ఉప్పొంగులే గోదావరి  | Kaleshwara waters that reach Crores of acres lands | Sakshi
Sakshi News home page

కోటి ఎకరాల ఆశలను మోస్తూ.. ఉప్పొంగులే గోదావరి 

Published Fri, Jun 21 2019 3:48 AM | Last Updated on Fri, Aug 30 2019 8:19 PM

Kaleshwara waters that reach Crores of acres lands - Sakshi

మేడిగడ్డ బ్యారేజ్‌

వందల కిలోమీటర్ల పొడవైన సొరంగాలు.. నూటా నలభై టీఎంసీల సామర్థ్యంగల బ్యారేజీ, రిజర్వాయర్‌లు.. వేల కిలోమీటర్ల కాల్వలు.. ప్రపంచంలోనే ఇంతకుముందెన్నడూ వాడని భారీ మోటార్లు.. కనీవినీ ఎరుగని రీతిలో మూడేళ్లలోనే నిర్మాణం.. 40 లక్షల ఎకరాలకు ఆయకట్టు.. కలగలిపి బృహత్తర ప్రణాళికతో ప్రపంచమే అబ్బురపడేలా నిర్మించిన మానవ అద్భుతం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నేడు అంకురార్పణకు సిద్ధమైంది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కల సాకారం చేయడంలో కీలక ముందడుగు వేయనుంది. నీళ్లు, నిధులు, నియామ కాలు లక్ష్యంగా తెచ్చుకున్న రాష్ట్రాన్ని హరితవనం చేస్తానన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలలకు ప్రాణంపోస్తూ మహాయజ్ఞంలా చేపట్టిన ఈ ప్రాజెక్టును ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోనుంది. అనేక అవాంతరాలు, అడ్డంకులు దాటుకొని వచ్చే నెల నుంచి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందించేందుకు సిద్ధమైంది. 

జూలై చివరికల్లా ఎస్సారెస్పీకి జలాలు.. 
గోదావరిలో వరద ఉధృతం అయ్యే నాటికి నీటిని ఆయకట్టుకు పారించేలా పనులన్నీ పూర్తి చేశారు. ప్రస్తుతం మేడిగడ్డ పంప్‌హౌస్‌లో 11 మోటార్లకుగాను ఇప్పటివరకు 10 మోటార్లు అమర్చారు. అన్నారం పంప్‌హౌస్‌లో 8 మోటార్లకుగాను 6, సుందిళ్లలో 9కిగాను 7 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే నెల రెండో వారానికి మిగతా మోటార్లు సిద్ధం చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టారు. పంప్‌హౌస్‌ పనులు పూర్తయితే గోదావరి నీళ్లు ఎల్లంపల్లికి చేరుతాయి. ఇక ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6, 7, 8 ఉండగా ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యంగల 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే ఐదు సిద్ధమయ్యాయి. ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం పూర్తయింది. ఇక ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యంగల బాహుబలి మోటార్‌ పంపులు 6 సిద్ధమయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికి, అటు నుంచి మిడ్‌మానేరుకు తరలించే నీటిని వరద కాల్వపై నిర్మిస్తున్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోని లిఫ్టుల ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటిని తరలించనున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్‌–1 కింద 9.68 లక్షలు, స్టేజ్‌–2 కింద మరో 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను దాటుకొని నీరు ఎల్లంపల్లి మీదుగా వరద కాల్వ ద్వారా మిడ్‌మానేరుకు చేరుతుంది. అయితే మిడ్‌మానేరుకు చేరక ముందే వరద కాల్వ మీద మూడు పంప్‌హౌస్‌లను నిర్మించి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని వరద ఉండే 60 నుంచి 120 రోజులపాటు ఎస్సారెస్పీకి తరలించి ఆయకట్టుకు నీరివ్వనున్నారు. 

మిడ్‌మానేరు దిగువనా అంతా సిద్ధం... 
ఇక మిడ్‌మానేరు కింద కొండపోచమ్మ సాగర్‌ వరకు ప్యాకేజీ–10, 11, 12, 13, 14 ఉండగా అవన్నీ యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్యాకేజీ–10లో అప్రోచ్‌ చానల్, గ్రావిటీ కెనాల్‌ ఇతర నిర్మాణాలతోపాటు 7.65 కిలోమీటర్ల టన్నెల్‌ పనులు పూర్తయ్యాయి. కేవలం 800 మీటర్ల టన్నెల్‌ లైనింగ్‌ మిగిలి ఉంది. ఇక్కడ 4 మోటార్లు అమర్చాల్సి ఉండగా అన్నీ పూర్తయ్యాయి. 3.5 టీఎంసీల సామర్థ్యంగల అనంతగిరి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్యాకేజీ–11లో అన్ని పనులూ పూర్తవగా 8.41 కిలోమీటర్ల టన్నెల్‌ పనులు, లైనింగ్‌ పనులను పూర్తి చేశారు. ఇక్కడ నాలుగు మోటార్లకుగాను నాలుగూ సిద్ధమవగా 3 టీఎంసీల సామర్థ్యంగల రంగనాయక్‌ సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం సైతం పూర్తయింది. ప్యాకేజీ–12లో 16.18 కిలోమీటర్ల టన్నెల్‌ పనులు ఈ నెలలో పూర్తి కానున్నాయి. ఇక్కడ ఎనిమిది పంపుల్లో నాలుగు సిద్ధమవగా నాలుగు శ్లాబ్‌ దశలో ఉన్నాయి. ఇవన్నీ వచ్చే నెల పూర్తవుతాయి. ఇదే ప్యాకేజీలో ఉన్న కొమరవెల్లి మల్లన్న సాగర్‌ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్‌ పనులు పూర్తికాకున్నా 18 కిలోమీటర్ల మేర ఫీడర్‌ చానల్‌ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా రూ. 80 వేల కోట్ల వ్యయంలో రూ. 50 వేల కోట్ల మేర పనులు ఇప్పటికే పూర్తవగా ఇందులో రూ. 30 కోట్ల మేర బ్యాంకు రుణాల ద్వారానే సేకరించారు.

వైఎస్‌ హయాంలో మొగ్గ తొడిగి.. రీ డిజైన్‌తో కొత్త అడుగు.. 
ఎగువ రాష్ట్రాల జల దోపిడీతో కృష్ణా జలాలు దిగువకు రావడమే కరువైన పరిస్థితుల్లో పుష్కలంగా లభ్యత ఉన్న గోదావరి జలాలే తెలంగాణకు శరణ్యమని అంచనా వేసిన తొలి వ్యక్తి దివంగత మహానేత వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి. సముద్రం పాలవుతున్న గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి ఉపనదులైన వార్దా, పెన్‌గంగ, ఇంద్రావతి, ప్రాణహిత నీటిని ఎక్కడికక్కడ వినియోగంలోకి తెచ్చేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల పంట పొలాలకు ఊపిరిలూదేందుకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఏకంగా 160 టీఎంసీల నీటిని మళ్లించి 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, పరిశ్రమల అవసరాలకు 16 టీఎంసీలు, హైదరాబాద్‌ జంట నగరాల తాగునీటికి 30 టీఎంసీలు, గ్రామీణ ప్రాంత తాగునీటికి 10 టీఎంసీలు వినియోగించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2008 డిసెంబర్‌ 16న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన వైఎస్‌... ఆ మర్నాడే రూ. 35,200 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో విడుదల చేశారు. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రంపై పలుమార్లు ఒత్తిడి సైతం తెచ్చారు. అయితే ఆయన మరణానంతరం ప్రాజెక్టు పనుల్లో వేగం తగ్గింది. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 16 లక్షలకు అదనంగా 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 18.87 లక్షల ఎకరాల స్థిరీకరణ చేయాలని సంకల్పించారు. అందుకు అనుగుణంగా నీటి లభ్యత అధికంగా ఉన్న మేడిగడ్డకు మార్చి దానికి కాళేశ్వరమని పేరు పెట్టారు. అప్పటి వైఎస్‌ ఆలోచనలే నేడు కాళేశ్వరం ప్రాజెక్టుగా పురుడు పోసుకుంటోంది.  

పాత డిజైన్‌కు అంగీకరించని మహారాష్ట్ర..
రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేయాలని సంకల్పించింది. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించేలా అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు 2014 జూలైలో ముంబై వెళ్లి మహారాష్ట్ర జలవనరులశాఖ మంత్రితో సమావేశమయ్యారు. కానీ అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం అందుకు çఅంగీకరించలేదు. అనంతరం సీఎం కేసీఆర్‌ స్వయంగా 2015 ఫిబ్రవరి 15న ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో సమావేశమయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తామే దీన్ని వ్యతిరేకించి ఇప్పుడెలా అంగీకరిస్తామంటూ ఆయన కూడా ఆసక్తి చూపలేదు. ఈ సమయంలోనే కేంద్ర జలసంఘం నుంచి 2015 మార్చి 4న ప్రాణహిత–చేవెళ్ల డిజైన్‌లోని తప్పిదాలను ప్రశ్నించడం మొదలు పెట్టింది. ప్రాణహిత–చేవెళ్లలో భాగంగా తమ్మిడిహెట్టి వద్ద 273 టీఎంసీల నీటి లభ్యత ఉందని ప్రభుత్వం మొదటగా డీపీఆర్‌ సమర్పిస్తే... కేంద్ర జలసంఘం దాన్ని పరిశీలించి 165 టీఎంసీలేనని తెలిపింది. ఇందులోనూ ఎగువ రాష్ట్రాలు వాడుకోవాల్సిన 63 టీఎంసీలు కలిసి ఉన్నాయని చెప్పింది. 75 శాతం డిపెండబులిటీ లెక్కన ఇక్కడ వినియోగించుకునే నీళ్లు కేవలం 80 టీఎంసీలకు మించదని, ఈ నీటితో 16.40 లక్షల ఎకరాలకు నీరివ్వలేరని తేల్చిచెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రీ డిజైనింగ్‌ తెరపైకి వచ్చింది. ప్రత్యామ్నాయాలపై అహోరాత్రులు శ్రమించి మేడిగడ్డ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్‌ ఎంపిక చేశారు. మేడిగడ్డ వద్ద 284 టీఎంసీల లభ్యత ఉందని తేల్చి అక్కడి నుంచే గోదావరి ఎత్తిపోతలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్మాణానికి మహారాష్ట్ర అనుమతి అవసరం కావడంతో ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకునేందుకు 2016 మార్చి 8న తెలంగాణ–మహారాష్ట్ర అంతర్రాష్ట్ర బోర్డును ఏర్పాటు చేశారు. సాంకేతిక అంశాలపై బోర్డులో సానుకూలత రావడంతో 2016 ఆగస్టు 23న తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, ఫడ్నవిస్‌ సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య చరిత్రాత్మక అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరింది.

పరుగులు పెట్టించిన హరీశ్‌
కాళేశ్వరం ప్రాజెక్టును ఉరుకులు పరుగులు పెట్టించి దాన్ని పూర్తి చేయడంలో మాజీ మంత్రి టి.హరీశ్‌రావు పాత్ర మరువలేనిది. ప్రతి 15 రోజుల్లో మూడు రోజులు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండి పనులు చేయించారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది ఏమాత్రం కొత్త ప్రాజెక్టు కాదని, పాత ప్రాజెక్టేనని కేంద్రాన్ని ఒప్పించడంలో కీలకపాత్ర పోషించారు. పాత ప్రాజెక్టుగా గుర్తించిన అనంతరమే కీలకమైన 9 కేంద్ర అనుమతులు మంజూరయ్యాయి. ఇక ప్రాజెక్టుల భూసేకరణ అంశంలో రెవెన్యూ, అటవీ, మైనింగ్, పోలీసు, ఇరిగేషన్‌ శాఖలను సమన్వపరచడం, వాటిపై ఏకధాటిగా 12 గంటలపాటు సమీక్షలు చేసి వాటి సేకరణ పూర్తి చేయించడం ఆయనకే చెల్లింది. 

సవాళ్లకు ఎదురేగి... 
కాలంతో పరుగులు పెడుతూ రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అదే స్థాయిలో అవాంతరాలు ఎదురయ్యాయి. ఓవైపు వర్షాలు, వరదలు, కొన్ని సార్లు తీవ్రమైన ఎండలు, మరోవైపు కూలిన సొరంగాలు, కార్మికుల కొరత ప్రాజెక్టు నిర్మాణ పనులకు సవాళ్లు విసిరాయి. మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతంలో మూడు లక్షల క్యూసెక్కులకుపైగా వస్తున్న ప్రాణహిత వరద, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించే టన్నెళ్లు కూలుతుండటం, మేడిగడ్డకు అవసరమైన కంకరను 150 కి.మీ. దూరం నుంచి సరఫరా చేయాల్సి రావడం, లారీల సమ్మె నేపథ్యంలో సిమెంట్‌ లారీలను పోలీసుల రక్షణ మధ్య తరలించాల్సి రావడం ప్రాజెక్టుకు కఠిన పరీక్షలు పెట్టాయి. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–7లోని సొరంగ పనులకు అనేక అవాంతరాలు ఎదురవగా.. విక్రంసింగ్‌ చౌహాన్‌ అనే నిపుణుడి సాయంతో పరిష్కరించారు. 
భూసేకరణ విషయంలో ఎదురైన అవాంతరాలను ఎదుర్కొని ప్రాజెక్టును పూర్తి చేశారు. 

వచ్చే ఏడాదికే ‘మూడో’ టీఎంసీ.. 
కాళేశ్వరంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేలా పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం... కొత్తగా మూడో టీఎంసీ నీటిని తీసుకునే ప్రణాళికకు ప్రాణం పోసింది. ఇందులో భాగంగా మేడిగడ్డ పంప్‌హౌస్‌ వద్ద 11, అన్నారం వద్ద 8, సుందిళ్ల వద్ద 9 మోటార్లను ఏర్పాటు చేస్తుండగా.. ఇప్పుడు అదనంగా మూడు పంప్‌హౌస్‌లలో కలిపి మరో 15 మోటార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేడిగడ్డలో 6, అన్నారంలో 4, సుందిళ్లలో 5 మోటార్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ. 7,998 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ప్రస్తుతం అది రూ. 12,392 కోట్లకు చేరుతోంది. ఇక మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్‌ వరకు పైప్‌లైన్‌ వ్యవస్థ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నీటి తరలింపునకు మూడు స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌ వరకు పైప్‌లైన్‌ వ్యవస్థ నిర్మాణానికి రూ. 4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్‌ వరకు పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ. 10,260 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మొత్తంగా ఈ నిర్మాణానికి రూ. 14,362 కోట్ల మేర వ్యయం కానుంది. ఈ పనులను వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని నిర్ణయించింది.

మున్ముందు దక్షిణ తెలంగాణకు... 
ఉత్తర తెలంగాణకే పరిమితమైన ఈ ప్రాజెక్టును.. మున్ముందు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులతోనూ అనుసంధానించనున్నారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం చూపుతూనే పూర్వ మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులతో కాళేశ్వరాన్ని అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి కాల్వ 27వ కిలోమీటర్‌ వద్ద స్లూయిస్‌ నిర్మాణం చేసి అటు నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ వ్యవస్థ ద్వారా 50 కిలోమీటర్ల దూరాన ఉండే ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించేలా చూడాలని ప్రతిపాదించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి రూ. 300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇదే సమయంలో గోదావరి జలాల గరిష్ట నీటి వినియోగం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం... మరో కొత్త ప్రతిపాదనకు నాంది పలికింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 11.39 టీఎంసీల సామర్థ్యమున్న బస్వాపూర్‌ రిజర్వాయర్‌ వరకు నీటిని తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడికి చేరే నీటిని పాలమూరులో భాగంగా జడ్చర్ల వద్ద నిర్మిస్తున్న ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌కు తరలించాలన్నది ప్రణాళిక. దీంతోపాటే కొత్తగా కాళేశ్వరం నీటిని పాలమూరు–రంగారెడ్డిలోని కేపీ లక్ష్మీదేవునిపల్లి, డిండి ప్రాజెక్టులోని శివన్నగూడెం రిజర్వాయర్‌కు తరలించే ప్రతిపాదనలను రిటైర్డ్‌ ఇంజనీర్లు ప్రభుత్వం ముందుంచారు. 

నెరవేరని జాతీయ హోదా యత్నాలు... 
కాళేశ్వరం ప్రాజెక్టుతో బహుళ ప్రయోజనాలు దక్కినా.. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసినా ఒక్క అంశంలో మాత్రం లోటు కనిపించింది. అదే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలో ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించిన దృష్ట్యా కాళేశ్వరానికి హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచీ పట్టుబట్టింది. దీనిపై అనేకసార్లు పార్లమెంటులో, ప్రధాని వద్ద ప్రస్తావించింది. నీతి ఆయోగ్‌ భేటీల్లో, కేంద్ర జలవనరులశాఖ సమావేశాల్లో అప్పటి ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌రావు ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించారు.  అయినా కేంద్రం కనికరించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పిస్తే.. రూ. 80 వేల కోట్ల వ్యయంలో 90 శాతం నిధులు కేంద్రమే సమకూర్చేది. 

మహాయజ్ఞంలో ‘త్రిమూర్తులు’.. 
తీవ్ర కరువు ప్రాంతాలు, బీళ్లు బారిన భూములకు గోదావరి నీటిని తరలించాలని సంకల్పించి ఆ దిశగా ఆలోచించిన తొలి ఇంజనీర్‌గా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చరిత్రకెక్కారు. దివంగత ఇంజనీర్‌ ఆర్‌.విద్యాసాగర్‌రావుతో కలసి ప్రాజెక్టుకు పురుడు పోసింది మొదలు అన్నీ తానే వ్యవహరించారు. అహోరాత్రులు ఈ మహాయజ్ఞాన్ని ఎలా పూర్తి చేయాలి, ఎలాంటి ప్రణాళిక ఉండాలి, ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్న దానిపై కర్త, కర్మ, క్రియ అన్నీ తానై సీఎం కేసీఆర్‌ ముందుండి నడిపించారు. ఇక రెండో వ్యక్తి ఈఎన్‌సీ హరిరామ్‌. ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్‌కు ముందు నుంచీ ఆయన చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయిలో మహారాష్ట్రతో చర్చలు, ప్రాజెక్టు అనుమతుల విషయంలో కీలకంగా వ్యవహరించారు. ఈఎన్‌సీగా ప్రభుత్వం ప్రమోషన్‌ ఇచ్చాక కేంద్ర అనుమతులన్నీ తీసుకురావడంలో ఆయన పాత్ర మరువలేనిది. దీనికితోడు మిడ్‌మానేరు దిగువన మేడారం, అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌లను పూర్తి చేయడం, మల్లన్న సాగర్‌ భూసేకరణ పూర్తిలో ఆయన పాత్రే కీలకం. కాళేశ్వరం కార్పొరేషన్‌ ఎండీగా బ్యాంకు రుణాల విషయంలో చురుకైన పాత్ర పోషించారు. కోర్టులు, ఎన్జీటీ కేసులన్నీ ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక మూడో వ్యక్తి ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు. అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌లను కేవలం మూడేళ్లలో పూర్తి చేయడం వెనుక ఆయన శ్రమ చాలా ఉంది. పనుల పూర్తికి నిరంతరం శ్రమించారు. మహారాష్ట్ర ప్రాంతంలో నిర్మాణాల పూర్తికి సమన్వయంతో వ్యవహరించి పూర్తి చేశారు. ఎల్లంపల్లి దిగువన అత్యంత క్లిష్టమైన ప్యాకేజీ–7 టన్నెల్‌ పనులను పూర్తి చేయడం, ప్యాకేజీ–6, ప్యాకేజీ–8లో మోటార్ల బిగింపులో ఎక్కడా లేని వేగం చూపడం ఆయనకే చెల్లింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement