కరీంనగర్ జిల్లాలో ఎరువుల కమీషన్ నొక్కేసిన ఓ ఉద్యోగి
ఇతర జిల్లాల్లోనూ ఇలా రూ. కోట్లలో అక్రమాలకు పాల్పడినట్టు అనుమానాలు
వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ తదితర ఉమ్మడి జిల్లాలపై నిఘా
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో ఎరువులు అమ్మగా వచ్చిన కోట్లాది రూపాయల సొమ్మును కొందరు ఉద్యోగులు కాజేస్తున్నారు. ఇది మంగళవారం వెలుగులోకి వచి్చంది. కరీంనగర్ జిల్లాలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఒక ఎరువుల యూనిట్‌కు చెందిన డబ్బును అందులో పనిచేసే ఒక ఉద్యోగి ఏకంగా రూ. 60 లక్షలు కాజేయడం వ్యవసాయశాఖను కుదిపేసింది. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఎరువుల యూనిట్‌ను నడుపుకునేందుకు మార్క్‌ఫెడ్‌లో పనిచేసే ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి అవకాశం కలి్పంచారు.
అంటే అందులో పనిచేసే ఉద్యోగే తాను ఒక లైసెన్స్‌డ్ షాపు నిర్వహిస్తున్నాడన్నమాట. దానికి ఎరువులను మార్క్‌ఫెడ్ నుంచి తెప్పించుకున్నాడు. ఆ షాపులో తాను అమ్మగా వచి్చన ఆదాయంలో మార్క్‌ఫెడ్‌కు 50 శాతం కమీషన్ చెల్లించాలి. కానీ ఆ సొమ్మును మార్క్‌ఫెడ్ రికార్డుల్లోని కాగితాల్లో మాత్రమే రాసి పెట్టి, డబ్బులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా రూ.60 లక్షలు కాజేసినట్టు తేలింది. అయినా అక్కడి అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించారు.
గతంలోనూ అక్కడ ఇంకా ఏమైనా ఇలాంటి సంఘటనలు జరిగాయా లేదా అన్నదానిపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం హైదరాబాద్‌లో మార్క్‌ఫెడ్ డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక అధికారి అక్కడి మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలోనూ ఇలాంటి సంఘటన జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. అతనిపైనా నిఘా పెట్టారు. ఆయన్ను వివరణ కోసం ప్రయతి్నంచగా, తనకు సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం.
మరోవైపు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయా లేదా అన్నదానిపై నిఘా పెట్టినట్టు తెలిసింది. జిల్లాలో మార్క్‌ఫెడ్ అధికారుల ప్రమేయం లేకుండా ఈ ఘటనలు జరగవని అంటున్నారు. రాష్ట్రస్థాయిలో ఎక్కడెక్కడ ఇలాంటి కమీషన్లు కాజేసిన ఘటనలు జరిగాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘టెండర్ దక్కకుంటే నీ అంతుచూస్తా’
ఇదిలాఉండగా, మార్క్‌ఫెడ్‌లో ఎరువుల రవాణాకు సంబంధించి హైదరాబాద్‌లో టెండర్‌ప్రక్రియ జరుగుతోంది. అందులో పలు ఏజెన్సీలు టెండర్లు వేశాయి. కొన్ని ఏజెన్సీలు టెండర్లలో సాంకేతికంగా అర్హత పొందాయి. అయితే అందులో ఒక ఏజెన్సీ నిర్వాహకుడు మార్క్‌ఫెడ్‌లోని ఒక అధికారికి ఫోన్ చేసి తనకు ఈ టెండర్ దక్కకుంటే ‘నీ అంతు చూస్తాన’ని ఫోన్‌లో బెదిరించినట్టు సమాచారం. దానికి మార్క్‌ఫెడ్‌లోనే పనిచేసే సహ అధికారే వెనుక నుంచి కథ నడిపిస్తున్నట్టు సమాచారం. ఆ అధికారే ఆ ఏజెన్సీ నిర్వాహకుడికి టెండర్ దక్కేలా పావులు కదుపుతున్నాడు. అతని ప్రోద్బలంతోనే ఇలా జరిగి ఉంటుందని చర్చ జరుగుతోంది. దీంతో బెదిరింపులకు గురైన అధికారికి ఏం చేయాలో పాలుపోవడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment