కర్నూలు (ఓల్డ్‌సిటీ): తండ్రి 1981లో పుడితే అతని కుమారుడు 1988లో పుట్టాడు. వినడానికి వింతగా ఉంది కదూ! కారుణ్య నియామకాల్లో ఓ తపాలా అధికారి చూపిన వింత లీల ఇది. ఈ లీల కర్నూలు జిల్లాలో జరిగింది. ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలోని దైవందిన్నె గ్రామ వాసి శంకరన్న నకిలీ స్కూల్ సర్టిఫికెట్‌తో 2005లో కారుణ్య నియామకం ద్వారా తపాలా శాఖలో గ్రామ డాక్ సేవక్ (జీడీఎస్) ఉద్యోగం పొందాడు. ఆ సమయంలో ఎమ్మిగనూరు సబ్ డివిజన్‌లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్టాఫీసెస్ (ఐపీవో)గా పనిచేసిన కె.హరికృష్ణ ప్రసాద్ ఆ నియామకం చేశారు.
అయితే 2019లో శంకరన్న కన్నుమూశాడు. ఇదే సమయంలో హరికృష్ణ ప్రసాద్ డివిజన్ హెడ్ (పోస్టల్ సూపరింటెండెంట్) హోదాలో ఉన్నారు. ఈ సమయంలో శంకరన్న కుమారుడు వీరేంద్రకు కూడా కారుణ్య నియామకం ద్వారా తండ్రి ఉద్యోగాన్ని హరికృష్ణ ప్రసాద్ కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు రికార్డులు పరిశీలించగా.. శంకరన్న ఇచ్చిన స్కూల్ సర్టిఫికెట్‌లో 1981లో పుట్టినట్లుగా ఉంది. కానీ అతని ఆధార్ కార్డులో 1958లో పుట్టినట్లుగా ఉంది.
ఇక వీరేంద్ర 1988లో పుట్టినట్లుగా అతని స్కూల్ సర్టిఫికెట్లు స్పష్టం చేస్తున్నాయి. సర్టిఫికెట్లలో తండ్రీ కొడుకులకు మధ్య ఏడేళ్లు మాత్రమే తేడా ఉండటంతో ఆశ్చర్యపోవడం ఉన్నతాధికారుల వంతైంది. శంకరన్నకు సర్వీసులో ప్రయోజనం చేకూర్చడం కోసం హరికృష్ణ ప్రసాద్ తప్పు చేసినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు ఆయనకు అత్యున్నత నేర అభియోగం (రూల్–14) అయిన చార్జిషీట్‌ను జారీ చేశారు. దీనిపై హరికృష్ణ ప్రసాద్‌ను వివరణ కోరగా.. తప్పులు జరుగుతాయని, దీనిని ప్రచారం చేయవద్దని అన్నారు.
చదవండి: చెత్త సేకరణపై నిఘా.. సిటిజన్ యాప్‌ను రూపొందించిన పంచాయతీరాజ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment