ఉదయం థియేటర్ అంటే చెన్నైలో తెలియని వారు ఉండరు. అక్కడ స్థిరపడిన తెలుగువారికి కూడా ఈ థియేటర్‌తో ఎంతో అనుబంధం ఉంది. సుమారు 40 ఏళ్లకు పైగా ఎందరికో మధురమైన క్షణాలను అందించిన ఈ థియేటర్ మరి కొన్ని గంటల్లో నేలమట్టం కానుంది. ఈ విషయం అక్కడి స్థానికులను ఎక్కువగా బాధిస్తుంది. వారందరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎన్నో సినిమాలను అక్కడ చూసి ఉంటారు. ముఖ్యంగా ఉదయం థియేటర్ అంటేనే పేదల టాకీస్ అని పేరు ఉంది. చిన్నచిన్న పనులు చేసుకునే కార్మికుల నుంచి బిచ్చగాడి వరకు సినిమా చూసేందుకు ఉదయం థియేటర్‌కు వెళ్తారు. ఫిబ్రవరి 3న ఈ టాకీస్‌ను కూల్చేస్తున్నడంతో నెట్టింట ఆ ఉదయం పేరు తెగ వైరల్ అవుతుంది.
చెన్నై ల్యాండ్‌మార్క్‌లలో ఒకటైన 'ఉదయం' ఫిబ్రవరి 3న నేలమట్టం కానుంది. చెన్నైలోని అశోక్ పిల్లర్‌లో ఉన్న ఈ థియేటర్ 1983లో ప్రారంభించబడింది. చెన్నై సిటీ సెంటర్‌లో ఉండడం వల్ల ఈ థియేటర్‌కి ఆదరణ పెరిగింది. ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉదయం థియేటర్ ప్రారంభించారు. ఇక్కడ ప్రదర్శించబడిన ఫస్ట్ సినిమా రజనీకాంత్ నటించిన 'శివప్పు సూర్యన్' (1983).
అయితే, ఇక్కడ మరో ఆసక్తికరమైన సమాచారం ఉంది. ఉదయం థియేటర్‌లో చివరిగా రన్ అయిన చిత్రం కూడా రజనీకాంత్ నటించినదే కావడం విశేషం. ఇందులో చివరిగా వెట్టయాన్ సినిమాను ప్రదర్శించారు. 50 రోజుల పాటు ఈ మూవీ రన్ అయింది. ఇందులో రజనీకాంత్, కమల్ హాసన్, ప్రభు, సత్యరాజ్ నటించిన ఎన్నో సినిమాలు 100 రోజుల పాటు కొనసాగాయి. తమిళ సినిమాలోని చాలా సన్నివేశాలను ఉదయమ్ థియేటర్‌లో చిత్రీకరించారు.
ఈ థియేటర్ చెన్నై నడిబొడ్డున ఉన్నప్పటికీ, చాలా దూరం నుంచి సామాన్యులు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ సినిమా చూసేవారు. ఇక్కడ ప్రారంభంలో టికెట్ ధర రూ.2 ఉండేదని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అయితే, వెట్టయాన్ సమయంలో రూ. 120 ఉందని తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా అత్యాధునిక హంగులతో మల్టీప్లెక్స్ స్క్రీన్స్‌తో పాటు OTT ప్లాట్‌ఫారమ్‌ల ఆధిపత్యం ఎక్కువ కావడంతో ఉదయం థియేటర్‌కి అభిమానుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీంతో ఇప్పుడు థియేటర్ మూతపడింది. ఇదే క్రమంలో కొద్దిరోజుల క్రితం చెన్నైలోని శాంతి, ఏవీఎం రాజేశ్వరి, ప్రార్థన, ఎస్‌ఎస్‌ఆర్ పంకజం, అగస్త్య థియేటర్‌లు కూడా క్లోజ్ అయ్యాయి. ఫిబ్రవరి 3న ఉదయం థియేటర్ కూల్చివేత పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అభిమానులు ఆ ప్రాంతానికి వెళ్లి ఫొటోలు దిగి షోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment