మంచు లక్ష్మి గ్రామ పెద్ద పాత్ర పోషించారు. బ్యాక్ వాటర్ ఏరియాలో టీవీ సీరియళ్ల చిత్రీకరణ సందడి వారంక్రితం మిడ్‌మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామం వరదవెల్లి బ్యాక్ వాటర్ పరిసరాల్లో మా టీవీ నిర్మిస్తున్న కస్తూరి సీరియల్ షూటింగ్ సందడి చేసింది. అగ్నిసాక్షి సీరియల్ ఫేం హీరోయిన్ ఐశ్వర్య, సూర్య, గౌతంరాజు నటించారు. వైద్యశిబిరం జరిగే సన్నివేశం చిత్రీకరించారు. మూడురోజులపాటు షూటింగ్ చేశారు. వారంక్రితం జరిగిన సీరియల్ షూటింగ్ దృశ్యం జానపద గీతాలు.. మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిసరాల్లో లోకల్ టాలెంటెడ్ కళాకారులు పలు జానపద గీతాలు చిత్రీకరించారు. కరీంనగర్, వేములవాడ ప్రాంతాలకు చెందిన పలువురు జానపద కళాకారులు తమ టాలెంట్‌తో నిర్వహించే గీతాలు చిత్రీకరిస్తున్నారు. మండలంలోని కొదురుపాకకు చెందిన జానపద కళాకారుడు కత్తెరపాక శ్రీనివాస్ పలు ప్రేమ గీతాలతోపాటు, జానపద గీతాలు చిత్రీకరించారు. ప్రాజెక్టు అందాలు అద్భుతం మెరుగు యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్మించిన సరియా.. సరియా.. అనే గీతంలో నటించా. ప్రాజెక్టు గేట్ల పరిసరాల్లో పాట చిత్రీకరించారు. గేట్ల మీదుగా నీరు వెళ్తుండగా సాంగ్‌లో నటించడం ఎంతో మధురానుభూతిని అందించింది. – అశ్రుత, నటి, హైదరాబాద్ ప్రాజెక్టు వద్ద సందడి మాన్వాడ వద్ద గల మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిసరాలు షూటింగ్‌కు వేదికయ్యాయి. ప్రాజెక్టు గేట్లు, బ్యాక్ వాటర్ పరిసరాల్లో వివిధ యూట్యూబ్ ఛానల్స్ వారు పలు జానపద గీతాలు చిత్రీకరిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు పరిసరాల్లో సందడి నెలకొంది. దీంతో గ్రామానికి సందర్శకుల తాకిడి పెరిగింది. – రామిడి శ్రీనివాస్, సర్పంచ్, మాన్వాడ -
మిడ్‌మానేరుకు స్కానింగ్!
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏడాది ఎడతెరిపిలేని వానలు.. పోటెత్తుతున్న వాగులు, వంకలు.. పరవళ్లుతొక్కే వరద ప్రవాహాలు.. వెరసి ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిడ్‌మానేరు రిజర్వాయర్ పరిధిలో వరద నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మిడ్‌మానేరు గుండె కాయలాంటిది. కీలకమైన ఈ రిజర్వాయర్ పరిధిలో గతంలో రెండుసార్లు కట్ట తెగిన దృష్ట్యా వరదను ఎదుర్కొనే ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నిర్ణయించింది. డ్యామ్ బ్రేక్ అనాలిసిస్లో భాగంగా ఉండే ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ నిమిత్తం పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు ప్రాజెక్టు అధికారులు లేఖ రాశారు. మేడిగడ్డ నుంచి ఎత్తిపోసే నీళ్లు ఎల్లంపల్లిని దాటి మిడ్‌మానేరుకు చేరుకుంటాయి. మిడ్‌మానేరు నుంచి ఎస్సారెస్పీ పునరుజ్జీవం వైపు, దిగువ లోయర్ మానేరు, అనంతగిరి, రంగనాయక్‌సాగర్ మీదుగా కొండపోచమ్మ వైపు నీళ్లు సరఫరా అవుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని భాగాలకు ఇక్కడి నుంచే నీటి సరఫరా ఉండటంతో రిజర్వాయర్ పటిష్టత కీలకం. 5 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చినా తట్టుకునేలా ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. యాక్షన్ ప్లాన్ సిద్ధమైతే...: ఈ యాక్షన్ ప్లాన్ సిద్ధమైతే ఎగువ నుంచి వరదను అంచనా వేయడంతో పాటు ఏ స్థాయి లో వరద వస్తే రిజర్వాయర్‌లో ఎంతమేర నీటిని నిల్వ చేయాలి, ఎంతమేర దిగువకు వదలాలి? అన్న అంచనాకు రావచ్చు. ఈ వరద అంచనాలకు అనుగుణంగా దిగువ రిజర్వాయర్‌కు నీటి విడుదల చేయడం, లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడం వంటివి ముందస్తుగానే సిద్ధం చేసుకోవచ్చని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. గత ఏడాది ఆగస్టులో ఏమైందంటే... గతేడాది సైతం ఆగస్టులో మిడ్‌మానేరులో 15 టీఎంసీల మేర నీటిని నింపిన అనంతరం రిజర్వాయర్ పరిధిలో కొన్ని సీపేజీలు ఏర్పడ్డాయి. కట్టకు దిగువన ఏర్పడ్డ ఒర్రెలతోనూ సమస్యలు వచ్చాయి. దీంతో 10 కిలోమీటర్ల పొడవైన కట్టను పూర్తి స్థాయిలో పరీక్షించి, రాక్టో నిర్మాణాలను పరిశీలించి, కట్ట 2.450 కిలోమీటర్ నుంచి 2.700 కిలోమీటర్లు మేర పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు రూ.16 కోట్లు ఖర్చు చేశారు. ఈ లీకేజీల మరమ్మతుల కోసం హడావుడిగా రిజర్వాయర్‌ను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ సంఘనటకు ముందు 2016లో రిజర్వాయర్ నిర్మాణం పూర్తికాక ముందే ఎగువన ఉన్న కూడవెళ్లి వాగు, మానేరు వాగుల నుంచి ఒక్కసారిగా 2.50 లక్షల క్యూసెక్కులకుపైగా వరద పోటెత్తడంతో రిజర్వాయ ర్కు ఎడమవైపు 130 మీటర్ల మేర కట్ట తెగిపోయింది. దీంతో దిగువన ఉన్న 12 వేల మంది ప్రజలను çసురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఈ నేపథ్యం లో వరదను ఎదుర్కొనేలా ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సర్కారు నిర్ణయించింది. -
దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలి: పొన్నం
సాక్షి, రాజన్న సిరిసిల్లా: మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టులకు నీరు ఎలా తరిలిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ను టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టుల కన్నా ముందే ప్రతిపాదించబడిన అప్పర్ మానేరు ప్రాజెక్టుకు ఎందుకు నీటిన తరలించడం లేదన్నారు. ఇది మీ అసమర్థతనా లేక ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నారా అని మండిపడ్డారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. (నిర్మల.. యాక్సిడెంటల్ మినిస్టర్!) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పర్ మానేరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని చెప్పే మీరు, తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 6 ఏళ్లు గడిచినా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకపోతే ఎవరిది బాధ్యత అని ధ్వజమెత్తారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ ఎదురుదాడి కాకుండా, అప్పర్ మానేరు ప్రాజెక్టు పర్యటనకు వచ్చి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. లేకపోతే కాంగ్రెస్ పక్షాన కార్యాచరణ రూపొందిస్తామని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి పుర్వవైభవం వస్తుందని పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు. -
‘అనంతగిరి’కి గోదారమ్మ
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇప్పటికే మొదటి, రెండో దశ ఎత్తిపోతల ద్వారా మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ నుంచి మిడ్‌మానేరు (రాజరాజేశ్వరి) రిజర్వాయర్‌కు చేరుకున్న గోదావరి జలాల ప్రయాణం కొండలు, కోనలు, వాగులు, వంకలు, కాల్వలు, సొరంగ మార్గాలు దాటుకుంటూ కాళేశ్వర గంగమ్మ (గోదావరి), అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్ చేరింది. బుధవారం మిడ్‌మానేరు దిగువన పంప్‌హౌస్‌లోని ఒక మోటార్ ద్వారా నీటిని అనంతగిరి తరలించే ట్రయల్ రన్ ప్రక్రియ విజయవంతమైంది. 164.15 కి.మీ. ఎగువకు గోదావరి నీళ్లు ప్రయాణించాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు 10వ ప్యాకేజీ పూర్తయినట్లయ్యింది. ఈఎన్సీ హరిరామ్, నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ ఆనంద్ పర్యవేక్షణలో 106 మెగావాట్ల (1.40 లక్షల హెచ్‌పీ) సామర్థ్యంగల మోటారు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని మధ్యాహ్నం 1.30 గంటలకు ఎత్తిపోసింది. ఇక్కడ నుంచి నీటిని రంగనాయక్‌సాగర్ మీదుగా ఈ నెల 25 నాటికి గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌కు చేరనున్నాయి. 90 మీటర్లు ఎగిసిపడిన జలాలు.. మధ్యమానేరు జలాశయం నుంచి 3.50 కి.మీ. కాలువ ద్వారా నీరు ఒబులాపూర్ చేరింది. అక్కడి నుంచి 7.65 మీటర్ల సొరంగ మార్గం ద్వారా తిప్పాపూర్ సర్జిపూల్ (మహాబావి)లోకి చేరాయి. అక్కడ ఏర్పాటు చేసిన 106 మెగావాట్ల సామర్థ్యంగల మోటార్ ద్వారా 90 మీటర్ల ఎత్తునకు నీటిని ఎత్తిపోశారు. దీంతో అనంతగిరికి నీరు చేరింది. సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి దశలో మేడిగడ్డ, అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నుంచి నీరు ఇప్పటికే ఎల్లంపల్లి చేరగా రెండో దశలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు తరలించారు. గతేడాది నవంబర్ నుంచి మిడ్‌మానేరులో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ నాలుగో దశ ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభం కాలేదు. మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌కు తరలించాలంటే అనంతగిరి గ్రామాన్ని ఖాళీ చేయాల్సి ఉన్నా అక్కడ కోర్టు కేసుల కారణంగా అది సాధ్యపడలేదు. అయితే ఇటీవల నిర్వాసితుల తరలింపు ప్రక్రియను వెంటనే చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆగమేఘాలపై ఎస్సీ కాలనీని ఖాళీ చేయించారు. అయినప్పటికీ మరో పదిగృహాలు ఇంకా ఖాళీ చేయాల్సి ఉంది. ఆ గృహాలకు ఇబ్బంది లేకుండా 3.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంగల అనంతగిరిలోకి ప్యాకేజీ–10లోని 4 మోటార్ల ద్వారా 0.8 టీఎంసీల నీటిని తరలించాలని ముఖ్యమంత్రి మంగళవారం రాత్రి ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్‌ను ఆదేశించారు. దీంతో హుటాహుటిన బుధవారం ఉదయం 106 మెగావాట్ల సామర్థ్యంగల ఒక మోటార్ ద్వారా తొలి ఎత్తిపోతలు చేశారు. ఇది విజయవంతం కావడంతో ఆ మోటార్‌ను 10 గంటలపాటు నిరంతరాయంగా నడిపించి రాత్రికి రెండో మోటార్ ఆన్ చేశారు. గురు, శుక్రవారాల్లో మరో రెండు మోటార్లను సైతం నడిపించి మొత్తంగా 0.8 టీఎంసీ నీటిని అనంతగిరికి తరలిస్తారు. అనంతరం అనంతగిరి నుంచి ప్యాకేజీ–11లోని 134.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటార్ల ద్వారా నీటిని రంగనాయక్ సాగర్‌కు తరలిస్తారు. ఈ పంపులన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయి. రంగనాయక్ సాగర్‌కు ఈ వారంలోనే నీటిని తరలించే ప్రక్రియ మొదలవుతుందని, మరో నాలుగైదు రోజుల్లో 3 టీఎంసీల ఈ రిజర్వాయర్‌ను నింపుతామని ఈఎన్సీ హరిరామ్ తెలిపారు. 25 నాటికి కొండపోచమ్మకు.. రంగనాయక్ సాగర్ నుంచి నీటిని గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించేలా ప్యాకేజీ–12లో 16.18 కి.మీ. టన్నెల్ పనులు పూర్తికాగా 8 పంపుల్లో అన్నీ సిద్ధమయ్యాయి. ఇదే ప్యాకేజీలో ఉన్న కొమరవెల్లి మల్లన్నసాగర్ పనులు మొదలయ్యాయి. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉండటంతో రిజర్వాయర్ పనులు పూర్తికాకున్నా 18 కి.మీ. మేర ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్యాయర్‌కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలించేలా ప్యాకేజీ–13 పనులు పూర్తవ్వగా, ప్యాకేజీ–14లో రెండు పంప్‌హౌస్‌ల్లోని ఆరేసి మోటార్లను సిద్ధం చేశారు. అయితే వాటికి విద్యుత్ కనెక్షన్ పనులు మరో నాలుగు రోజుల్లో పూర్తవుతాయని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. ఇక్కడి నుంచి 15 టీఎంసీల సామర్థ్యంగల కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించనున్నారు. ఈ నెల 25 నాటికి కొండపోచమ్మకు గోదావరి జలాలు చేరతాయని, కనీసంగా 240 కిలోమీటర్ల గోదావరి తరలి రానుందని ఈఎన్సీ హరిరామ్ వెల్లడించారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు.. గోదావరి జలాలు అనంతగిరికి చేర్చే ప్రక్రియ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అనంతగిరి నిర్వాసితులను అధికారులు ఖాళీ చేయించారు. నీరు రావడంతో మిగతా వాళ్లు ఊరు విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ గోపాలకృష్ణ, డీఈఈ దేవేందర్, తహసీల్దార్లు రాజిరెడ్డి, ప్రసాద్, ప్రాజెక్టు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. కేసీఆర్ పర్యవేక్షణలోనే పనుల పూర్తి ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణ, ప్రోత్సాహంతోనే నాలుగో దశ పూర్తయింది. ఆసియాలోనే అతిపెద్దదైన 92 మీటర్ల లోతైన సర్జ్‌పూల్ నుంచి నీటిని 101.20 మీటర్లు ఎత్తి అనంతగిరికి తరలించే ట్రయల్ రన్ బుధవారం పూర్తయింది. సీఎం సూచనల మేరకు ఈ నెలాఖరుకు కొండపోచమ్మ సాగర్‌కు కాళేశ్వరం జలాలు చేరతాయి. – హరిరామ్, ఈఎన్సీ -
ఇప్పుడంతా మారిపాయె..
కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలతో నిండిన మిడ్‌మానేరు (శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్)కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు డిసెంబర్ 30న కుటుంబ సమేతంగా జలహారతి పట్టారు. అవిభాజ్య కరీంనగర్ కరువు పీడకు శాశ్వత పరిష్కారం చూపే మిడ్‌మానేరు జలాలను చూస్తే కలలుకన్న తెలంగాణ కళ్ల ముందే ఆవిష్కృతం అయిందని పేర్కొన్నారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల గతంలో ఈ ప్రాంతమంతా ఎడారిని తలపించేదని, ధవళేశ్వరం ప్రాజెక్టుకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మూలవాగుకు పైన నిమ్మపల్లి ప్రాజెక్టును సమైక్య పాలకులు ఉద్దేశపూర్వకంగా ఆపారని, దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని తన పర్యటన సందర్భంగా గుర్తుచేశారు. ‘ముల్కి పాయె... మూట పాయె... మూలవాగు నీళ్లుపాయె’ అని తెలంగాణ ప్రజలు పాటలు పాడుకున్న సందర్భాల అనుభవాలను పంచుకున్నారు. కరువులతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు వలసలు పోతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే అవి పరిష్కారం కావని గతంలో గోడలపై జిల్లా కలెక్టర్ రాయించాల్సి వచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కాళేశ్వరం ఎత్తిపోతలతో పరిస్థితి పూర్తిగా మారిందని, మేడిగడ్డ నుంచి లోయర్ మానేరు వరకు 140 కిలోమీటర్ల మేర గోదావరి సజీవ జీవధారగా మారిందంటూ హర్షం వ్యక్తం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు కలిపి మొత్తంగా 100 టీఎంసీల మేర గోదావరి జలాలు నిల్వ ఉండటం, దీంతో భూగర్భ మట్టాలు గణనీయంగా పెరగడంతో ఆయకట్టు రైతుల్లో నెలకొన్న సంతోషాలను జిల్లా మంత్రి కేటీఆర్, కమలాకర్, ఈటల రాజేందర్ తదితరులతో కలసి పంచుకొని మురిసి పోయారు. ఈ సందర్భంగా మూలవాగు, మిడ్ మానేరు నీళ్లు కలిసే చోట బ్రిడ్జిపై కాసేపు గడిపిన ముఖ్యమంత్రి... పుష్కలమైన నీళ్లను చూసి తన్మయత్వం చెందారు. మిడ్ మానేరు ప్రధాన డ్యామ్ గేట్ల వద్ద గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు... జలహారతి ఇచ్చారు. తన అలవాటు ప్రకారం నీళ్లలో నాణేలు వేసి నమస్కరించారు. మిడ్ మానేరు రిజర్వాయర్‌కు పూజలు చేసే ముందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించిన ముఖ్య మంత్రి... దేవాలయంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దేవాలయమంతా కలియతిరిగి సంప్రదాయం ప్రకారం మొక్కులు చెల్లించారు. రాజన్నకు రెండు కోడెలు సమర్పించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మట్లాడిన ముఖ్యమంత్రి, మిడ్‌మానేరు సజీవంగా ఉంటుందని చెబితే... కొందరు సన్నాసులు వెకిలిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంపై తమ పార్టీకున్నంత కమిట్మెంట్ ఏ పార్టీకి ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే జిల్లావ్యాప్తంగా మానేరు నదిపై 29 చెక్‌డ్యాంలు, మూలవాగుపై 10 చెక్‌డ్యాంలు నిర్మించేందుకు టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన మేరకు జనవరి 3న ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో కరీంనగర్‌కు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌తో కలిపి జిల్లా చెక్‌డ్యామ్‌లపై సమీక్షించారు. జిల్లాలో 41 చెక్‌డ్యామ్‌ల ఆమోదానికి రూ.580కోట్లతో పనులు చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రతి ఏటా చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు సైతం కేటాయిస్తామని ప్రకటించారు. -
రాష్ట్ర ప్రగతి అంటే అప్పు చేయడమా: జీవన్ రెడ్డి
సాక్షి, కరీంనగర్ : అధికార పార్టీ ప్రచార ఆర్భాటాలకు పరిమితం అవడంతో మిడ్ మానేరు ప్రాజెక్టు మూడేళ్ళు ఆలస్యంగా నిర్మాణం జరిగిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సాంకేతిక పరిజ్ఞానం లోపంతోనే కట్ట తెగిందని ఆయన విమర్శించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మిడ్ మానేరు ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టని, దీనిపై భిన్నాభిప్రాయాలు లేవని అన్నారు. వరద కాలువ ద్వారా ఎల్‌ఎమ్‌డీని నేరుగా నింపుకునే అవకాశం ఉండేదని తెలిపారు. కాళేశ్వరం ద్వారా 70 -80 లక్షల ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. అంత సాగవలంటే వాటి కోసం 800 టీఎంసీలు కావాలని తెలిపారు. ప్రస్తుత నీటితో 18 లక్షల ఎకరాలకు సాగు నీరందించవచ్చని అన్నారు. ఒక్క అదనపు ఎకరం ఆయకట్టు వినియోగంలోకి రాలేదని దుయ్యబట్టారు. ఎస్సీర్‌ఎస్పీ వరద నీటితో మిడ్ మానేరు నింపే అవకామున్న ఆ పని చేయలేదని విమర్శించారు. ఎఎస్సార్‌ఎస్పీ నుంచి ఎల్ఎండీ నేరుగా నింపడానికి రూ. 50 నుంచి 60 కోట్లు ఖర్చవుతుందని, ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మానేరు, మూల వాగుల మీద చెక్ డ్యామ్‌ల నిర్మాణాన్ని ఎవరు వద్దనడం లేదని, ఇప్పటి వరకు అప్పర్ మానేరు ఎందుకు నింపలేదని ప్రశ్నించారు. ఎల్లంపల్లి ఎగువన ఎస్సారెస్పీ దిగువన గోదావరి నది గర్భంలో బ్యారేజీలు నిర్మిస్తే 50 నుంచి 100 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి అంటే రూ. 2 లక్షల 40 కోట్ల అప్పు చేయడమా అని ప్రశ్నించారు. కడెం ప్రాజెక్టు ప్రతి ఏటా ఓవర్ ఫ్లో అవుతుందని, ఎల్లంపల్లి ఎగువన 5 నుంచి 6 బ్యారేజీలు నిర్మించవచ్చని తెలిపారు. విషయ పరిజ్ఞానం లేదని సీఎం విమర్శించడం సరి కాదని, ఎవరికీ విషయ పరిజ్ఞానం లేదో సీఎం అర్థం చేసుకోవాలని సూచించారు. హరీష్ రావు ఆనాడు గోదావరి నదిపై బ్యారేజీలు నిర్మించడానికి రిటైర్ చీఫ్ ఇంజినీర్ హనుమంతరావుతో చర్చించారని గుర్తు చేశారు. -
400 చెరువుల్లో... గోదావరి గలగలలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలతో రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపిన ప్రభుత్వం చెరువులను నింపేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే లోయర్ మానేరు డ్యామ్ కింద చెరువులను నింపించిన ప్రభుత్వం..వందకు వంద శాతం చెరువులను నింపే పనిలో పడింది. వీటితో పాటే మిడ్‌మానేరు పరిధిలోని చెరువులతో పాటే, మిడ్‌మానేరు దిగువన కొండపోచమ్మసాగర్ వరకు ఎన్ని వీలైతే అన్ని చెరువులకు నీళ్లందించి, వాటి కింది ఆయకట్టును స్థిరీకరించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఎస్సారెస్పీ స్టేజ్–2 చెరువులకు జలకళ.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లుగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి అటునుంచి మిడ్‌మానేరు వరకు ఎత్తిపోసిన విషయం తెలిసిందే. దీంతో మేడిగడ్డ మొదలు మిడ్‌మానేరు వరకు గోదావరి అంతా జలకళను సంతరించుకుంది. మిడ్‌మానేరులోకి ఈ సీజన్లో మొత్తంగా 52 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, అందులోంచి 30 టీఎంసీల నీటిని లోయర్ మానేరు డ్యామ్‌కు తరలించారు. ఆ నీటిని వదిలి తొలిసారిగా ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద ఉన్న చెరువులను నింపే ప్రక్రియ గడిచిన రెండు నెలలుగా సాగుతోంది. స్టేజ్–2లో మొత్తంగా 681 చెరువులు నింపాల్సి ఉండగా, ఇప్పటికే 586 పూర్తయ్యాయి. మరో 78 చెరువులను ప్రస్తుతం నింపే ప్రక్రియ కొనసాగుతుండగా, మరో 17 నింపాల్సి ఉంది. వీటి నీటి నిల్వ సామర్థ్యం 8.63 టీఎంసీలుగా కాగా, ఇప్పటికే నిండిన చెరువులతో వాటి నిల్వ 8.10 టీఎంసీలకు చేరింది. ప్రస్తుత యాసంగిలో స్టేజ్–2 కింద ఉన్న 3.97 లక్షల ఎకరాల్లో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం మిడ్‌మానేరు, లోయర్ మానేరులు నిండుగా ఉండటంతో నిర్దేశించిన ఆయకట్టుకు నీరందించడం పెద్ద కష్టం కాదని ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. ఇక మిడ్‌మానేరు సైతం పూర్తి సామర్థ్యంతో నిండి ఉంది. ఈ ప్రాజెక్టు కింద నిర్దేశించిన 80 వేల ఎకరాల ఆయకట్టులో 25 వేల ఎకరాలకు ఈ సీజన్లో నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ఆయకట్టుకు నీరిస్తూనే మరో 50 చెరువులను పూర్తి స్థాయిలో నింపాలని సీఎం కేసీఆర్ సోమవారం ప్రాజెక్టు పర్యటన సందర్భంగా అధికారులను ఆదేశించారు. అనంతగిరి ఖాళీ అయితే... ఇక దీంతో పాటే మిడ్‌మానేరు కింద ఉన్న అనంతగిరి గ్రామాన్ని త్వరగా ఖాళీ చేయించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఈ గ్రామం ఖాళీ అయితే అనంతగిరి, రంగనాయక్‌సాగర్ రిజర్వాయర్లను నింపడంతో పాటు కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించవచ్చు. ఇలా నీటిని తరలించే క్రమంలో రంగనాయక సాగర్ కింద సిద్దిపేట జిల్లాలో 50, సిరిసిల్ల జిల్లాలో 70 చెరువులు నింపుతూ, కొండపోచమ్మ వరకు మొత్తంగా 400 చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిని ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో నింపే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. మొత్తంగా ఇప్పటికే నింపిన చెరువులు, కొత్తగా నింపేవి కలిపి మొత్తం వెయ్యికి పైగా చెరువులను గోదావరి జలాలతో నింపే కసరత్తు వేగంగా జరుగుతోంది. -
కాళేశ్వర గంగకు సీఎం జలహారతి
సిరిసిల్ల/మేడ్చల్‌రూరల్/బోయినపల్లి(చొప్పదండి)/వేములవాడ: కాళేశ్వర గంగమ్మను చూసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పులకించిపోయారు. సోమవారం కుటుంబసభ్యులతో కలసి హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల మానేరు వంతెన వరకు చేరిన గోదావరి జలాలకు వేదమూర్తుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేశారు. సిరిసిల్లను తాకిన జలాలను చూసిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బోయినపల్లి మండలం మానువాడ వద్ద రూ.690.18 కోట్లతో నిర్మించిన మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించారు. 25.873 టీఎంసీల నీటి నిల్వతో నిండుకుండలా ఉన్న జలాశయం వద్ద జలహారతి పట్టారు. మిడ్ మానేరు జలాశయం 2006లో ప్రారంభం కాగా, పలు కారణాల వల్ల పనులు ఆగిపోయాయి. అయితే 2016 తర్వాత సీఎం ప్రత్యేక చొరవతో మిడ్ మానేరు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఎస్సారెస్పీ వరద కాలువ, ఎల్లంపల్లి జలాశయం నుంచి గోదావరి నీటిని మిడ్ మానేరులో నింపేందుకు చర్యలు తీసుకున్నారు. నవంబర్ 8 నుంచి ఎల్లంపల్లి నీటిని గాయత్రి పంపుహౌస్ ద్వారా ఎత్తిపోయడంతో మిడ్ మానేరు పూర్తిస్థాయిలో నిండింది. జలకళతో ఉట్టిపడుతున్న జలాశయానికి సీఎం కేసీఆర్ పూజలు నిర్వహించారు. సిరిసిల్ల మెట్ట ప్రాంతానికి కాళేశ్వరం జలాలు చేరడంతో సీఎం కేసీఆర్ పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, జెడ్పీ చైర్పర్సన్లు న్యాలకొండ అరుణ, కనుమల విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్హెగ్గే తదితరులు పాల్గొన్నారు. సోమవారం సిరిసిల్ల వంతెనపై గోదావరి జలాలకు పూజలు చేస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో సీఎం కేసీఆర్ దంపతులు, వినోద్‌కుమార్ సీఎం వెంట ఈటల కుటుంబీకులు సిరిసిల్ల పర్యటనకు వెళ్తూ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబీకులను వెంట తీసుకుని వెళ్లారు. తన పర్యటన సందర్భంగా కుటుంబంతో సహా రావాలని కేసీఆర్ కోరారు. దీంతో మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో ఉండే మంత్రి ఈటల రాజేందర్.. శామీర్‌పేటలో ఈటల భార్య జమున, కూతురు నీత, అల్లుడు అనూప్‌తో కలసి కేసీఆర్ బస్సు ఎక్కారు. సరిగ్గా పదేళ్లలో.. తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ 2009 నవంబర్ 8న సిరిసిల్ల మానేరు వంతెనపై బట్టలు మార్చుకుంటూ.. పని ఒత్తిడితో కనిపించారు. మళ్లీ అదే వంతెనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు.. అధికారులతో మిడ్ మానేరు బ్యాక్ వాటర్‌కు పూజలు చేశారు. పదేళ్ల కిందట రాష్ట్ర సాధన ఉద్యమంలో బిజీగా ఉన్న సమయంలో కేసీఆర్ సిరిసిల్లలో బస చేసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల మీదుగా హైదరాబాద్ వెళ్తూ.. ఢిల్లీకి విమానంలో వెళ్లే హడావుడిలో మానేరు వంతెనపై బట్టలు మార్చుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను సిరిసిల్ల ప్రజలు సోమవారం గుర్తు చేసుకున్నారు. సీఎంకు నిరసన సెగ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని నీలోజిపల్లి గ్రామానికి చెందిన మహిళలు నిరసన తెలిపారు. ఆర్అండ్ఆర్ కాలనీ నుంచి రోడ్డుపైకి ఊరేగింపుగా వస్తున్న మహిళలను, యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిరసన కారులకు తోపులాట జరిగింది. మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణ గ్రామమైన మాన్వాడ వాసులు సీఎం పర్యటనకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో పలువురికి ప్యాకేజీ డబ్బులు అందాల్సి ఉన్న నేపథ్యంలో తమ సమస్యలు సీఎంకు విన్నవించుకుందామని అనుకున్న వారికి నిరాశ ఎదురైంది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని సీఎం పర్యటనను అడ్డుకుంటామన్న కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. రాజన్నను దర్శించుకునేందుకు వేములవాడకు వెళ్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ నేతలు వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అడ్డుకునేందుకు యత్నించారు. పరిస్థితి గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలకు గాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడ దర్శనానికి సీఎం బస్సులో వెళ్తుండగా, ఆయనను చూసేందుకు సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఓ చోట పేర్చిన విద్యుత్ స్తంభాలపై 20 మంది మహిళలు కూర్చున్నారు. సీఎం బస్సు రావడంతో ఒక్కసారిగా అందరూ లేచి నిల్చోవడంతో స్తంభాలు అదుపుతప్పి పక్కకు కూలాయి. దీంతో నక్షత్ర(19), వెంకాయమ్మ(35)లకు తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తున్న సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో కలసి సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, వీటీడీఏ వైస్‌చైర్మన్ పురుషోత్తంరావు, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు స్వామివారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అనంతరం రాజన్నగుడి చెరువులో చేపట్టే అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి వీటీడీఏ అధికారులకు పలు సూచనలు చేశారు. -
కలగన్న తెలంగాణ కన్పిస్తోంది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘తెలంగాణ రాష్ట్రం సాకారమైతే గోదావరి డెల్టా కన్నా అద్భుతంగా ఉంటుందని 2001 ఏప్రిల్‌లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో తొలి సింహగర్జన సభలో నేను చెప్పిన. కచ్చితంగా నిజాయితీ ఉన్న పోరాటం విజయం సాధిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. ఈరోజు ఆ కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మిడ్‌మానేరు ప్రాజెక్టు మీద నిల్చొని పూజ చేస్తున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. జీవితంలో గొప్ప సఫలత్వం సాధించినట్లు అనుభూతి కలిగింది’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం మిడ్‌మానేరును సందర్శించిన అనంతరం కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కలగన్న తెలంగాణ ఇప్పుడు కనిపిస్తోందని భావోద్వేగంతో చెప్పారు. సమావేశంలో కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ఎంత ఆపినా ఆగలేదు.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు ఆపేందుకు వందల కేసులు వేసిన్రు. మిడ్‌మానేరుపైనా వేస్తున్నరు. చిల్లర రాజకీయ ఆటంకాలు ఉన్నా మా ప్రయత్నాలు ఆగలేదు. ఎవరూ ఏ ఆటంకం తలపెట్టినా మేం పురోగమిస్తూనే ఉంటం. కాళేశ్వరం ప్రాజెక్టుతో రెండు పంటలు కలిపి 75 నుంచి 80 లక్షల ఎకరాల పంట పండుతుంది. కాళేశ్వరం పరిధిలో ఇప్పుడు కళకళలాడుతున్న రాజరాజేశ్వర స్వామి జలాశయం, లోయర్ మానేరు జలాశయం ఎప్పుడూ నిండుకుండలా ఉంటయి. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, మల్లన్న సాగర్ నీటి ఖజానాలుగా ఉంటయి. ఎక్కడ నీరు తగ్గినా మిడ్‌మానేరు ఆదుకుంటది. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకే గాక, హైదరాబాద్‌కు, ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, మిషన్ భగీరథకు నీరు వెళ్తుంది. కరువు కాటకాలకు మారుపేరుగా ఉన్న కరీంనగర్ జిల్లా కాకతీయ కాల్వ, వరద కాల్వ, మానేరు, కాళేశ్వరం డ్యాంల నీటితో పాలుగారే జిల్లాగా జూన్ తర్వాత మనం చూడబోతున్నాం. రాష్ట్రంలో అధికారికంగా 24 లక్షల పంపుసెట్లు రాష్ట్రంలో ఉన్నాయి. అనధికారికంగా మరో మూడు లక్షల పంపు సెట్లు ఉంటాయి. భూగర్భ జలాలు పెరగడంతో బోర్లకు ఉపయోగకరంగా ఉంటుంది’. కమిట్మెంట్ మాకే ఉంది.. రాష్ట్రం మీద కమిట్మెంట్ మాకే ఉంది. ఉద్యమకారులం, రాష్ట్రాన్ని సాధించినం. రాష్ట్రాన్ని ఎక్స్‌రే కళ్లతో చూసినం. రాష్ట్రం మీద టీఆర్ఎస్కు ఉన్న బాధ్యత ఇతర ఏ పార్టీలకు ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా 1,230 చెక్‌డ్యాంలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అందులో సింహభాగం కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి. రూ.1,232 కోట్లతో కరీంనగర్ జిల్లాలో చెక్‌డ్యాంలు రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించాం. మానేరు నది మీద 29 చెక్‌డ్యాంలు, మూలవాగుపై 10 చెక్‌డ్యాంలు నిర్మించేందుకు టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేశాం. సోమవారం కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.చిత్రంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్ మొగులుకు మొఖం చూడొద్దు తెలంగాణ రాకముందు గోదావరి ఒరుసుకుని పారిన వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు సంపూర్ణమైన వివక్షకు గురయ్యాయి. ఈ జిల్లాల్లో కరువు ఉండకూడదు. కానీ తీవ్ర వివక్ష కారణంగా ఈ జిల్లాలు కరువుతో తల్లడిల్లాయి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అప్టూ మిడ్‌మానేరు లింక్ విజయవంతంగా పూర్తయింది. సుమారు 50 నుంచి 60 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోసుకోవడం జరిగింది. దీంతో మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యాంలు నిండుగా ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో 50 టీఎంసీలు, బ్యారేజీల్లో 60 టీఎంసీల వరకు మొత్తం 110 టీఎంసీల నిల్వ ఉంది. 20 టీఎంసీలు పోయినా నికరంగా 90 టీఎం సీలు ఉంటుంది. రైతులు మొగులుకు మొఖం చూడకుండా నిశ్చింతగా రెండు పంటలు పండించుకునే అవకాశం లభించింది. కరీంనగర్ నుంచి సూర్యాపేట జిల్లాకు నీళ్లు పోతున్నాయి. మహబూబాబాద్, డోర్నకల్, తుంగతుర్తి, సూర్యాపేట టేలెండ్ ప్రాంతాలకు నీళ్లు పోతున్నాయి. చావులు వద్దని రాసెటోళ్లు.. కరీంనగర్ జిల్లాలో 46 వాగులు ఉన్నాయి. ఇన్ని వాగులు ఉండి కూడా ఈ జిల్లా కరువు పాలైంది. ఇదే జిల్లా నుంచి దుబాయ్, గల్ఫ్, బొంబాయిలకు జనం వలసలు పోయిన్రు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు పూర్తిగా కరువు బారినపడ్డాయి. 700 నుంచి 900 ఫీట్ల వరకు బోర్లు వేసినా నీళ్లు పడలే. కరెంటు బాధలు తాళలేక జమ్మికుంటలో భిక్షపతి అనే యువకుడు చచ్చిపోయిండు . సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా రు. ‘చావులు పరి ష్కారం కాదు.. చావకండి’అని అప్పటి కలెక్టర్ గోడల మీద నినాదాలు రాయించిండు. 60 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఈ నినాదాలా మనం చూసేదని కళ్లకు నీళ్లు వచ్చినై. కరీంనగర్‌కు జీవధార.. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో లక్ష్మి, సరస్వతి, పార్వతీ బ్యారేజీలు కలిపి 145 కిలోమీటర్ల మేర గోదావరి 365 రోజులు సజీవంగా ఉంటుంది. ఇది కరీంనగర్ జిల్లాకు జీవధార. బోర్లు రీచార్జి అయినయి. అద్భుతంగా బోర్లు నిండాయని సిరిసిల్ల దగ్గర జిల్లెల్ల, నేరేళ్ల రైతులు చెప్పారు. మిడ్ మానేరు పుణ్యమా అని భూగర్భ జలాలు పైకి ఎగసిపడుతున్నాయి. కాకతీయ కాల్వ పాత కరీంనగర్ జిల్లాలో 200 కిలోమీటర్లు పారుతుంది. మెట్పల్లి దమ్మన్నపేట నుంచి హసన్‌పర్తి దాక 200 కి.మీ కాకతీయ కాల్వ రెండు పంటలకు నీళ్లిస్తుంది. ఎస్సారెస్పీ వరద కాల్వ కూడా 160 కిలోమీటర్లు జిల్లాలో ఉంది. ఈ కాల్వ మొత్తం 365 రోజులు నిండే ఉంటుంది. జిల్లాలో అన్నింటికన్న పొడవైన నది మానేరు. అప్పర్, మిడ్, లోయర్ మానేరు కలిపి 181 కిలోమీటర్ల మానేరు నది సజీవంగా ఉంటుంది. కరీంనగర్లో రూ. 530 కోట్లతో చెక్‌డ్యాంలు ‘రూ.490 కోట్లతో మానేరు మీద 210 చెక్ డ్యాంలు, రూ.40 కోట్లతో మూలవాగు మీద 10 చెక్‌డ్యాంలు కట్టుకోవాలి. జూన్‌లోగా ఇవి పూర్తి చేసి నీటితో నింపుకునేలా సిద్ధంగా ఉండాలి. లండన్ థేమ్స్ నది సజీవంగా ఉన్నట్లు మానేరు నది కూడా ఉంటుందని నేనంటే కొందరు సన్నాసులు వక్రీకరించిన్రు. కొన్ని వెకిలి పార్టీలు హేళన చేíసినయి. జూన్ తర్వాత అలా మాట్లాడిన సన్నాసులకు కూడా మనం చేసిన పని కనబడుతది. కరీంనగర్ మానేరు, మిడ్‌మానేరు, సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలను టూరిజంగా అభివృద్ధి చేస్తాం. పాపికొండల నడుమ గోదావరి కనిపించినట్లే వేములవాడ పుణ్యక్షేత్రం, మిడ్‌మానేరు కలిపి సిరిసిల్లలో కనబడుతుంది. ఏ తెలంగాణ కలగన్ననో ఆ తెలంగాణ కనబడుతంది. 46 నదులు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. పిచ్చికూతలు కూసేవాళ్లకు ఇన్ని వాగులు ఉన్నట్లు కూడా తెల్వదు. ఈడ ప్రాజెక్టులు కట్టాలని మాకు ఎవ్వరూ దరఖాస్తులు ఇవ్వలేదు. ఎవరూ పైరవీలు చేయలేదు. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి చేసినం. రాజకీయ వివక్ష లేకుండా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పూర్తి చేసినం. ఈ చెక్‌డ్యాంలను కూడా అలాగే నిర్మిస్తం’అని సీఎం కేసీఆర్ వివరించారు. -
నేను కలలు గన్న తెలంగాణ కనిపిస్తోంది: సీఎం కేసీఆర్
-
‘కొందరు సన్నాసులు వెకిలిగా నవ్వారు’
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ భౌగోళిక, సాంకేతిక అంశాలపై కనీస పరిజ్ఞానం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని కేసులు పెట్టిన పట్టించుకోకుండా పనిచేశామని, దాని ఫలితం అందరూ చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాజెక్టులు, డ్యాంలను చూస్తుంటే తాను కలలు గన్న తెలంగాణ కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం కరీంగనర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన సీఎం కేసీఆర్ తొలుత మిడ్ మానేర్‌ను సందర్శించాక కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఉత్తర తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్స్‌రేతో చూస్తోందన్నారు. ఉద్యమంలో అండగా ఉన్న కరీంనగర్ జిల్లా అభివృద్ది సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. సిరిసిల్లలో ఆకలి చావులు ఉండేవి.. ‘కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీ తో సంబంధం లేకుండా 50 టీఎంసీలు లోయర్, మిడ్ మానేరులో నింపుకున్నాం. మరో 60 టీఎంసీలు బ్యారేజీల్లో నింపే అవకాశం ఉంది. ఇకపై వర్షాల కోసం రైతు మొగులు వైపు చూడనవసరం లేదు. 2001లోనే గోదావరి తీర తెలంగాణలో కరవు ఉండకూడదని ఆకాంక్షించాం. ఆ కల కాళేశ్వరంతో నెరవేరింది. మిడ్ మానేరు చూస్తే చాలా ఆనందం వేసింది. గోదావరి నదితో పాటు అనేక వాగులున్న కరీంనగర్ జిల్లా ఇంతకాలం కరువుతో అల్లాడింది. అనేక మంది ఈ జిల్లాల నుంచి వలసలు పోయారు. సిరిసిల్లలో ఆకలి చావులుండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ జిల్లా ఎలా మారిందో చూస్తున్నారు. జిల్లాలో 140 కి.మీ గోదావరి 365 రోజులు ఇకపై సజీవంగా ఉంటుంది. భూగర్భ జలాలు పెరిగి బోర్లు బయటకు పోస్తున్నాయి. రాష్ట్రాన్ని ఎక్స్‌రేతో టీఆర్ఎస్ చూస్తుంది కాకతీయ కెనాల్ 200 కి.మీ పారుతుంది. మెట్పల్లి దమ్మన్నపేట నుంచి హసన్ పర్తి 200 కిలోమీటర్ల మేర రెండు పంటలు పండిస్తున్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద ఎస్సారెస్పీ ఎల్లప్పుడు నిండుగా ఉంటుంది. మానేరు నది జిల్లాకు మరో వరం. ఇది 181 కి.మీ. మేర పారుతుంది. ఈ నదిని గతంలో ఎవరూ పట్టించుకోలేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి పై ఏ పార్టీకి లేనంత కమిట్ మెంట్ ఉంది. రాష్ట్రాన్ని ఎక్స్‌రే తో టీఆర్ఎస్ చూస్తుంది. 1230 చెక్ డ్యాంలు రాష్ట్రంలో నిర్మించ బోతున్నాం. వీటిలో సింహ భాగం రూ. 1250 కోట్లతో పాత కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాంలు నిర్మించబోతున్నాం. మానేరుపై 29, మూలవాగుపై 10 చెక్ డ్యాంలకు వెంటనే టెండర్లు పిలుస్తాం. పాలుగారే జిల్లాగా కరీంనగర్ మారబోతోంది. మిడ్ మానేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా గొప్ప పాత్ర పోషించబోతోంది. నేను కలలు గన్న తెలంగాణ కనిపిస్తోంది ఎల్లంపల్లి, మిడ్ మానేరు, మల్లన్న సాగర్ కీలక ప్రాజెక్టులుగా ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 75-80 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండుతాయి. 40 వేల కోట్లతో రైతులు బోర్లు మోటార్లు పెట్టుకున్నారు. 26, 27 లక్షల పంపుసెట్లు రాష్ట్రంలో ఉన్నాయి. జూన్ లోగా జిల్లాలోని చెక్ డ్యాంలు పూర్తి చేస్తాం. లండన్‌లోని థేమ్స్ నదిలాగా మానేరు సజీవంగా ఉంటుందని నేను గతంలో చెబితే కొందరు సన్నాసులు వెకిలిగా నవ్వారు. వచ్చే జూన్ నాటికి ఈ ప్రాంతం ఎలా మారుతుందోమారుతుంది చూపిస్తాం. నేను కలలు గన్న తెలంగాణ కనిపిస్తోంది. 46 వాగులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రవహిస్తున్నాయి. కొంతమందికి ఇన్ని వాగులున్నాటని కూడా తెలియదు. ఈ పర్యటన నాకెంతో సంతోషం కలిగించింది మాకు ఎవరూ దరఖాస్తు చేయకున్నా రాష్ట్రం మొత్తం బాగుపడాలన్న లక్ష్యంతో స్కీంలు తెచ్చాం. కాంగ్రెస్, బీజేపీలకు భౌగోళిక, సాంకేతిక, విషయ పరిజ్ఞానం లేదు. మిడ్ మానేరు ను నింపే క్రమంలో కూడా కొందరు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు. మిడ్ మానేరులో సీపేజీల గురించి అవగాహన లేకుండా మాట్లాడారు. 15 టీఎంసీలు నింపినప్పుడు కొంచెం ఎక్కువ సీపేజీ వస్తే టెస్టులు చేయించాం. ఆ సీపేజీ వచ్చిన ప్రాంతంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంట్రాక్టు పనులు గతంలో చేసాడు. కాళేశ్వరంపై ఎన్ని కేసులు వేసినా పట్టించుకోకుండా పనిచేశాం. 46 వాగులపై 210 చెక్ డ్యాంలు కడతాం. అన్ని నియోజక వర్గాల ఎమ్మెల్యేలు ఈ పనులు చేపట్టేలా చూడాలి. ఉద్యమంలో అండగా ఉన్న కరీంనగర్ జిల్లా అభివృద్ధి సాధించడం సంతోషంగా ఉంది. పెద్దపల్లి, రామగుండం టేలెండ్ ప్రాంతాలకు కూడా నీరందుతోంది. కరీంనగర్ నుంచి సూర్యాపేట జిల్లా వరకు నీరు చేరుతోంది. త్వరలోనే ఎమ్మెల్యేలతో చెక్ డ్యాంల పై సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. నేటి పర్యటన నాకెంతో సంతోషం కలిగించింది.’అంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
-
నేడు సిరిసిల్ల జిల్లాకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమ వారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 10:30 గంటలకు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మిడ్ మానేరు డ్యామ్ పరిశీలన కోసం బయలుదేరుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మిడ్ మానేరు నుంచి బయలుదేరి ఒంటి గంటకు కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టపల్లికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. -
ఆహా.. మిడ్ మా‘నీరు’!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటి తరలింపుతో శ్రీ రాజ రాజేశ్వర రిజర్వాయర్ (మిడ్‌మానేరు) నిండు కుండను తలపిస్తోంది. రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 25.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25.11 టీఎంసీల మేర నిల్వ ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు రిజర్వాయర్‌లోకి 52 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, అందులో కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసిన నీటి పరిమాణమే 46.46 టీఎంసీలుగా ఉంది. మరో 3.07 టీఎంసీ వరద నీరు కాగా, 2.45 టీఎంసీల నీరు ఎస్సారెస్పీ ద్వారా వచ్చింది. ఇప్పటికే మిడ్‌మానేరు ద్వారా లోయర్ మానేరు డ్యామ్‌కు 29.14 టీఎంసీల మేర నీటిని తరలించారు. ఎల్ఎండీ నుంచి ఎస్సారెస్పీ–2 కాల్వల ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట వరకు నీటిని తరలించి చెరువులు నింపారు. అయితే కాళేశ్వరంలో భాగంగా మిడ్‌మానేరు నుంచి నీటిని ప్యాకేజీ–10, 11, 12ల ద్వారా దిగువ అనంతగిరి, రంగనాయక్‌సాగర్ ద్వారా కొండపోచమ్మ వరకు తరలించాల్సి ఉంది. అయితే అనంతగిరి గ్రామం ఖాళీ చేయకపోవడంతో నీటి పంపింగ్ సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో మిడ్‌మానేరు కింద ఆయకట్టుకు కాల్వల ద్వారా నీటిని సరఫరా చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రిజర్వాయర్ పరిధిలో చేసే పర్యటన సందర్భంగా కాల్వలకు నీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిడ్‌మానేరు కుడి, ఎడమ కాల్వల కింద 75 కిలోమీటర్ల కాల్వల తవ్వకం చేయాల్సి ఉండగా, 60కిలోమీటర్లు పూర్తయింది. దీనికింద 80 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఈ యాసంగిలో 25వేల నుంచి 30వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు వర్గాలు వెల్లడించాయి. -
రేపు కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు(సోమవారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం ప్రగతి భవన్ నుంచి బయలుదేరి నేరుగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకుంటారు. అక్కడ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ఉత్తర తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
ఒక రిజర్వాయర్..రెండు లిఫ్టులు
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరంలో కొత్తగా అదనపు టీఎంసీ నీటిని ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు ఎత్తిపోసే ప్రణాళిక కొలిక్కి వచ్చింది. టన్నెల్ వ్యవస్థ ద్వారా నిర్మాణ ఖర్చు, గడువు పెరుగుతున్న నేపథ్యంలో ఎల్లంపల్లి దిగువన రెండు లిఫ్టులు, ఒక రిజర్వాయర్ నిర్మాణం ద్వారా పైప్లైన్ల నుంచే నీటిని ఎత్తిపోసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి మొత్తంగా రూ. 12,700 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదలశాఖ అంచనా వేసింది. మూడో టీఎంసీ ద్వారా హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం చేపట్టే కేశవాపూర్ రిజర్వాయర్‌కు నీటిని అందించడంతోపాటు సింగూరు, నిజాంసాగర్, సూర్యాపేట జిల్లా వరకు ఉన్న ఎస్సారెస్పీ స్టేజ్–2 ఆయకట్టుకు నీటిని అందించనున్నారు. నీటి లభ్యత కరువైన సంవత్సరాల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూడాలని నిర్ణయించిన ప్రభుత్వం... బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగర్ ఆయకట్టుకు నీటిని తరలించే ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా అంచనా వ్యయం రూ. 12,700 కోట్లకు చేరనుందని నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి. బుధవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించి ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. -
కందికట్కూర్‌కు ‘లీకేజీ’ భయం
ఇల్లంతకుంట (మానకొండూర్): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ గ్రామం వద్ద నిర్మించిన మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు నుంచి రెండు రోజులుగా నాలుగైదు చోట్ల నీటి ఊటలు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆనకట్ట నుంచి నీరు లీకవడంతో తమకు ముప్పేమైనా ఉంటుందా? అని గ్రామస్తులు ఆందోళనలకు గురవుతున్నారు. గతంలో బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద బోగం ఒర్రె ప్రాం తంలో బుంగపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అక్కడి మాదిరిగానే ఇక్కడ బుంగ పడుతుందని భయపడుతున్నారు. కాగా, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ సమీపంలో మధ్యమానేరు ఆనకట్ట నుంచి శనివారం మూడు చోట్ల ఊట లొచ్చాయి. దీంతో అధికారులు రాళ్లు, మట్టితో ఆ ప్రాంతాన్ని పూడ్చివేయించారు. ఆదివారం మళ్లీ రెండుచోట్ల ఊటలు రావడం ప్రారంభమైంది. ఇది చూసి గ్రామస్తులు ఆనకట్ట నుంచి వస్తున్న లీకేజీ ఊట ఎక్కడ ఉప్పెనగా మారుతుందోనని ఆందో ళన చెందుతున్నారు. సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు ఆనకట్ట వెంట నిర్మించిన కాల్వలో సీపేజీ నీళ్లు పారుతున్నాయి. నాలుగైదు చోట్ల కట్ట నుంచి నీళ్లు బయటికి వస్తున్నాయి. భయం అవసరం లేదు: శ్రీకాంత్‌రావు, ఎస్ఈ మధ్యమానేరు ఆనకట్ట నుంచి వస్తుంది సీపేజీ వాటర్ మాత్రమే. ఆనకట్టకు ప్రమాదం లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అనుకున్న స్థాయిలో కూడా రావడం లేదు. కట్ట లీకేజీపై సీఎం పేషీ ఆరా మధ్యమానేరు ఆనకట్ట లీకేజీపై సీఎం పేషీ అధికారులు ఆదివారం ఆరా తీశారు. అధికారులకు ఫోన్ చేసి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. -
వీడిన కట్ట లోగుట్టు
సాక్షి, కరీంనగర్: ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన మిడ్‌మానేరు రిజర్వాయర్ కట్ట భద్రతపై నెలకొన్న సందేహాలకు పుల్‌స్టాప్‌పడనుంది. నిండుకుండలా ఉండాల్సిన మిడ్‌మానేరు 2 టీఎంసీల నీటి నిలువలకు పడిపోవడం వెనుక రిజర్వాయర్ కట్ట పటిష్టంగా లేకపోవడమే కారణమని తేలింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, కేంద్ర ప్రతినిధి బృందం పలుమార్లు కట్టను సందర్శించి, రిజర్వాయర్ నుంచి లీకవుతున్న నీరుకు అడ్డుకట్ట వేయాలంటే ఆ ప్రాంతంలో కట్ట అడుగుభాగాన్ని పునర్నిర్మించడం ఒక్కటే మార్గమని తేల్చారు. ఈ మేరకు బోగంఒర్రె ప్రాంతంలో 200 మీటర్ల పొడవున కట్ట అడుగుభాగంలో పునాదిగా వేసిన రాతి కట్టడాల(రాక్టో నిర్మాణాలు)ను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం నుంచి పనులు ప్రారంభించిన అధికారులు శనివారం కూడా కొనసాగించారు. కట్ట అడుగు భాగంలో పదిమీటర్ల లోతు, పది మీటర్ల వెడల్పులో తవ్వకాలు జరిపి, తిరిగి పటిష్టవంతంగా మట్టితో నింపాలని నిర్ణయించినట్లు సమాచారం. చర్చనీయాంశంగా రాక్టో తొలగింపు మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట భద్రతపై గత ఆగస్టు నెలలోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆగస్టులో కురిసిన వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పెరగడంతో నీటిని దిగువన ఉన్న మిడ్‌మానేరుకు వదిలిన విషయం తెలిసిందే. ఆగస్టు 31న రాత్రి 10 గంటలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే సహకారంతో 25 గేట్లు ఎత్తి నీటిని లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేశారు. అంత అర్జెంట్‌గా నీటిని ఎందుకు విడుదల చేశారన్న అంశంపై అనుమానాలు వ్యక్తమైనా.. ఎల్లంపల్లి నుంచి మళ్లీ నీటిని నింపేందుకే అనుకున్నారు. 10 టీఎంసీల నీటిని దిగువకు వదిలిన అధికారులు మళ్లీ మిడ్‌మానేరు నింపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్ బృందం స్పందించారు. ‘మిడ్‌మానేరుకు ఏమైంది?’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించడంతో అందరి దృష్టి ప్రాజెక్టు భద్రతపై పడింది. ఈ నేపథ్యంలో లీకేజీ కాదు సీపేజీ అంటూ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి స్పందించారు. ‘సాక్షి’ దినపత్రికలో మిడ్‌మానేరు ప్రాజెక్టు భద్రత, రిజర్వాయర్ నీటిని పూర్తిగా దిగువకు వదలడం అంశాలపై వరుస కథనాలు ప్రచురించడంతో అందరి దృష్టి ప్రాజెక్టుపై పడింది. ఆసక్తి రేపిన కట్ట నాణ్యత పరీక్షలు మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట భద్రతపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో, అధికారులు ప్రాజెక్టుకు పలు పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో కట్టపైన ఫిజోమీటర్లను ఏర్పాటు చేశారు. బోగెంఒర్రె పరిసరాల్లో కట్ట నాణ్యత, భద్రత అంశాలు పరిశీలించడానికి ఢిల్లీకి చెందిన పర్సాన్ అనే సంస్థతో నీటిపారుదల శాఖ అధికారులు పలు రకాల జియో ఫిజికల్ టెస్టులు(పరీక్షలు) చేయించారు. ఇందులో భాగంగా కట్ట కింద 25 మీటర్ల లోతులో పలు చోట్ల ఎలక్ట్రికల్ సర్వే చేశారు. ఎలక్ట్రికల్ సర్వేలో భూమి అడుగు భాగానా.. తవ్వే అవసరం లేకుండా భూమి కింద 25 మీటర్ల లోపల కట్ట పరిస్థితి ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది. దీనికోసం అధికారులు కట్ట కింద ఎలక్ట్రికల్ సర్వేలు, సెప్మో రిట్రాక్టివ్(కట్ట స్కానింగ్) టెస్టులు చేశారు. దీంతో లోపల కట్ట బలంగా ఉందా..? రాక్ ఉన్నదా.. మట్టి బలంగా ఉందా.. లేదా అనే విషయాలు తెలుస్తాయి. ఈ టెస్టులన్నీ ఇటీవల పూర్తి చేశారు. టెస్టులపై ఢిల్లీ సంస్థ ఇచ్చిన నివేదిక అనంతరం డ్యాం సేఫ్టీ అధికారులు ప్రాజెక్టును సందర్శిస్తారని అధికారులు తెలిపారు. డ్యాం సేఫ్టీ అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని చర్యలకు శ్రీకారం చుట్టారు. 200 మీటర్లు వెడల్పు... 10 మీటర్ల లోతు ప్రాజెక్టు కట్ట నుంచి సీపేజీ జరుగుతున్న బోగం ఒర్రె ప్రాంతంలో 2475 నెంబర్ నుంచి 2675 నెంబర్ వరకు 200 మీటర్ల పొడవున కట్ట కింద సుమారు రాతి కట్టడాల(రాక్టో)ను తొలగిస్తున్నారు. 10 మీటర్ల లోతు, వెడల్పులో రాతి నిర్మాణాలను తొలగించి తిరిగి పనులు చేస్తున్నారు. కట్టకింద భాగంలో తొలగించడం వల్ల కట్ట కూడా దెబ్బతినే అవకాశం ఉన్నందున 200 మీటర్ల మేర పూర్తిగా కొత్త నిర్మాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాక్టో తొలగింపునకు పెద్ద మొత్తంలో జేసీబీలు, టిప్పర్లు వాడుతుతున్నారు. 200 మీటర్ల మేర కట్ట కిందనే తొలగిస్తారా? లేదా మొత్తం తొలగిస్తారా..? రాక్టో తొలగింపుల అనంతరం డ్యాం సేఫ్టీ, సెంట్రల్ డిజైనింగ్ అధికారులు ఏమంటారు..? తదితర సందేహాలపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కాగా శనివారం సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఎస్ఈ చంద్రశేఖర్, మిడ్‌మానేరు ఎస్ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ అశోక్‌కుమార్ కట్టను సందర్శించారు. కట్టకు భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు రక్షణ చర్యలు చేపట్టామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కాగా రిటైర్డ్ ఇంజినీర్ల బృందం కూడా శనివారం మరోసారి మానేరు కట్టను సందర్శించింది. 200 నుంచి 300 మీటర్ల పొడవున కట్టను పునర్నిర్మించాలని అధికారులు సూచించారు. గతంలో ఓసారి తెగిన కట్ట మిడ్‌మానేరు రిజర్వాయర్ నిర్మాణం సమయంలోనే ఓసారి గండిపడింది. 2016, సెప్టెంబర్ 24న మిడ్‌మానేరు ఎగువన కురిసిన భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఎడమవైపు కట్ట తెగింది. కట్ట తెగిన తరువాత మరింత పటిష్టంగా నిర్మించాల్సి ఉండగా, లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు జరగలేదని ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. గతంలో తెగిన ఎడమవైపే బోగం ఒర్రె ప్రాంతంలో కట్ట సీపేజీ రావడం, దానిని పునర్నిర్మించాలని నిర్ణయించి పనులు ప్రారంభించడం గమనించాల్సిన విషయం. కాగా, ఇంత జరుగుతున్నా... రిజర్వాయర్ కట్ట విషయంలో అధికారులు వాస్తవాలు తెలియజేయకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కాని విషయం. -
మిడ్‌మానేరుకు ఏమైంది..?
సాక్షి, కరీంనగర్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మిడ్‌మానేరు(శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు భద్రత చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులోకి నీటిని నింపడం, అక్కడి నుంచి దిగువకు వదలడం వంటి అంశాల్లో పారదర్శకంగా ఉండాల్సిన అధి కార యంత్రాంగం గుంభనంగా వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. 25.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మిడ్‌మానేరులోకి 2017 నుంచి నీటిని నింపుతున్నప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట తొలిసారిగా 14 టీఎంసీల నీటిని నింపారు. కానీ నింపిన నీటిని దిగువకు వదిలి 25 రోజులు కావస్తున్నా, ఇప్పటి వరకు మళ్లీ మిడ్‌మానేరులోకి గోదావరి నీటిని నింపే ప్రయత్నం చేయడం లేదు. ఒకవైపు భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోగా, మిడ్‌మానేరులోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ, దిగువన గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మిడ్‌మానేరు కట్ట సురక్షితం కాదనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ బుధవారం మిడ్‌మానేరు కట్టపైకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో చర్చించారు. మిడ్‌మానేరు కట్టపైన, కట్ట దిగువన బోరు మిషన్లతో డ్రిల్లింగ్ చేస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. మిడ్‌మానేరును ఎందుకు నింపడం లేదనే ఆయన ప్రశ్నకు అధికార యంత్రాంగం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేకపోవడం గమనార్హం. మాన్వాడ, మల్లాపూర్, కొత్తపేట, బావుపేట ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాళేశ్వరానికి గుండెకాయ మిడ్‌మానేరు కాళేశ్వరం ప్రాజక్టుకు గుండెకాయ వంటి మిడ్‌మానేరు నిండితేనే అక్కడి నుంచి ఒకవైపు లోయర్ మానేరుడ్యాం ద్వారా వరంగల్, ఖమ్మం జిల్లాలకు, మరోవైపు మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల ద్వారా మెదక్, నల్గొండ, హైదరాబాద్ వరకు కాళేశ్వరం జలాలు తరలివెళ్లడం జరుగుతుంది. ఈ క్రమంలో గత నెలలో ఎల్లంపల్లి నుంచి గోదావరి నీటిని నందిమేడారం రిజర్వాయర్ ద్వారా లక్ష్మీపూర్ పంప్‌హౌజ్ నుంచి మిడ్‌మానేరుకు వదిలారు. 25 టీఎంసీల సామర్థ్యం గల మిడ్‌మానేరులో తొలిసారిగా 14 టీఎంసీల వరకు నీటిని నింపిన అధికారులు ఆగస్టు 30న సాయంత్రం 5 గంటలకు రిజర్వాయర్ నీటిని 10వేల క్యూసెక్కుల వరకు ఎల్ఎండీకి వదలాలని నిర్ణయించారు. అప్పటికే పొద్దుపోవడంతో హుటాహుటిన రెవెన్యూ అధికారులతో చర్చించి, పోలీసుల కాపలా మధ్య రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సిరిసిల్ల ఎస్పీతో కలిసి కరీంనగర్ ఈఎన్సీ అనిల్‌కుమార్ నీటిని విడుదల చేశారు. 5 నుంచి 10 గేట్లు ఎత్తి మిడ్‌మానేరుకు నీటిని విడుదల చేస్తారని భావించగా, తెల్లవారే సరికి ఏకంగా 25 గేట్లు ఎత్తి 40వేల క్యూసెక్కుల నీటిని వదిలేశారు. ఈ క్రమంలో దిగువన ఉన్న గ్రామాల్లోని గొర్రెలు, మేకలు, కరెంటు మోటార్లు కొట్టుకుపోయాయి. రెండు మూడు రోజుల్లో ఏకంగా 10 టీఎంసీల నీటిని మిడ్‌మానేరుకు వదిలేసి గేట్లు మూసివేశారు. ప్రస్తుతం మిడ్‌మానేరు ప్రాజెక్టులో కాళేశ్వరం నీరు నింపక ముందున్న 4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వగా ఉంది. కాగా వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న 3,500 క్యూసెక్కుల నీటిని కూడా యధాతథంగా కిందికి వదులుతున్నారే తప్ప నిలిపే ప్రయత్నం చేయడం లేదు. మిడ్‌మానేరు కట్టకు లీకేజా... సీపేజా..? ‘కొత్త కుండ ఇంటికి తీసుకొచ్చినప్పుడు నిండుగా నీళ్లు నింపి ఎక్కువ సేపు ఉంచరు. కుండ గట్టిపడేదాకా నీటిని నింపి వదిలేస్తుంటారు. అలాగే మిడ్‌మానేరు విషయంలో జరిగింది’ అని ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఐఎస్ కోడ్ ప్రకారం రిజర్వాయర్‌ను రెండింట మూడొంతుల వరకు నీటితో నింపి ఆపేయాలని, ఏడాదికి కొంత చొప్పున నీటిని నింపాలని ఆయన చెప్పుకొచ్చారు. అయితే 2017లో ఈ ప్రాజెక్టులోకి 5.29 టీఎంసీ నీటిని నింపిన అధికారులు 2018లో 9 టీఎంసీలకు నింపారు. ఈ రెండు పర్యాయాలు ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఈసారి 15 టీఎంసీల వరకు నింపినట్లు చెప్పారు. అయితే అంత మొత్తం నీటిని రాత్రికి రాత్రే వదిలేయాల్సిన అవసరం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. మాన్వాడ పరిధిలోని బోగంఒర్రె పూడ్చివేసి కట్ట కట్టిన ప్రాంతంలో భారీగా నీరు పైకి లేస్తుందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ నీటి సాంధ్రత, గ్రావిటీని లెక్క కట్టేందుకు పీజో మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏ సమస్య లేకపోతే పీజో మీటర్లను భారీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మిడ్‌మానేరుకు లీకేజీ లేదని చెబుతున్న అధికారులు కేవలం సీపేజీ మాత్రమేనని దాటవేస్తున్నారు. సీపేజీ అనే సాంకేతిక పదానికి అర్థం... ఏదైనాæ ద్రవం గానీ, గ్యాస్ గానీ చిన్న చిన్న రంధ్రాల నుంచి బయటకు వెళ్లడమే. ‘నేషనల్ రివర్స్ అథారిటీ’ ఈ సీపేజీ అనే పదాన్ని ‘ప్రమాదం నుంచి నివారించేందుకు గల అవకాశం’గా పేర్కొంది. పీజో మీటర్ ద్వారా పీడన పరీక్షలు ఏదైనా ద్రవం గ్రావిటీ కన్నా ఎత్తులో పీడనం చెందితే ఎదురయ్యే సమస్యలను తెలుసుకునేందుకు పీజో మీటర్‌ను వినియోగిస్తారు. సివిల్ ఇంజనీరింగ్‌లో ఈ ప్రక్రియ సహజమే అయినప్పటికీ రిజర్వాయర్ల నిర్మాణంలో గతంలో ఎక్కడా ఉపయోగించిన దాఖలాలు లేవు. అయితే మిడ్‌మానేరు నీటిని ఎల్ఎండీకి వదిలిన తరువాత ఇరిగేషన్ అధికారులు మిడ్‌మానేరు కట్ట నాణ్యత పరీక్షల్లోనే మునిగిపోయారు. సీపేజీ జరుగుతుందని నిర్ధారణకు వచ్చిన అధికారులు కట్ట పైనుంచి 30 మీటర్ల లోతు వరకు బోర్లు వేసి, పీవీసీ పైపుల గుండా పీజో మీటర్లను ఏర్పాటు చేసి కట్ట అడుగున నీటి సాంధ్రత, పీడనాన్ని అంచనా వేసే పనిలో మునిగిపోయారు. ఇప్పటికి కట్టకు ఇరువైపులా 8 పీజో మీటర్లు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. కట్టకు దిగువన కూడా పీజో మీటర్లు ఏర్పాటు చేసి పరీక్షలు జరుపుతున్నారు. కట్ట నుంచి 2.5 కిలోమీటర్ల నుంచి 2.7 కిలోమీటర్ల మధ్య ప్రాంతంలో భూ ఉపరితలం నుంచి ‘సీపేజీలు’ జరుగుతున్నాయని గుర్తించి డ్యాం సేఫ్టీ టీం పనులు చేస్తుందని ఈద శంకర్‌రెడ్డి చెప్పారు. భూ ఉపరితలం నుంచి మట్టితో కట్ట నిర్మించిందే కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ అని, నాణ్యత లేని పనులు చేశారని కూడా ఆయన విమర్శించారు. చెరువు కట్ట నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఐడీసీ చైర్మన్ ఒప్పుకున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో మిడ్‌మానేరు కట్ట ఎంత మేరకు సురక్షితమనే ఆందోళన దిగువనున్న గ్రామాల్లో మొదలైంది. దీనిపై అధికారులు గానీ ప్రభుత్వం గానీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.