సాక్షి, హైదరాబాద్: ‘2014 నుంచి 2018 వరకు హరీశ్‌రావు దగ్గర నీటిపారుదల శాఖ ఉంది. 2019 నుంచి ఇప్పటివరకు కేసీఆర్ దగ్గరే ఆ శాఖ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై ఇంత చర్చ జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు నోరు మెదపట్లేదు? బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఆయన ఎందుకు ఆలోచిస్తున్నారు? మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన విషయంలో మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ ప్రజల ముందుకు రావాలి’అని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
శనివారం గాంధీ భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ ప్రకారం నిర్మాణం, నిర్వహణ జరగలేదని... కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలైందని, మేడిగడ్డ కుంగిందని ఆరోపించారు. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందని చెప్పుకున్న కేసీఆర్... ఇప్పుడు జరిగిన ఘటనను చిన్నదిగా చూపి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలి అయిపోయిందన్న రేవంత్... కేసీఆర్‌ను ఓ ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించారు. కేసీఆర్ కుటుంబమే ఆర్థిక ఉగ్రవాద కుటుంబమని, ఈ ఉగ్రవాదులను కేంద్రం శిక్షించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో జరిగిన వేల రూ. కోట్ల అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్రం వెంటనే సీబీఐతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధాని మోదీ మౌనమేల?
కేంద్ర జలశక్తి పరిధిలో ఉండే కమిటీ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో తప్పు జరిగిందని చెప్పిందని, అవినీతిపరులను వదలనని చెప్పే ప్రధాని మోదీ ఈ కమిటీ నివేదిక వచ్చాక కూడా మౌనంగా ఎందుకు ఉంటున్నారని రేవంత్ ప్రశ్నించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని అడిగితే తాము అధికారంలోకి వచ్చాక తీసుకుంటామని అంటున్నారని, అంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని... కేసీఆర్‌పై చర్యలు తీసుకోబోమని చెప్పదలుచుకున్నారా? అని ప్రశ్నించారు.
తెలంగాణకు సంబంధం లేని ఇతర రాష్ట్రాల అధికారులతో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో కమిటీ వేసి కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక తెప్పించుకోవాలని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. 2014–2023 వరకు కాళేశ్వరం నిర్మాణం వెనుక హరీశ్, కేసీఆర్ ఉన్నందున వారిని పదవుల నుంచి తొలగించాలన్నారు. కాళేశ్వరం అంచనాలు, పెంచిన వ్యయంపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే డిసెంబర్ 9 తర్వాత ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని రేవంత్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment