మెదక్: రేవంత్‌రెడ్డి అనుభవిస్తున్న సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్షేనని, ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేసి, చావునోట్లో తలపెట్టి తెలంగాణ తేవటంతోనే ఇవాళ రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 420 అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు. వాటిని నెరవేర్చకుంటే మెడలు వంచుతామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై గ్రామీణ ప్రాంతాల్లో, సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామన్నా రని, ఇప్పటికే 60 రోజులు గడిచాయని గుర్తు చేశారు. దళితుల అభివృద్ధి కోసం బ్యాంకుల్లో దళితబంధు పథకం డబ్బులు వేస్తే, వాటిని ఫ్రీజింగ్‌లో పెట్టారన్నారు. రైతుబంధు డబ్బులను నేటికీ అన్నదాతలకు జమ చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని తెలిపారు. అలాగే డీడీలు కట్టిన గొల్లకురుమలు గొర్రెల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.
డిసెంబర్ 9న రూ.2 లక్షల రైతురుణ మాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటికీ అమలు చేయలేక పోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 1.52 కోట్ల మంది ఉన్నారని, వారికి రూ. 2,500 చొప్పున ఎప్పుడు వేస్తున్నారో చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలు తిరగబడతారన్నారు. బడ్జెట్ లేదని తెలిసి కూడా అధికారం చేజిక్కించుకునేందుకు నోటికొచ్చిన హామీలన్ని ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4 వేల పింఛన్‌ను ఎప్పటి నుంచి ఇస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.
వ్యవసాయానికి కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో 24 గంటలు వ్యవసాయానికి కరెంటిస్తే.. ప్రస్తుతం 14–16 గంటలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. పదవులు వస్తే బాధ్యత పెరగాలే తప్ప, ప్రతిపక్షాలను కించపరిచేలా మాట్లాడొద్దని ఒక మంత్రికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment