మిడ్‌మానేరు కొత్త అంచనా 380 కోట్లు
గత అంచనాతో పోలిస్తే రూ.216 కోట్ల మేర పెరుగుదల
- ఒప్పందంలోని క్లాజ్-61 ప్రకారం ప్రస్తుత కాంట్రాక్టు రద్దు
- నీటి పారుదల శాఖ నివేదిక సిద్ధం.. రెండు నెలల్లో కొత్త టెండర్లు
సాక్షి, హైదరాబాద్: మిడ్‌మానేరు రిజర్వాయర్ నిర్మాణానికి కొత్త అంచనాలు సిద్ధమయ్యాయి. ప్రస్తుత లెక్కల మేరకు మొత్తంగా రూ.380 కోట్లు అవసరమని నీటి పారుదల శాఖ తేల్చింది. గత అంచనాతో చూస్తే దాదాపు రూ.216 కోట్ల వ్యయం అదనంగా పెరుగుతుందని లెక్కించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. అనంతరం రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ, హైపవర్ కమిటీలలో చర్చించి.. కొత్తగా పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, టెండర్లు పిలుస్తారు. శ్రీరాంసాగర్ వరద కాల్వ ప్రాజెక్టులో భాగంగా 2006లో కరీంనగర్ జిల్లాలోని మానేరు నదిపై 25.873 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభమైన విషయం తెలిసిందే. దీని ద్వారా 2.2 లక్షల ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో రూ.406.48 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు.
తొలుత రూ.339.99 కోట్లకు మూడు సంస్థలు సంయుక్తంగా దీని పనులు దక్కించుకున్నాయి. 2009 నాటికి పూర్తి చేసేలా ఒప్పందాలు జరిగాయి. అనుకున్న మేర పనులు చేయకపోవడంతో 2015 వరకు నాలుగు కాంట్రాక్టు సంస్థలకు పనుల మార్పిడి జరిగింది. 2015 వరకు కేవలం రూ.127 కోట్ల మేర పనులు మాత్రమే పూర్తయ్యాయి. తర్వాత పనులు కొంత పుంజుకున్నాయి. జలాశయం పూర్తి నీటిమట్టం 318 మీటర్లు కాగా.. ఈ ఏడాది 303 మీటర్ల వరకు పూర్తి చేసి 3.3 టీఎంసీలు నిల్వ చేయాలని నీటి పారుదల శాఖ తలపెట్టింది. అయితే అంచనాలకు మించి వరద రావడంతో ఎడమవైపు మట్టికట్ట 40 మీటర్ల మేర (150- 190 మీటర్ల మధ్య) కోతకు గురైంది. పనిలో జాప్యం, రిజర్వాయర్‌కు గండి పడిన నేపథ్యంలో పాత కాంట్రాక్టర్‌ను తొలగించి మళ్లీ టెండర్ పిలవాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కొత్త అంచనాలు తయారు చేశారు.
రూ.216 కోట్ల భారం..
ప్రాజెక్టు తొలి అంచనా వ్యయం రూ.339.99 కోట్లు కాగా.. ఇప్పటివరకు రూ.176 కోట్ల విలువైన పని పూర్తయింది. అంటే మిగతా పని విలువ రూ.164 కోట్లు. తొలుత పనులు దక్కించుకున్న సంస్థ 20 శాతం లెస్‌కు టెండర్ వేసిన లెక్కన.. ప్రస్తుతం మిగిలిన పనుల విలువ రూ.198 కోట్లు. కానీ ఇంకా పెండింగ్‌లో ఉన్న ఈ పనులకు ప్రస్తుత స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల(ఎస్‌ఎస్‌ఆర్)ను వర్తింపజేస్తుండడంతో వ్యయం రూ.380 కోట్లకు పెరుగుతోంది. అంటే గత పనుల విలువతో పోలిస్తే ఏకంగా రూ.216 కోట్ల మేర పెరుగుతోంది. ఈ రూ.380 కోట్లలో పనుల విలువ రూ.320 కోట్ల వరకు ఉండగా.. పన్నులు, ఇతరత్రా వ్యయాలకు రూ.60 కోట్లు ఖర్చవుతాయని లెక్కించారు. పెరిగిన అంచనాలకు నీటి పారుదల శాఖలోని వివిధ కమిటీల ఆమోదం అనంతరం కొత్తగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తారు. అనంతరం టెండర్లు పిలుస్తారు. దీనికి సుమారు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఇక ఒప్పందం ప్రకారం పనిచేయని ప్రస్తుత కాంట్రాక్టర్‌ను ఒప్పందంలోని సెక్షన్-61 కింద తొలగించాలని నిర్ణయించారు. ఈ సెక్షన్ కింద కాంట్రాక్టర్ బ్యాంకు గ్యారంటీ కింద ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఇచ్చేయనుండగా.. పనులు చేయని వాటి కి చెల్లింపులు నిలిపేస్తారు.