
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో బెంగళూరు 57వ సీసీహెచ్ కోర్టు జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. బెయిల్ ఇస్తున్న సమయంలో విచారణకు తప్పకుండా హాజరుకావాలని కోర్టు షరతులను మరోసారి న్యాయస్థానం గుర్తుచేసింది. అయితే, విచారణ సమయంలో దర్శన్‌కు వెన్నునొప్పి ఉందని, అందుకే రాలేదని ఆయన తరఫు వకీలు చెప్పారు. సాకులు చెప్పి కోర్టుకు హాజర్ కాకుంటే ఎలాగని జడ్జి ఘాటుగా ప్రశ్నించారు.
విచారణ ఉన్నప్పుడు నిందితులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఇలా చేయడం తప్పని మందలించారు. దర్శన్ ఇంటిలో పోలీసులు జప్తు చేసిన రూ.75 లక్షల డబ్బులను విడుదల చేయాలని న్యాయవాది మనవి చేశారు. ఐటీ శాఖ వాదనలు విన్న తరువాత పరిశీలిస్తామని జడ్జి తెలిపారు. కేసు విచారణను మే 20కి వాయిదా వేశారు. సీజ్ చేసిన మొబైల్‌ఫోన్లను తిరిగి ఇవ్వాలని దర్శన్ న్యాయవాది అర్జీ వేశారు. మొదటి నిందితురాలు, నటి పవిత్రగౌడతో పాటు ఇతర నిందితులందరూ కోర్టుకు వచ్చారు. తన సోదరునితో కలిసి పవిత్ర ఆర్‌ఆర్ నగర ఇంటి నుంచి కారులో కోర్టుకు వచ్చారు.