రాబోయే అసెంబ్లీ సమావేశంలో మిడ్‌మానేరు అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాబోయే అసెంబ్లీ సమావేశంలో మిడ్‌మానేరు అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మిడ్‌మానేరు ముంపు బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకు వచ్చిన లక్ష్మణ్ జిల్లా పార్టీ నేతలతో కలిసి మిడ్‌మానేరు ముంపు ప్రాంతాలైన మాన్వాడ, కట్కూర్, కొదురుపాక, రుద్రవరం గ్రామాల్లో పర్యటించారు.
ముంపు బాధితులతో సమావేశమై వారి గోడును విన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర నేతలు గుజ్జల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్‌రావు, వసంత, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. 25 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న మిడ్‌మానేరు కట్ట మూడు టీఎంసీలకే గండిపడటం శోచనీయమన్నారు.