‘అమ్మా.. డ్యాన్స్‌ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’ | 10 Year Young Boy Ends Life In Kurnool | Sakshi
Sakshi News home page

‘అమ్మా.. డ్యాన్స్‌ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’

Feb 25 2025 11:02 AM | Updated on Feb 25 2025 2:56 PM

10 Year Young Boy Ends Life In Kurnool

తండ్రి కళ్లేదుటే కుమారుడి దుర్మరణం 

 డ్యాన్స్‌ ప్రాక్టీస్‌కు వెళ్తుండగా ప్రమాదం

కర్నూలు: మరో రెండు రోజుల్లో పాఠశాలలో వేడుక ఉంది. అందులో నిర్వహించే డ్యాన్స్‌ కార్యక్రమంలో అందరినీ అలరించాలని ఆ బాలుడు ఎంతో ఎదురు చూశాడు. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. ‘అమ్మా.. డ్యాన్స్‌ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’ అని ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు విగత జీవిగా తిరిగొచ్చాడు. తండ్రి కళ్లేదుటే ఆ కుమారుడు లారీ చక్రాల కింద నలిగిపోయాడు. ఈ ఘటన ఆదోని పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 

పట్టణంలోని లంగర్‌బావి వీధికి చెందిన గురురాజ, ప్రతిభ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సత్యనారాయణ 9వ తరగతి, ద్వితీయ కుమారుడు ఆదిత్యనారాయణ (10) ఐదో తరగతి చదువుతున్నారు. గురురాజ.. మెడికల్‌ ఏజెన్సీ వృత్తి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 

ఎమ్మిగనూరు రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదిత్యనారాయణ విద్యనభ్యసిస్తున్నాడు. అకాడమీ పూర్తి కావడంతో మంగళవారం ఫెర్‌వెల్‌ పార్టీ నిర్వహించాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం కొందరు విద్యార్థులు డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఆదిత్యనారాయణ ఉదయం తన తండ్రి గురురాజతో బైక్‌పై పాఠశాలకు బయలుదేరాడు. 

మార్గమధ్యలో ఎమ్మిగనూరు రోడ్డులోని శ్రీ కృష్ణదేవాలయం సమీపంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ లారీ ఆదోని వైపు వేగంగా దూసుకువస్తుండగా తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డారు. అయితే గురురాజ ఒకవైపు పడిపోయి సురక్షితంగా ఉన్నాడు. మరోవైపు ఆదిత్యనారాయణ లారీ టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడు మృతిచెందినా లారీని నిలబెట్టకుండా డ్రైవర్‌ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లి ప్రమాద స్థలానికి చేరుకుని.. కుమారుడి జ్ఞాపకాలను తలుచుకుని రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. 

బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. తండ్రి గురురాజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. తప్పించుకున్న లారీ డ్రైవర్‌, లారీని సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

అమ్మా.. నేనేం పాపం చేశా!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement