బ్యాంక్‌ మేనేజర్‌ సజీవ దహనం | fire in car...one died | Sakshi
Sakshi News home page

కారులో మంటలు.. ఏపీజీబీ మేనేజర్‌ సజీవ దహనం

Published Sat, Jan 6 2018 7:17 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

fire in car...one died - Sakshi

సాక్షి, బనగానపల్లె రూరల్‌: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం దద్దణాల ప్రాజెక్టు సమీపంలో శనివారం కారులో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ సత్తుపల్లి రాజేష్‌ (30) సజీవ దహనమయ్యారు. బనగానపల్లె ఎస్‌ఐ రాకేష్‌ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

విశాఖపట్నానికి చెందిన సత్తుపల్లి రాజేష్‌ కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి తొమ్మిది నెలల క్రితమే బదిలీపై ఇక్కడి వచ్చారు. కుటుంబంతో కలిసి నంద్యాల పట్టణంలో నివాసముంటూ.. వృతిరీత్యా రోజూ గార్లదిన్నె గ్రామానికి కారులో వెళ్లి వచ్చేవారు.

విధుల్లో భాగంగా శనివారం కూడా నంద్యాల నుంచి సొంత పెట్రోల్‌ కారులో గార్లదిన్నె గ్రామానికి బయలుదేరారు. దద్దణాల ప్రాజెక్టు సమీపానికి రాగానే కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అందులో ఉన్న రాజేష్‌ వాహనం డోర్‌లు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో కారులోనే సజీవదహనం అయ్యారు. ఈయనకు భార్య సాహిత్య, మూడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ రాకేష్‌ ప్రమాద స్థలానికి చేరుకొని అగ్ని మాపకశాఖ సిబ్బందితో కలిసి మంటలు ఆర్పివేశారు. మృత దేహం పూర్తిగా కాలిపోయింది. కాలిన ఎముకలను పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు  ఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement