
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో హరితహారంలో పాల్గొనేందుకు వచ్చిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు మిడ్‌మానేరు నిర్వాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తమ డిమాండ్లను పరిష్కరించిన తర్వాతే ముందుకు కదలాలంటూ కొదురుపాక, నీలోజిపల్లి నిర్వాసితులు సోమవారం ఆయన్ను అడ్డుకున్నారు. ఇళ్లకు రూ.5,40,000 అందించడంతోపాటు 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులకు కటాఫ్ డేట్ లేకుండా కుటుంబ పరిహారం ఇచ్చేవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చుకున్నారు.
నిర్వాసితులకు రావాల్సిన పరిహారం ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే రవిశంకర్ హామీ ఇచ్చినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించకపోతే ఈ నెల 30న కలెక్టరేట్ ముందు మహాధర్నా చేపడతామని నిర్వాసితులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.