నీళ్లు ఫుల్‌ | No Water Problems in Hyderabad Said GHMC Commissioner | Sakshi
Sakshi News home page

నీళ్లు ఫుల్‌

Published Thu, Jul 18 2019 11:20 AM | Last Updated on Thu, Jul 18 2019 11:20 AM

No Water Problems in Hyderabad Said GHMC Commissioner - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: మహానగరం తాగునీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణా, గోదావరి జలాలు పూర్తిస్థాయిలో ఉన్నాయని, సమీప భవిష్యత్‌లో తాగునీటి కష్టాలు ఉండబోవని బల్దియా కమిషనర్, జలమండలి ఎండీ ఎం.దానకిశోర్‌ స్పష్టం చేశారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి నిత్యం 172 మిలియన్‌ గ్యాలన్ల  తాగునీటిని నగరానికి సరఫరా చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల్లో వరదనీరు చేరడంతో అక్కడి నుంచి ఎల్లంపల్లి జలాశయానికి నీటి ప్రవాహం మొదలైందన్నారు. ఈ జలాశయంలో నిరంతరాయంగా 20 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర తాగునీటి అవసరాలు, భవిష్యత్‌లో చేపట్టే ప్రాజెక్టులపై ఆయన మాట్లాడారు.

నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం 120 టీఎంసీల కృష్ణాజలాలు అందుబాటులో ఉన్నాయని, వీటితో ఐదేళ్ల పాటు నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిత్యం 270 మిలియన్‌ గ్యాలన్ల చొప్పున తరలించవచ్చని వివరించారు. మరో వందేళ్ల దాకా నగర తాగునీటి అవసరాలకు ఎలాంటి ఢోకాలేకుండా చూసేందుకు నగర శివార్లలో పది టీఎంసీల గోదావరి జలాలను నిల్వ చేసేందుకు కేశవాపూర్‌ స్టోరేజీ రిజర్వాయర్‌ను, పది టీఎంసీల కృష్ణా జలాలను నిల్వ చేసేందుకు వీలుగా దేవులమ్మ నాగారం వద్ద మరో స్టోరేజీ రిజర్వాయర్‌ను నిర్మిస్తామని తెలిపారు. కొండ పోచమ్మసాగర్‌ నుంచి ఘన్‌పూర్‌ నీటిశుద్ధి కేంద్రానికి 18 కి.మీ మార్గంలో భారీ పైపులైన్లు ఏర్పాటు చేసి గోదావరి జలాలను తరలించే వీలుందని, దీంతో నగరానికి తాగునీటి ఇబ్బందులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. గోదావరి రెండు, మూడు దశల పనులను సైతం చేపట్టి నగరానికి తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం నిత్యం 468 మిలియన్‌ గ్యాలన్ల కృష్ణా, గోదావరి జలాలను శుద్ధిచేసి నగర ప్రజలకు సరఫరా చేస్తున్నామన్నారు.

నగరం చుట్టూ జలహారం
ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ 158 కి.మీ మార్గంలో జలహారం ఏర్పాటు చేయనున్నట్టు దానకిశోర్‌ తెలిపారు. ఇందులో భాగంగా 3.6 మీటర్ల వ్యాసార్థ్యం గల భారీ రింగ్‌మెయిన్‌ పైపులైన్‌ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 12 మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు, 12 రేడియల్‌ మెయిన్స్‌ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.4725 కోట్లు ఖర్చవుతుందని, హడ్కో నుంచి రూ.2 వేల కోట్లు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మరో రూ.1500 కోట్లు ఆర్థికసాయం అందించేందుకు ముందుకొచ్చాయన్నారు. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

రూ.8 వేల కోట్లతో సీవరేజీ మాస్టర్‌ప్లాన్‌
జీహెచ్‌ఎంసీతో పాటు ఓఆర్‌ఆర్‌ పరిధి వరకు మురుగు అవస్థలు లేకుండా చూసేందుకు రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర సీవరేజీ మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయనున్నట్లు ఎండీ తెలిపారు. నగరంలో నిత్యం వెలువడే 1700 మిలియన్‌ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ప్రతి రెండు మూడు చెరువులకు ఒకటి చొప్పున 51 వికేంద్రీకృత శుద్ధి కేంద్రాలు నిర్మిస్తామన్నారు.  

రూ.586 కోట్లతో ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌–2  
ఓఆర్‌ఆర్‌ లోపలున్న గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీల దాహార్తిని తీర్చేందుకు ఓఆర్‌ఆర్‌ తాగునీటి పథకం ఫేజ్‌–2ను రూ.586 కోట్లతో చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. ఈ నెలలోనే ఈ పథకానికి టెండర్లను పిలిచి మరో ఏడాదిలో అందుబాటులోకి తెస్తామని ఆయన ప్రకటించారు. నగరంలో నిత్యం 50 మిలియన్‌ గ్యాలన్ల తాగునీరు వృథా అవుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వాక్‌ వలంటీర్లు, స్వయం సహాయక బృందాలు, జలమండలి, జీహెచ్‌ఎంసీ సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ, డైరెక్టర్లు ఎల్లాస్వామి, శ్రీధర్‌బాబు, సత్య సూర్యనారాయణ, రవి, కృష్ణ, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement