ఇప్పుడంతా ‘పరీక్షా’ కాలం!  | Lift Irrigation from June | Sakshi
Sakshi News home page

ఇప్పుడంతా ‘పరీక్షా’ కాలం! 

Published Sun, May 5 2019 1:51 AM | Last Updated on Fri, Aug 30 2019 8:19 PM

Lift Irrigation from June - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇది ‘పరీక్ష’ల సీజన్‌. నీటిపారుదల శాఖకు టెస్టింగ్‌ పీరియడ్‌. పంప్‌హౌస్‌లలో డ్రై, వెట్‌రన్‌ నిర్వహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కనిష్టంగా నూటా ఇరవై టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని నీటి పారుదల శాఖ దృడ సంకల్పంతో ఉంది. ఇప్పటికే ఎల్లంపల్లిలో లభ్యత ఉన్న జలాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–6 పరిధిలో పంపులు, మోటార్లకు వెట్‌రన్‌ నిర్వహించిన ఇంజనీర్లు మిగతా ప్యాకేజీల్లోని మోటార్లను సైతం డ్రై, వెట్‌రన్‌ నిర్వహించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 8వ తేదీన గానీ, 9వ తేదీన గానీ మేడిగడ్డ పంప్‌హౌస్‌ల పరిధిలో, 15వ తేదీలోపే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో, నెలాఖరుకు మిడ్‌మానేరు దిగువన ఉన్న నాలుగు ప్యాకేజీల పరిధిలోని పంప్‌హౌస్‌ల్లో డ్రై, వెట్‌రన్‌ నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  
జూన్‌ నుంచే ఎత్తిపోతలు 
గోదావరిలో జూన్‌ తొలివారం నుంచే నీటి ప్రవాహాలు మొదలవుతాయి. ప్రాణహిత నుంచి గోదావరికి ఉధృత ప్రవాహాలుంటాయి. ఈ ప్రవాహాలు పుంజు కునే నాటికి పంపులు, మోటార్లు అంతా సిద్ధం చేసి వరద కొనసాగే రోజుల్లో కనిష్టంగా రోజకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం లక్ష్యంగా పె ట్టుకున్న విషయం తెలిసింది. అందుకు తగ్గట్లే బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, కాల్వల పనులను చేస్తోంది. అత్యంత ముఖ్యమైన మోటార్ల ఏర్పాటును వేగిరం చేసింది. అత్యంత ప్రాధాన్యం గల తొలి పంప్‌హౌస్‌ అయిన మేడిగడ్డలో 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇందులో 7 ఇప్పటికే సిద్ధమయ్యాయి. మరో రెండు మోటార్లు ఏర్పాటు దశలో ఉన్నాయి. సిద్ధంగా ఉన్న మోటార్లకు ఈ నెల 8నగానీ, 9న గానీ వెట్‌రన్‌ నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయిం చారు.

ఇటీవల పంప్‌హౌస్‌ పరిధిలో పర్యటించిన ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ సైతం గోదావరిలో లభ్యతగా ఉండే నీటితో ఈ నెల 8న వెట్‌రన్‌కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వర్షాలు కురిసి నీటి లభ్యత ఏర్పడిన అనంతరం అన్నారంలోని 9 మోటార్లు, సుందిళ్లలోని మోటార్లకు వెట్‌రన్‌ చేయనున్నారు. కాళేశ్వరానికి అనుసంధానంగా ఉన్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోని మూడు పంప్‌హౌస్‌లకుగానూ రెండింటిని సిద్ధం చేసిన 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగేసి చొప్పున పంపులకు డ్రైరన్‌ నిర్వహించనున్నారు. ఈ పంప్‌హౌస్‌ల ద్వారా ఈ ఖరీఫ్‌లో కనిష్టంగా 45 నుంచి 60 టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యం విధించారు. మిడ్‌మానేరు దిగువన ఉన్న ప్యాకేజీ–10లో 106 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న 4 పంపులకు ఈ నెలాఖరున డ్రైరన్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ప్యాకేజీ–11లోని 135 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 4 మోటార్లు, ప్యాకేజీ–12లో 43 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న 8 మోటార్లకు జూన్‌లో వెట్‌రన్‌ చేసే అవకాశం ఉంది. ఇక ప్యాకేజీ–16లోని రెండు పంప్‌హౌస్‌ల్లో జూలైలో వెట్‌రన్‌ జరిగే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement