
ఢిల్లీ పర్యటనలో రేవంత్ ఎవరిని కలుస్తున్నారో చెప్పాలి: హరీశ్‌రావు
ఢిల్లీకి కప్పం తీసుకెళ్లేందుకు కొత్త వైస్రాయ్ వచ్చారు
రేపు ఎస్‌ఎల్‌బీసీ సందర్శనకు వెళ్తాం
సాక్షి, హైదరాబాద్: తమ నాయకుడు కేసీఆర్ అంగీకరించి ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సగం మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయేవారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 36 పర్యాయాలు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రాష్ట్రానికి సాధించిందేమీ లేదని, ప్రైవేటు కార్లలో ఒంటరిగా వెళ్లి అక్కడ ఎవరితో భేటీ అవుతున్నారో చెప్పాలన్నారు. హరీశ్‌రావు మంగళవారం బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు.
‘మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించి ఆ పార్టీ ఎమ్మెల్యేలు డబ్బులు నొక్కేశారని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి చెప్పారు. ప్రతీ చిన్న విషయానికి స్పందించే సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలు దీనిపై ఎందుకు విచారణ జరపడం లేదు. కాంగ్రెస్, బీజేపీ నడుమ బంధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.
ఎల్‌ఆర్‌ఎస్‌ను పేదల రక్తం తాగే స్కీమ్‌గా ప్రతిపక్షంలో ఉన్నపుడు జనాలను రెచ్చగొట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ కోదండరాం గొంతు ఎందుకు మూగబోయింది. ఎల్‌ఆర్‌ఎస్ వసూళ్ల కోసం ౖఆషాడం సేల్, దీపావళి బొనాంజా మాదిరిగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు.
డిస్కౌంట్ల పేరిట మోసం చేస్తున్న రేవంత్ జనం దృష్టిలో ‘మిస్ కౌంట్’గా మిగిలిపోతారు. ఢిల్లీ కాంగ్రెస్‌ను సాకేందుకు గల్లీ కాంగ్రెస్ ప్రజలను బాదుతోంది. ఢిల్లీకి ఎప్పటికప్పుడు కప్పం కట్టించేందుకు కాంగ్రెస్ కొత్త వైస్రాయ్‌ను నియమించింది’ అని హరీశ్‌రావు చెప్పారు.
హౌస్ అరెస్టులు చేయకుండా చూడాల్సిన బాధ్యత
‘పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ సొరంగం కూడా తవ్వలేదని మంత్రి ఉత్తమ్ అబద్ధాలు చెప్తున్నాడు. అనేక సాంకేతిక సమస్యలు ఎదురైనా 12 కిలోమీటర్లు తవ్వడంతో పాటు డిండి, పెండ్లిమర్రి రిజర్వాయర్ పనులు 90శాతం మేర పూర్తి చేశాం. గురువారం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్ నేతలతో కలిసి ఎస్‌ఎల్‌బీసీని సందర్శిస్తాం. పోలీ సులు హౌస్ అరెస్టులు చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర అభ్య ర్థుల్లో మంచి వారిని చూసి ఎన్నుకోవాలని పిలుపునిస్తున్నాం. వానాకాలం రైతుబంధు, రెండు లక్షల ఉద్యోగాలు, కళ్యాణలక్ష్మి లో తులం బంగారం, నిరుద్యోగ భృతి, పీఆర్‌సీ, డీఏ పెండింగ్ బకాయిలు వచ్చాయని భావిస్తేనే కాంగ్రెస్‌కు ఓటేయండి లేదంటే ఆ పార్టీ అభ్యర్థులను ఓడించండి. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపి, మెడికల్ కాలేజీల స్థాపనలో అన్యా యం చేసిన బీజేపీని ఓడించాలి’ అని హరీశ్‌రావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment