సాక్షి, ధర్మపురి : ఎల్లంపల్లి జలాశయం మధ్యలో నాలుగు రోజుల క్రితం చిక్కుకున్న పర్యాటక శాఖ బోటు ‘శాతకర్ణి’ని ఎట్టకేలకు అధికారులు సోమవారం ఒడ్డుకు చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. చారిత్రక సుందర ప్రదేశమైన కోటిలింగాలలోని ఎల్లంపల్లి జలాశయంలో పర్యాటక శాఖ రెండు పెద్ద బోట్లు, ఒక స్పీడ్ బోట్‌ను బోటింగ్ కోసం ఏర్పాటు చేసింది. ప్రతీరోజు చాలా మంది వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బోటింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాలుగు రోజుల క్రితం శాతకర్ణి అనే పేరుగల బోటులో 8 మంది పర్యాటకులతో డ్రైవర్ బోటింగ్ చేస్తూ వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో బోటు జలాశయం మధ్యలో బండరాయికి తాకి అక్కడే చిక్కుకు పోయింది. అయితే అందులో ప్రయాణిస్తున్న పర్యాటకులతో పాటు డ్రైవర్‌ను స్పీడు బోటును సహాయంతో అదేరోజు ఒడ్డుకు చేర్పగలిగారు. కాని శాతకర్ణి బోటును మాత్రం కదలకుండా మొరాయించడంతో డ్రైవర్ దానిని అక్కడే వదిలేశాడు. శాతకర్ణి బోటు నాలుగు రోజులుగా నదిలోనే ఉండిపోయింది. బోటింగ్‌ను పూర్తిగా నిలిపివేశారు. నది మట్టం బాగా తగ్గిపోవటంతో ఇతర బోట్లను కూడా అధికారులు తీరంలోనే ఉంచారు.
సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారి ఉపేందర్ కరీంనగర్ నుంచి తెచ్చిన రెండు స్పీడ్ బోట్ల ఇంజన్ల సహాయంతో శాతకర్ణిని బండరాయి నుంచి తప్పించి తీరానికి చేర్చారు. నదిలో చిక్కుకున్న బోటుకు ఎలాంటి నష్టం జరుగలేదని తెలిపారు. బోటింగ్ కోసం ప్రత్యేకంగా మేనేజర్‌ను నియమించకపోవడంతో నిర్వహణ గాడితప్పిందని విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరిలో నీటి మట్టం బాగా తగ్గిందని తెలిసి కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా బోటును నదిలోకి తీసుకెళ్లడం నిర్వాహకుల పనితీరుకు అద్దం పడుతోంది. బోటింగ్ నిర్వహణను ప్రత్యేకంగా ఒక మేనేజర్‌ను నియమించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment