kotilingala
-
అనగనగా ఓ ‘శాతకర్ణి’ కథ
సాక్షి, ధర్మపురి : ఎల్లంపల్లి జలాశయం మధ్యలో నాలుగు రోజుల క్రితం చిక్కుకున్న పర్యాటక శాఖ బోటు ‘శాతకర్ణి’ని ఎట్టకేలకు అధికారులు సోమవారం ఒడ్డుకు చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. చారిత్రక సుందర ప్రదేశమైన కోటిలింగాలలోని ఎల్లంపల్లి జలాశయంలో పర్యాటక శాఖ రెండు పెద్ద బోట్లు, ఒక స్పీడ్ బోట్‌ను బోటింగ్ కోసం ఏర్పాటు చేసింది. ప్రతీరోజు చాలా మంది వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బోటింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాలుగు రోజుల క్రితం శాతకర్ణి అనే పేరుగల బోటులో 8 మంది పర్యాటకులతో డ్రైవర్ బోటింగ్ చేస్తూ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బోటు జలాశయం మధ్యలో బండరాయికి తాకి అక్కడే చిక్కుకు పోయింది. అయితే అందులో ప్రయాణిస్తున్న పర్యాటకులతో పాటు డ్రైవర్‌ను స్పీడు బోటును సహాయంతో అదేరోజు ఒడ్డుకు చేర్పగలిగారు. కాని శాతకర్ణి బోటును మాత్రం కదలకుండా మొరాయించడంతో డ్రైవర్ దానిని అక్కడే వదిలేశాడు. శాతకర్ణి బోటు నాలుగు రోజులుగా నదిలోనే ఉండిపోయింది. బోటింగ్‌ను పూర్తిగా నిలిపివేశారు. నది మట్టం బాగా తగ్గిపోవటంతో ఇతర బోట్లను కూడా అధికారులు తీరంలోనే ఉంచారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారి ఉపేందర్ కరీంనగర్ నుంచి తెచ్చిన రెండు స్పీడ్ బోట్ల ఇంజన్ల సహాయంతో శాతకర్ణిని బండరాయి నుంచి తప్పించి తీరానికి చేర్చారు. నదిలో చిక్కుకున్న బోటుకు ఎలాంటి నష్టం జరుగలేదని తెలిపారు. బోటింగ్ కోసం ప్రత్యేకంగా మేనేజర్‌ను నియమించకపోవడంతో నిర్వహణ గాడితప్పిందని విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరిలో నీటి మట్టం బాగా తగ్గిందని తెలిసి కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా బోటును నదిలోకి తీసుకెళ్లడం నిర్వాహకుల పనితీరుకు అద్దం పడుతోంది. బోటింగ్ నిర్వహణను ప్రత్యేకంగా ఒక మేనేజర్‌ను నియమించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. -
మునిగిన కోటిలింగాల లోలెవల్ వంతెన
వెల్గటూరు : వెల్గటూరు మండలంలోని కోటిలింగాల ప్రధాన రహదారిలో అలుగు ఒర్రెపై ఉన్న లో లెవల్‌వంతెన ఎల్లంపెల్లి బ్యాక్ వాటర్‌లో మంగళవారం మునిగిపోయింది. గ్రామానికి బయట నుంచి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ప్రజలు వంతెన పైనుంచి మూడు ఫీట్ల లోతు నీళ్లతో నడిచి వెళ్తున్నారు. నీటిమట్టం పెరుగుతున్నందున స్కూల్ ఆటోలు మధ్యాహ్నమే పిల్లలను దిగబెట్టి వెళ్లాయి. బుధవారం తెల్లవారేసరికి నీటిమట్టం మరింత పెరిగి కోటిలింగాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోనున్నాయి. నాలుగు రోజులుగా వంతెన మునిగి పోతుందని అధికారులను ‘సాక్షి’ హెచ్చరిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవటం గమనార్హం. రాకపోకలు నిలిచిపోవటంతో నిర్వాసితులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. సంబంధిత అధికాకరులు స్పందించి తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. -
మునిగిన పుష్కరఘాట్లు
వెల్గటూరు : మండలంలోని కోటిలింగాలలో గోదావరి ఆదిపుష్కరాల కోసం ఏడాది క్రితం నిర్మించిన పుష్కర ఘాట్లు వరద నీటిలో శుక్రవారం పూర్తిగా మునిగిపోయాయి. అంత్యపుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో పెద్ద సంఖ్యలో భక్తులు కోటిలింగాలకు చేరుకుంటున్నారు. పుష్కరఘాట్లు పూర్తిగా మునిగి పోవడంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. గోదావరి సమీపంలో ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడంతోపాటు హెచ్చరికలు జారీ చేసే సిబ్బంది సైతం కనిపించడం లేదు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టే వరకు రెవెన్యూ లేదా పోలీసుల పహారాను ఏర్పాటు చేయాలి. బట్టలు మార్చుకునేందుకు నిర్మించిన గదులను, ఆలయ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను సైతం వరదనీరు చుట్టుముట్టింది. వరద మరింత పెరిగితే ఆలయ పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. గోదావరి శాంతించే వరకు ఇక్కడ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. -
గోదావరికి పెరుగుతున్న వరద నీరు
భయాందోళనలో ముంపుగ్రామాల ప్రజలు వెల్గటూరు: గోదావరిలో బ్యాక్‌వాటర్ ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. రెండు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వెల్గటూర్ మండలంలోని ఉండెడ, చెగ్యాం, మక్కట్రావుపేట, కోటిలింగాల గ్రామాలను ఎల్లంపెల్లి బ్యాక్ వాటర్ చుట్టుముడుతోంది. చెగ్యాం, మక్కట్రావుపేట, ఉండెడ గ్రామాల్లో ఎస్సీకాలనీల సమీపంలోకి వరద నీరు చేరుకుంది. కోటిలింగాలలో పుష్కరఘాట్లకు చెందిన మరో మూడు మెట్లు మునిగితే గ్రామంలోని నీరు చేరుతుంది. ఇప్పటికే కోటిలింగాలలో దక్షిణ భాగంలో ఉన్న పంట పొలాలన్నీ మునిగిపోయాయి. 12 టీఎంసీల నీటి మట్టం వద్దనే ఇలా ఉంటే.. 20 టీఎంసీలు వచ్చి చేరితే గ్రామాల్లోకి నీరు వచ్చి చేరుతుందని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ముంపు గ్రామాల కోసం పునరావాస కాలనీలో తక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఏ రాత్రియినా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. -
అడవిలో యువతి అనుమానాస్పద మృతి
మేళ్లచెర్వు: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం కోటిలింగాల వద్ద అటవీ ప్రాంతంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా శనివారం ఉదయం వెలుగు చూసింది. మృతి చెందిన యువతి నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలం బుగ్గమాదారం గ్రామానికి చెందిన ఆవుల త్రివేణి(19)గా గుర్తించారు. త్రివేణి గత ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. కోటి లింగాల వద్ద అటవీ ప్రాంతంలో మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్యచేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కోటిలింగాలకు పోటెత్తిన భక్తులు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో పుష్కర స్నానాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారు జామున నుంచి ఘాట్ల వద్ద భక్తులు బారులు తీరారు. దీంతో అధికారులు అక్కడకు వస్తున్న భక్తులను ధర్మపురికి తరలిస్తున్నారు. గోదావరిలో నీటి మట్టం పెరుగుతుండటంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మంథనిలో భక్తుల రద్దీ సోమవారం సాధారణంగా ఉంది. పుష్కర భక్తులతో వేములవాడలో రద్దీ పెరిగింది.