నేరాలపై సమీక్షిస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప
సాక్షి, కర్నూలు: జిల్లాలో నమోదవుతున్న సైబర్ నేరాల సంగతి తేల్చాలని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశించారు. కర్నూలులోని రీజినల్ సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్‌ను ఆయన శనివారం సందర్శించి, సిబ్బంది పనితీరును పరిశీలించారు. సైబర్ నేరాలపై ఈ సందర్భంగా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏఏ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాల కేసుల్లో పురోగతి సాధించాలన్నారు. నేరం జరిగిన వెంటనే బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. బాధితులు మోసపోవడానికి ప్రధాన కారణం డబ్బులు పోతాయనో.. లేదా వస్తాయనో.. తొందరపడి వ్యక్తిగత వివరాలు తెలియజేస్తున్నారని, వీరి తొందరపాటును నేరగాళ్ల ఈ అవకాశంగా తీసుకుంటున్నారని చెప్పారు.
ఏ బ్యాంకు అధికారులు కూడా ఖాతాదారులకు ఫోన్ చేయరని, వ్యక్తిగత విషయాలు ఫోన్‌లో అడగరనే విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాలన్నారు. మొబైల్ టవర్ ఇన్‌స్టాలేషన్, ఓఎల్‌ఎక్స్ కార్స్, ఫేస్‌బుక్, ఆన్‌లైన్, పత్రికల్లో ప్రకటనల ద్వారా ఉద్యోగాలిప్పిస్తామని, లాట్రీ తగిలిందని, పొలాల్లో సెల్ టవర్ వేస్తున్నామని, గిఫ్ట్ తగిలిందని, ఏటీఎం కార్డ్ బ్లాక్ అవుతుందని, ఆధార్ కార్డ్ లింక్ కాలేదని, బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. తక్కువ వడ్డీ రేటుకే రుణాలిప్పిస్తామని నమ్మకం కల్పించి ముందుగానే అడ్వాన్స్ కింద డబ్బులు కట్టించుకుని తర్వాత సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి మోసాలకు పాల్పడుతున్నారన్నారు.
బ్యాంకు లావాదేవీలకు సంబంధించి సమస్యలుంటే ఖాతాదారులు నేరుగా బ్యాంకుకు వెళ్లి మేనేజర్‌ను సంప్రదించి సమస్యను నిర్ధారణ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలియని వారు పంపించిన ఇంటర్ నెట్ లింక్‌లను క్లిక్‌చేయడం ఓపెన్ చేయొద్దన్నారు. కార్యక్రమంలో ఈకాప్స్ ఇన్‌చార్జ్ రాఘవరెడ్డి, ఎస్‌ఐలు వేణుగోపాల్‌రెడ్డి, కృష్ణమూర్తి, సైబర్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.
బాణా సంచా అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోండి
బాణా సంచా అక్రమ నిల్వలు లేకుండా క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సూచించారు. దీపావళి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ, బహిరంగ ప్రదేశాల్లో బాణా సంచా కాల్చ కూడదని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పండుగను సంతోషకరంగా జరుపుకోవాలన్నారు. చిన్నారులు టపా సులు కాల్చే విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే డయల్ 100, లేదా స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలన్నారు.
దీపావళి పం డుగ పూర్తయిన తర్వాత మిగిలిన బాణా సం చాను వ్యాపారులు దుకాణాల్లో దాచుకోకుండా ఎక్కడ కొనుగోలు చేశారో అక్కడ వాటిని తిరిగి అప్పగించాలన్నారు. ఎవరూ కూడా మందుగుండు సామగ్రిని అనధికారికంగా నిల్వ చేయడం, విక్రయించడం వంటివి చేయకూడదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment