
బాలీవుడ్ నటి అనుప్రియా గోయెంకా(Anupriya Goenka) ఒక ముద్దు సీన్‌లో చాలా ఇబ్బంది పడ్డానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగులో పోటుగాడు, పాఠశాల సినిమాలతో తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ టైగర్ 3, పద్మావత్ వంటి సినిమాలతో పాటు పాంచాలి, అసుర్, ఆశ్రమ్ వంటి వెబ్ సిరీస్‌లతో ఆమె మెప్పించింది. కథకు అవసరం అనుకుంటే ఇంటిమేట్ సీన్లలో నటించేందుకు ఆమె ఏమాత్రం తగ్గదు. అయితే, ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ఒక నటుడు తనతో కావాలనే అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు. ఆ నటుడి వివరాలను గోప్యంగానే ఉంచిన ఆమె ఇలా చెప్పుకొచ్చింది.
ఒక సినిమాకు సంబంధించి ముద్దు సీన్‌ను షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ సీన్‌లో నా దుస్తులు అసౌకర్యంగానే ఉంటాయి. కిస్సింగ్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు అతను తేలికగా నా నడుము పట్టుకోవచ్చు.. స్క్రిప్ట్‌లో కూడా అదే ఉంది. కానీ, ఆ సమయంలో అతను అసభ్యకరంగా మరోచోట చెయి వేశాడు. దీంతో చాలా బాధపడ్డాను. అలా ఎందుకు చేస్తున్నావ్ అని అతన్ని ప్రశ్నించవచ్చు.. కానీ, అడగలేదు. ఎందుకంటే పొరపాటు అయిందని సింపుల్‌గా చెప్పి వెళ్లిపోతాడని తెలుసు. అందుకే అడగలేదు. తర్వాతి టేక్‌లో ఇలా చేయకండి అంటూ అతనికి చెప్పాను. ఆ సీన్ తీస్తున్నప్పుడు అతను చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. నేనే కంట్రోల్ చేశాను. నాకు రెండుసార్లు ఇలా జరిగింది.' అని అనుప్రియా గోయెంకా చెప్పింది. 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ' టెలివిజన్ సిరీస్ గురించి ఆమె మట్లాడినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. తాను ఒక సినిమా షూటింగ్ కారవాన్‌లో డ్రెస్ మార్చుకుంటూ ఉండగా ఒక డైరెక్టర్ లోపలికి వచ్చేశాడని తెలిపింది. అనుమతి లేకుండా రావడంతో అతనిపై మండిపడినట్లు కూడా ఆమె పేర్కొంది. సౌత్ దర్శకుడు అని క్లూ ఇచ్చిన ఈ బ్యూటీ కూడా అతని పేరు చెప్పలేదు.