సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరంలో కొత్తగా అదనపు టీఎంసీ నీటిని ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు ఎత్తిపోసే ప్రణాళిక కొలిక్కి వచ్చింది. టన్నెల్ వ్యవస్థ ద్వారా నిర్మాణ ఖర్చు, గడువు పెరుగుతున్న నేపథ్యంలో ఎల్లంపల్లి దిగువన రెండు లిఫ్టులు, ఒక రిజర్వాయర్ నిర్మాణం ద్వారా పైప్‌లైన్‌ల నుంచే నీటిని ఎత్తిపోసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి మొత్తంగా రూ. 12,700 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదలశాఖ అంచనా వేసింది.
మూడో టీఎంసీ ద్వారా హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం చేపట్టే కేశవాపూర్ రిజర్వాయర్‌కు నీటిని అందించడంతోపాటు సింగూరు, నిజాంసాగర్, సూర్యాపేట జిల్లా వరకు ఉన్న ఎస్సారెస్పీ స్టేజ్–2 ఆయకట్టుకు నీటిని అందించనున్నారు. నీటి లభ్యత కరువైన సంవత్సరాల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూడాలని నిర్ణయించిన ప్రభుత్వం... బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగర్ ఆయకట్టుకు నీటిని తరలించే ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా అంచనా వ్యయం రూ. 12,700 కోట్లకు చేరనుందని నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి. బుధవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించి ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment