కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలతో నిండిన మిడ్‌మానేరు (శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్)కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు డిసెంబర్ 30న కుటుంబ సమేతంగా జలహారతి పట్టారు. అవిభాజ్య కరీంనగర్ కరువు పీడకు శాశ్వత పరిష్కారం చూపే మిడ్‌మానేరు జలాలను చూస్తే కలలుకన్న తెలంగాణ కళ్ల ముందే ఆవిష్కృతం అయిందని పేర్కొన్నారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల గతంలో ఈ ప్రాంతమంతా ఎడారిని తలపించేదని, ధవళేశ్వరం ప్రాజెక్టుకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మూలవాగుకు పైన నిమ్మపల్లి ప్రాజెక్టును సమైక్య పాలకులు ఉద్దేశపూర్వకంగా ఆపారని, దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని తన పర్యటన సందర్భంగా గుర్తుచేశారు. ‘ముల్కి పాయె... మూట పాయె... మూలవాగు నీళ్లుపాయె’ అని తెలంగాణ ప్రజలు పాటలు పాడుకున్న సందర్భాల అనుభవాలను పంచుకున్నారు.
కరువులతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు వలసలు పోతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే అవి పరిష్కారం కావని గతంలో గోడలపై జిల్లా కలెక్టర్ రాయించాల్సి వచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కాళేశ్వరం ఎత్తిపోతలతో పరిస్థితి పూర్తిగా మారిందని, మేడిగడ్డ నుంచి లోయర్ మానేరు వరకు 140 కిలోమీటర్ల మేర గోదావరి సజీవ జీవధారగా మారిందంటూ హర్షం వ్యక్తం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు కలిపి మొత్తంగా 100 టీఎంసీల మేర గోదావరి జలాలు నిల్వ ఉండటం, దీంతో భూగర్భ మట్టాలు గణనీయంగా పెరగడంతో ఆయకట్టు రైతుల్లో నెలకొన్న సంతోషాలను జిల్లా మంత్రి కేటీఆర్, కమలాకర్, ఈటల రాజేందర్ తదితరులతో కలసి పంచుకొని మురిసి పోయారు. ఈ సందర్భంగా మూలవాగు, మిడ్ మానేరు నీళ్లు కలిసే చోట బ్రిడ్జిపై కాసేపు గడిపిన ముఖ్యమంత్రి... పుష్కలమైన నీళ్లను చూసి తన్మయత్వం చెందారు.
మిడ్ మానేరు ప్రధాన డ్యామ్ గేట్ల వద్ద గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు... జలహారతి ఇచ్చారు. తన అలవాటు ప్రకారం నీళ్లలో నాణేలు వేసి నమస్కరించారు. మిడ్ మానేరు రిజర్వాయర్‌కు పూజలు చేసే ముందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించిన ముఖ్య మంత్రి... దేవాలయంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దేవాలయమంతా కలియతిరిగి సంప్రదాయం ప్రకారం మొక్కులు చెల్లించారు. రాజన్నకు రెండు కోడెలు సమర్పించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మట్లాడిన ముఖ్యమంత్రి, మిడ్‌మానేరు సజీవంగా ఉంటుందని చెబితే... కొందరు సన్నాసులు వెకిలిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంపై తమ పార్టీకున్నంత కమిట్‌మెంట్ ఏ పార్టీకి ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే జిల్లావ్యాప్తంగా మానేరు నదిపై 29 చెక్‌డ్యాంలు, మూలవాగుపై 10 చెక్‌డ్యాంలు నిర్మించేందుకు టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన మేరకు జనవరి 3న ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో కరీంనగర్‌కు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌తో కలిపి జిల్లా చెక్‌డ్యామ్‌లపై సమీక్షించారు. జిల్లాలో 41 చెక్‌డ్యామ్‌ల ఆమోదానికి రూ.580కోట్లతో పనులు చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రతి ఏటా చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు సైతం కేటాయిస్తామని ప్రకటించారు.
ఇప్పుడంతా మారిపాయె..
Published Sun, Jan 5 2020 2:00 AM | Last Updated on Sun, Jan 5 2020 2:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment