Ellampalli reservoir
-
ఒక రిజర్వాయర్..రెండు లిఫ్టులు
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరంలో కొత్తగా అదనపు టీఎంసీ నీటిని ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు ఎత్తిపోసే ప్రణాళిక కొలిక్కి వచ్చింది. టన్నెల్ వ్యవస్థ ద్వారా నిర్మాణ ఖర్చు, గడువు పెరుగుతున్న నేపథ్యంలో ఎల్లంపల్లి దిగువన రెండు లిఫ్టులు, ఒక రిజర్వాయర్ నిర్మాణం ద్వారా పైప్లైన్ల నుంచే నీటిని ఎత్తిపోసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి మొత్తంగా రూ. 12,700 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదలశాఖ అంచనా వేసింది. మూడో టీఎంసీ ద్వారా హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం చేపట్టే కేశవాపూర్ రిజర్వాయర్‌కు నీటిని అందించడంతోపాటు సింగూరు, నిజాంసాగర్, సూర్యాపేట జిల్లా వరకు ఉన్న ఎస్సారెస్పీ స్టేజ్–2 ఆయకట్టుకు నీటిని అందించనున్నారు. నీటి లభ్యత కరువైన సంవత్సరాల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూడాలని నిర్ణయించిన ప్రభుత్వం... బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగర్ ఆయకట్టుకు నీటిని తరలించే ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా అంచనా వ్యయం రూ. 12,700 కోట్లకు చేరనుందని నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి. బుధవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించి ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. -
డబ్బులు ఇవ్వండి... పట్టుకోండి...
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ‘డబ్బులు ఇవ్వండి.. పట్టుకోండి’.. అంటే దేని గురించి అని అనుకుంటున్నారా..? ఇందులోనే అసలు కథ ఉంది. దీనిలోకి వెళ్తే వివరాలిలా ఉన్నాయి. హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామ శివారులో గోదావరి నదిపై ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మత్స్య సంపద ఉంది. నిత్యం గుడిపేట పరిధిలోని మత్స్యకారులు చేపలు పడుతూ ఉపాధి పొందుతున్నారు. అయితే ప్రతీ ఏడాది జూలై 1 నుంచి మొదలు ఆగస్టు 31 వరకు అంటే సరిగ్గా రెండు నెలల పాటు చేపలు పట్టరాదని మత్స్యశాఖ నిబంధనల మేరకు స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయి. ఈ రెండు నెలల కాలంలో చేపల ఉత్పత్తి గణనీయంగా ఉంటుందనే కారణంతో చేపలు పట్టేందుకు నిషేదాజ్ఞలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మత్స్యకారులు చేపలు పట్టకుండా సంయమనంతో ఉన్నా ఇటీవల కొత్తగా వ్యవహరిస్తున్నారు. వివరాలు ఏంటని ఆరా తీస్తే అసలు భాగోతం బయటపడింది. గుడిపేట–నంనూర్ మత్స్యకారుల సంఘంలోని సభ్యులంతా ఒక తీ ర్మానం చేసుకున్నారు. దాదాపు వంద మంది స భ్యులు ఒక్కొక్కరూ రూ. 300ల వరకు వేసుకుని దాదాపు రూ. 30 వేలు జమ చేశారు. మత్స్యశాఖ ద్వారా చేపలు పట్టుకోకుండా నోటీసులు అందుకున్న సభ్యులంతా మత్స్యశాఖ అధికారులకు ఈ 30 వేలు ముట్టజెప్పి చేపలు పట్టుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అధికారులు ప్రాజెక్ట్ వైపు దృష్టి పెట్టకపోవడంతో వీరు దర్జాగా చేపలు అమ్మకుంటున్నారు. -
నీళ్లు ఫుల్
సాక్షి,సిటీబ్యూరో: మహానగరం తాగునీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణా, గోదావరి జలాలు పూర్తిస్థాయిలో ఉన్నాయని, సమీప భవిష్యత్‌లో తాగునీటి కష్టాలు ఉండబోవని బల్దియా కమిషనర్, జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ స్పష్టం చేశారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి నిత్యం 172 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని నగరానికి సరఫరా చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల్లో వరదనీరు చేరడంతో అక్కడి నుంచి ఎల్లంపల్లి జలాశయానికి నీటి ప్రవాహం మొదలైందన్నారు. ఈ జలాశయంలో నిరంతరాయంగా 20 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర తాగునీటి అవసరాలు, భవిష్యత్‌లో చేపట్టే ప్రాజెక్టులపై ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం 120 టీఎంసీల కృష్ణాజలాలు అందుబాటులో ఉన్నాయని, వీటితో ఐదేళ్ల పాటు నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల చొప్పున తరలించవచ్చని వివరించారు. మరో వందేళ్ల దాకా నగర తాగునీటి అవసరాలకు ఎలాంటి ఢోకాలేకుండా చూసేందుకు నగర శివార్లలో పది టీఎంసీల గోదావరి జలాలను నిల్వ చేసేందుకు కేశవాపూర్ స్టోరేజీ రిజర్వాయర్‌ను, పది టీఎంసీల కృష్ణా జలాలను నిల్వ చేసేందుకు వీలుగా దేవులమ్మ నాగారం వద్ద మరో స్టోరేజీ రిజర్వాయర్‌ను నిర్మిస్తామని తెలిపారు. కొండ పోచమ్మసాగర్ నుంచి ఘన్పూర్ నీటిశుద్ధి కేంద్రానికి 18 కి.మీ మార్గంలో భారీ పైపులైన్లు ఏర్పాటు చేసి గోదావరి జలాలను తరలించే వీలుందని, దీంతో నగరానికి తాగునీటి ఇబ్బందులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. గోదావరి రెండు, మూడు దశల పనులను సైతం చేపట్టి నగరానికి తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం నిత్యం 468 మిలియన్ గ్యాలన్ల కృష్ణా, గోదావరి జలాలను శుద్ధిచేసి నగర ప్రజలకు సరఫరా చేస్తున్నామన్నారు. నగరం చుట్టూ జలహారం ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ 158 కి.మీ మార్గంలో జలహారం ఏర్పాటు చేయనున్నట్టు దానకిశోర్ తెలిపారు. ఇందులో భాగంగా 3.6 మీటర్ల వ్యాసార్థ్యం గల భారీ రింగ్‌మెయిన్ పైపులైన్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 12 మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 12 రేడియల్ మెయిన్స్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.4725 కోట్లు ఖర్చవుతుందని, హడ్కో నుంచి రూ.2 వేల కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మరో రూ.1500 కోట్లు ఆర్థికసాయం అందించేందుకు ముందుకొచ్చాయన్నారు. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.8 వేల కోట్లతో సీవరేజీ మాస్టర్‌ప్లాన్ జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ పరిధి వరకు మురుగు అవస్థలు లేకుండా చూసేందుకు రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర సీవరేజీ మాస్టర్‌ప్లాన్ అమలు చేయనున్నట్లు ఎండీ తెలిపారు. నగరంలో నిత్యం వెలువడే 1700 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ప్రతి రెండు మూడు చెరువులకు ఒకటి చొప్పున 51 వికేంద్రీకృత శుద్ధి కేంద్రాలు నిర్మిస్తామన్నారు. రూ.586 కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్–2 ఓఆర్ఆర్ లోపలున్న గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల దాహార్తిని తీర్చేందుకు ఓఆర్ఆర్ తాగునీటి పథకం ఫేజ్–2ను రూ.586 కోట్లతో చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. ఈ నెలలోనే ఈ పథకానికి టెండర్లను పిలిచి మరో ఏడాదిలో అందుబాటులోకి తెస్తామని ఆయన ప్రకటించారు. నగరంలో నిత్యం 50 మిలియన్ గ్యాలన్ల తాగునీరు వృథా అవుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వాక్ వలంటీర్లు, స్వయం సహాయక బృందాలు, జలమండలి, జీహెచ్ఎంసీ సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ, డైరెక్టర్లు ఎల్లాస్వామి, శ్రీధర్‌బాబు, సత్య సూర్యనారాయణ, రవి, కృష్ణ, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అనగనగా ఓ ‘శాతకర్ణి’ కథ
సాక్షి, ధర్మపురి : ఎల్లంపల్లి జలాశయం మధ్యలో నాలుగు రోజుల క్రితం చిక్కుకున్న పర్యాటక శాఖ బోటు ‘శాతకర్ణి’ని ఎట్టకేలకు అధికారులు సోమవారం ఒడ్డుకు చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. చారిత్రక సుందర ప్రదేశమైన కోటిలింగాలలోని ఎల్లంపల్లి జలాశయంలో పర్యాటక శాఖ రెండు పెద్ద బోట్లు, ఒక స్పీడ్ బోట్‌ను బోటింగ్ కోసం ఏర్పాటు చేసింది. ప్రతీరోజు చాలా మంది వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బోటింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాలుగు రోజుల క్రితం శాతకర్ణి అనే పేరుగల బోటులో 8 మంది పర్యాటకులతో డ్రైవర్ బోటింగ్ చేస్తూ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బోటు జలాశయం మధ్యలో బండరాయికి తాకి అక్కడే చిక్కుకు పోయింది. అయితే అందులో ప్రయాణిస్తున్న పర్యాటకులతో పాటు డ్రైవర్‌ను స్పీడు బోటును సహాయంతో అదేరోజు ఒడ్డుకు చేర్పగలిగారు. కాని శాతకర్ణి బోటును మాత్రం కదలకుండా మొరాయించడంతో డ్రైవర్ దానిని అక్కడే వదిలేశాడు. శాతకర్ణి బోటు నాలుగు రోజులుగా నదిలోనే ఉండిపోయింది. బోటింగ్‌ను పూర్తిగా నిలిపివేశారు. నది మట్టం బాగా తగ్గిపోవటంతో ఇతర బోట్లను కూడా అధికారులు తీరంలోనే ఉంచారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారి ఉపేందర్ కరీంనగర్ నుంచి తెచ్చిన రెండు స్పీడ్ బోట్ల ఇంజన్ల సహాయంతో శాతకర్ణిని బండరాయి నుంచి తప్పించి తీరానికి చేర్చారు. నదిలో చిక్కుకున్న బోటుకు ఎలాంటి నష్టం జరుగలేదని తెలిపారు. బోటింగ్ కోసం ప్రత్యేకంగా మేనేజర్‌ను నియమించకపోవడంతో నిర్వహణ గాడితప్పిందని విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరిలో నీటి మట్టం బాగా తగ్గిందని తెలిసి కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా బోటును నదిలోకి తీసుకెళ్లడం నిర్వాహకుల పనితీరుకు అద్దం పడుతోంది. బోటింగ్ నిర్వహణను ప్రత్యేకంగా ఒక మేనేజర్‌ను నియమించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. -
మహా గండం!
సిటీబ్యూరో: మహానగర దాహార్తిని తీరుస్తున్న గోదావరి పైపులైన్లకు అడుగుకో గండం పొంచి ఉంది. ఈ జలాలు తమకూ పంచాలని సమీప గ్రామాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. గ్రేటర్‌కు తాగునీరు అందించేందుకు కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి నగర శివారు ఘన్పూర్ వరకు 186 కిలోమీటర్ల మేర పైపులైన్ వేశారు. ఈ మార్గంలో నిత్యం 86 మిలియన్ల గోదావరి జలాలను సిటీకి తరలిస్తున్నారు. ఈ పైపులైన్‌కు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు తమకు తాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా పైపులైన్ల వాల్వ్‌లు తొలగించి మరీ నీటిని మళ్లించుకుంటున్నారు. తాజాగా (శుక్రవారం) కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం పూసల గ్రామంలో ఆ జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడ్డారు. పైపులైన్‌కు ఉన్న బటర్‌ఫ్లై వాల్వ్ కవర్‌ను తొలగించి నీటిని సమీప చెరువు, కుంటలకు మళ్లించుకున్నారు. దీన్ని పసిగట్టిన జలమండలి సిబ్బంది తొలగించిన వాల్వ్ కవర్‌ను బిగించడంతో ప్రమాదం తప్పింది. కాగా, ప్రస్తుతం మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలు వట్టిపోవడంతో ఇపుడు కృష్ణా గోదావరి జలాలే నగర గొంతు తడుపుతున్నాయి. కృష్ణా మూడు దశల ద్వారా 270 మిలియన్ గ్యాలన్లు, గోదావరి ద్వారా 86 ఎంజీడీలు వెరసి రోజుకు 356 ఎంజీడీల నీటిని జలమండలి నగరంలోని 8.75 లక్షల నల్లాలకు అందిస్తోంది. మహానేత చొరవతో.. నగర నీటి అవసరాల కోసం కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివారు ఘన్పూర్ వరకు గోదావరి మంచినీటి పథకం మొదటిదశ (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సుజలస్రవంతి) పథకాన్ని రూ.3800 కోట్లతో పూర్తి చేశారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో 2008లో మొదలైన ఈపనులు 2015 నాటికి సాకారమయ్యాయి. ఈ జలాల రాకతో నగరంలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ తదితర నియోజకవర్గాలకు తాగునీటి కష్టాలు తీరాయి. తాజాగా ఈ పైపులైన్లకు అడుగుకో గండం నెలకొనడంతో నగర తాగునీటి అవసరాలకు తరలిస్తున్న నీటికి గండి పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ రెండు జిల్లాల నుంచే వత్తిడి సిటీకి తరలిస్తున్న గోదావరి జలాలు కరీంనగర్, మెదక్ జిల్లాల మీదుగా వస్తున్నాయి. అయితే, తమ ప్రాంతం నుంచి వెళుతున్నందున ఆ నీటితో తమ దాహార్తిని కూడా తీర్చాలని పైపులైన్లకు ఆనుకొని ఉన్న పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా గోదావరి జలాలను శుద్ధి చేస్తున్న కొండపాక మంచినీటి శుద్ధి కేంద్రం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు తాగునీటిని తరలిస్తుండడంతో మిగతా నియోజకవర్గాలకు కూడా తాగునీటిని తరలించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఆయా ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో పశువులకు సైతం తాగునీరు దొరకడం లేదు. దీంతో పైప్‌లైన్ వాల్వ్‌లను తొలగించక తప్పడంలేదని స్థానికులు చెబుతున్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసు గోదావరి పైపులైన్లకున్న వాల్వ్‌లు, వాటి కవర్లు తొలగించి నీటిని మళ్లిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని జలమండలి వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో జరిగిన సంఘటనలతో పాటు తాజా ఘటనకు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపాయి. భారీ పైపులైన్లకు ఉన్న వాల్వ్ కవర్లను తరచూ తొలగిస్తుండడంతో పైపులైన్ల ద్వారా తరలిస్తున్న తాగునీరు పలు చోట్ల లీకవుతోం దని.. లీకేజీని అరికట్టాలంటే ఒకరోజు నగరానికి గోదావరి నీటి సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుత తరుణంలో నగరంలో తాగునీటి డిమాండ్ అధికంగా ఉన్నందున సరఫరా నిలిపివేసే పరిస్థితి లేదు. ఇక వర్షాకాలంలోనే ఈ లీకేజీలకు మరమ్మతులు చేపట్టనున్నారు.