
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడు ఆ కేసు ఎలా ముందుకెళ్లదో తామూ చూస్తామని సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్‌పై చర్యలు తీసుకోని అసమర్థుడు రేవంత్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన అసమర్థతను బీజేపీపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, తాము ఎక్కడ కుమ్మక్కు అయ్యామో నిరూపించాలన్నారు.
ఈ కేసును రేవంత్ వదిలిపెట్టినా.. బీజేపీ వదిలిపెట్టదని స్పష్టం చేశారు. సోమవారం రాత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీగా హైకోర్టులో కేసు వేయడమే కాకుండా, ఈ కేసును సీబీఐకు అప్పగించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. అయితే బీఆర్‌ఎస్‌తో రేవంత్ కుమ్మక్కై ఈ కేసును నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
రేవంత్ మాటల్లో ఓటమి భయం కనిపిస్తోంది
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడుచోట్లా గెలిచే అవకాశాలుండగా, పోటీచేసిన ఆ ఒక్కసీటులోనూ ఓటమి భయంతో ఒత్తిడికి గురై రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చారన్నారు. ‘రేవంత్ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో ఓటమి భయం కనిపిస్తోంది.పోలింగ్‌కు ముందే సీఎం ఓటమిని ఒప్పుకున్నారు. రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల, నిరుద్యోగులకు ఏం చేశారో రేవంత్‌రెడ్డి చెప్పాలి’అని నిలదీశారు.
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అనుకూలమే
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అనుకూలమని, ఎక్కడా తాము ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ముస్లింలను బీసీల్లో చేర్చడం బరాబర్ తప్పే. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీ కోటాలో అధికమంది కార్పోరేటర్లుగా ముస్లింలు వచ్చే అవకాశం ఉంది. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతుంది. నాకు నైతిక విలువలున్నాయి. రేవంత్ మాదిరిగా పార్టీలు మారలేదు. గంటకో మాట మాట్లాడలేదు. దయ్యం అని పిలిచిన సోనియాను దేవత అని పొగడలేదు’అని ఓ ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా అని నిలదీశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం కిషన్‌రెడ్డి బహిరంగలేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను మళ్లీ మోసగించేందుకు సిద్ధమవ్వడం సిగ్గుచేటని కిషన్‌రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment