
మిడ్‌మానేరు పరిహారానికి రూ.45 కోట్లు
♦ యుద్ధ ప్రాతిపదికన పరిహార పంపిణీ
♦ పునరావాసానికి చర్యలు చేపట్టండి
♦ అధికారులకు హరీశ్‌రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మిడ్ మానేరు ప్రాజెక్టు పరిధిలో ముంపు బాధితుల పరిహారం, పునరావాస కార్యక్రమాల కోసం ప్రభుత్వం శుక్రవారం రూ.45 కోట్లు మంజూరు చేసింది. ప్రాజెక్టులో త్వరలోనే 10 టీఎంసీల నీటి నిల్వ చేయనున్న నేపథ్యంలో ఈ నిధులను విడుదల చేశారు. ఈ పరిహార చెల్లింపులను యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేయాలని ఈ మేరకు సంబంధిత ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో మిడ్‌మానేరు నుంచి 80 వేల ఎకరాలు సాగులోనికి తీసుకురావాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఓ ప్రకటనలో తెలిపారు.
ఇందుకోసం కాల్వలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. మిడ్‌మానేరు ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్య మివ్వాలని, భూనిర్వాసితుల పరిహారం, పునరావాస చర్యలకు గాను నిధులకు ఎలాంటి కొరత లేదన్నారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లే వారికి రూ.2 లక్షల పరిహారం వెంటనే అందజేయాలని కోరారు. ఏ క్షణమైనా ప్రాజెక్టులో 10 టీఎంసీల నీరు చేరనున్నందున ముంపు గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించాలని ఆదేశించారు.